
మహిళలకు రక్షణ కరువు
భీమవరం: కూటమి ప్రభుత్వ హయాంలో మహిళలకు రక్షణ కరువైందని వరుస ఘటనలతో మహిళలు, యువత, బాలికలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని వైఎస్సార్సీపీ నరసాపురం పార్లమెంట్ సమన్వయకర్త గూడూరి ఉమాబాల ఆందోళన వ్యక్తం చేశారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అయిదేళ్ల పాలనలో మహిళలకు అన్నిరంగాల్లో పెద్దపీట వేసి అండగా నిలిస్తే నేడు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో మహిళలపై అఘాయిత్యాలు, హత్యాచారాలు, దాడులు, హత్యలు పెచ్చుమీరిపోయాయన్నారు. జగన్ ప్రభుత్వం మహిళలకు అనేక సంక్షేమ పథకాలు అమలుచేసి పెద్దన్నగా అండగా నిలిచారని ఐదేళ్లపాటు మహిళలు సుఖ, సంతోషాలతో జీవనం సాగిస్తే నేడు దినదిన గండంగా జీవనం సాగించాల్సి వస్తుందని ఉమాబాల వాపోయారు. కాకినాడ జీజీహెచ్ పారామెడికల్ విద్యార్థుల వీడియోలు తీసి బెదిరింపులకు పాల్పడితే ప్రభుత్వం చేష్టలుడిగి చూస్తోందని దుయ్యబట్టారు. కృష్ణా జెడ్పీ చైర్పర్సన్ ఉప్పాల హారికపై దాడి సభ్యసమాజం తలదించుకునేలా ఉందన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుంచి మహిళలపై దాడులు పెరుగుతూనే ఉన్నాయని ఇలంటి వాటికి ప్రజలు తగిన గుణపాఠం చెబుతారన్నారు.