
బీజీబీఎస్ పాలకవర్గ ఆగడాలపై చర్యలు తీసుకోవాలి
నరసాపురం: బీజీబీఎస్ మహిళా కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ నూలి శ్రీనివాస్, పాలకవర్గంపై ఆగడాలపై చర్యలు తీసుకోవాలని అఖిలపక్ష నాయకులు డిమాండ్ చేశారు. కళాశాలలో కాంట్రాక్ట్ పద్ధతిపై పని చేస్తున్న నలుగురు మహిళా అధ్యాపకులు గత 15 రోజులుగా కళాశాల వద్ద ఆందోళన చేస్తున్నసంగతి తెలిసిందే. తమను అకారణంగా విధులు నుంచి తొలగించి పాలకవర్గం దుర్మార్గంగా వ్యవహరిస్తుందని ఆరోపిస్తూ ఆందోళన చేస్తున్నారు. శుక్రవారం అధ్యాపకులకు మద్దతుగా నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో వైఎస్సార్ సీపీ కేంద్ర పాలక మండలి సభ్యుడు పీడీ రాజు మాట్లాడుతూ కళాశాల ఆస్తులు అమ్మకానికి పెట్టడం, మహిళా అధ్యాపకులపై లైగింక వేధింపులకు పాల్పడం దారుణమన్నారు. అధికారులకు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోకపోవడం ఏంటి అని ప్రశ్నించారు. రానున్న రోజుల్లో ఆందోళన మరింత ఉధృతం చేయాలని సమావేశంలో నిర్ణయించారు. సమావేశంలో ఐద్వా జిల్లా కార్యదర్శి పొగాకు పూర్ణ, సీపీఎం నేత కవురు పెద్దిరాజు, కోట్ల రామ్‌కుమార్, త్రినాథ్ తదితరులు పాల్గొన్నారు.