
పారిజాతగిరి హుండీ లెక్కింపు
జంగారెడ్డిగూడెం : పట్టణంలోని గోకుల తిరుమల పారిజాతగిరిలో గురువారం హుండీ లెక్కింపు నిర్వహించారు. దేవదాయశాఖ ఏలూరు జిల్లా ఇన్‌స్పెక్టర్ వి.సురేష్‌కుమార్ పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరిగింది. మొత్తం 105 రోజులకు గాను రూ.11,35,112 ఆదాయం వచ్చినట్లు ఈవో కలగర శ్రీనివాస్ తెలిపారు. హుండీ లెక్కింపులో విజయవాడ, ఏలూరు, రిటైర్డ్ ఉద్యోగులు, కామయ్యపాలెం, పుట్లగట్లగూడెం సేవాసంఘం, ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు, ఇండియన్ బ్యాంకు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. కాగా ఆలయంలో గురుపౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామి వారికి తోమాల సేవ, తీర్థప్రసాద గోష్టి, తదితర పూజలు నిర్వహించారు. స్వామి వారిని నరసాపురం, పాలకొల్లు, తణుకు భక్తులు దర్శించుకున్నారు.
20న భీమవరంలో చెస్ టోర్నమెంట్
భీమవరం: ఇంటర్నేషనల్ చెస్ డేను పురస్కరించుకుని అనసూయ చెస్ అకాడమీ, వెస్ట్ గోదావరి చెస్ అసోసియేషన్స్ ఆధ్వర్యంలో ఈనెల 20వ తేదీన గ్రంధి వెంకటేశ్వరరావు మెమోరియల్ ఇన్విటేషనల్ ఏపీ స్టేట్ ఓపెన్ ర్యాపిడ్ చెస్ టోర్నమెంట్ పోటీలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకుడు మాదాసు కిషోర్ చెప్పారు. గురువారం టోర్నమెంట్ బ్రోచర్ ఆవిష్కరించి వివరాలను వెల్లడించారు. పట్టణంలోని తాలూకా ఆఫీసు సెంటర్‌లోని జీవీఆర్ కళ్యాణ మండపంలో టోర్నమెంట్ జరుగుతుందన్నారు. పోటీల్లో పాల్గొనే క్రీడాకారులకు ఉచితంగా మాస్టర్ చెస్ బోర్డులు, విజేతలకు రూ.20 వేల నగదు బహుమతులు అందిస్తామన్నారు. కార్యక్రమంలో చెస్ అసోసియేషన్ జిల్లా గౌరవాధ్యక్షుడు తోట భోగయ్య విజ్ఞాన వేదిక సేవా సంస్థ అధ్యక్షుడు అల్లు శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.
సెల్‌ఫోన్ దొంగల అరెస్ట్
భీమవరం: ఓ వ్యక్తి నుంచి సెల్‌ఫోన్ దొంగిలించిన ఇరువుర్ని అరెస్టు చేసినట్లు వన్‌టౌన్ సీఐ ఎం నాగరాజు చెప్పారు. గురువారం ఉదయం వీరమ్మపార్క్ వద్ద సుంకర ఏసుదాసు వాకింగ్ చేస్తుండగా తణుకు పట్టణం అజ్జరం కాలనీకి చెందిన పులిగోరి నాని, అనకాపల్లికి చెందిన షేక్ అలిషా కత్తితో బెదిరించి ఏసుదాసు వద్ద సెల్‌ఫోన్ లాక్కున్నారు. ఏసుదాసు తన స్నేహితుల సహాయంతో నిందితులను పట్టుకుని పోలీసుస్టేషన్‌కు అప్పగించారు. కేసు నమోదు చేసి అరెస్ట్ చేసిన నిందితులను కోర్టులో హాజరుపర్చగా రిమాండ్ విధించినట్లు సీఐ నాగరాజు తెలిపారు.
వ్యభిచారం కేసులో నిందితుడి అరెస్ట్
భీమవరం: వ్యభిచారం కేసులో పాతనేరస్తుడ్ని అరెస్ట్ చేసినట్టు భీమవరం వన్‌టౌన్ సీఐ ఎం నాగరాజు గురువారం చెప్పారు. 2020 మే 13వ తేదీన పట్టణంలోని లాడ్జిలో మహిళలతో వ్యభిచారం చేయిస్తున్న కేసులో రాజమహేంద్రవరం నగరానికి చెందిన కె సాయిరామ్‌ను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చగా న్యాయమూర్తి రిమాండ్ విధించారని సీఐ నాగరాజు తెలిపారు. ఈ కేసులో గతంలోనే ఇద్దర్ని అరెస్ట్ చేసినట్లు చెప్పారు.