
కంటైనర్ బోల్తా.. 14 ఆవుల మృతి
దెందులూరు: జాతీయరహదారిపై ఆవులను తరలిస్తున్న కంటైనర్ వాహనం బోల్తా పడి 14 ఆవులు మృతిచెందగా 6 తీవ్రంగా, 15 ఆవులు స్పల్పంగా గాయపడ్డాయి. ఈ ఘటన ఏలూరు జిల్లా దెందులూరు మండలం సోమవరప్పాడు వద్ద చోటుచేసుకుంది. విశాఖ నుంచి ఇతర ప్రాంతాలకు ఆవులను తరలిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న దెందులూరు ఎస్సై ఆర్.శివాజీ, సిబ్బందితో ఘటనాస్థలికి చేరుకున్నారు. వెంటనే మండల పశువైద్యాధికారి డాక్టర్ హరికి సమాచారం అందించగా ఆయన వైద్య సిబ్బందితో వచ్చి గాయపడిన ఆవులను సమీపంలోని గేదెల ఫారం వద్దకు తరలించి వైద్య సేవలందించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.
చికిత్స పొందుతూ యువకుడి మృతి
జంగారెడ్డిగూడెం: చికిత్స పొందుతూ ఓ యువకుడు మృతిచెందాడు. ఎస్సై షేక్ జబీర్ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని కేతవరం గ్రామానికి చెందిన బల్లే వెంకట నరసింహారావు చర్మంపై తెల్లటి మచ్చలు వచ్చి మంట, దురదతో గత రెండేళ్లుగా బాధపడుతున్నాడు. దీంతో మనస్తాపం చెంది పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. వాంతులు చేసుకోవడాన్ని గమనించిన కుటుంబ సభ్యులు నరసింహారావుని కొయ్యలగూడెంలోని ప్రైవేట్ ఆసుపత్రికి, అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం రాజమండ్రి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు. మృతుడి తండ్రి బల్లే గురవయ్య ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.
2 కిలోల గంజాయి స్వాధీనం
జంగారెడ్డిగూడెం: పట్టణంలో గురువారం జరిపిన దాడుల్లో జెడ్పీ హైస్కూల్ ఎదురుగా గంజాయి కలిగి ఉన్న షేక్ బాషా అనే వ్యక్తిని అరెస్టు చేసి అతని వద్ద నుంచి 2 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు సీఐ ఎంవీ సుభా ష్, ఎస్సై షేక్ జబీర్ తెలిపారు. నిందితుడిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచామన్నారు. జంగారెడ్డిగూడెం సర్కిల్‌ను గంజాయి రహితంగా చేసే కార్యక్రమంలో భాగంగా గట్టి నిఘా పెట్టి ఈ దాడులు చేసినట్లు చెప్పారు.