
అక్రమాలకు అడ్డా.. ఉండి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం
ఉండి: భూ అక్రమార్కులకు పశ్చిమగోదావరి జిల్లాలోని ఉండి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం అడ్డాగా మారిందంటూ రంగబాబు అనే వ్యక్తి గురువారం కార్యాలయం ముందు టెంట్ వేసి ఆందోళనకు దిగడం స్థానికంగా కలకలం రేపింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, చినగొల్లపాలెంలో తమ ఆస్తికి సంబంధించి అక్రమాలు జరుగుతున్నాయన్నారు. భూ అక్రమాలకు సంబంధించి తనతో పాటు మరికొందరు గత కొద్దికాలం నుంచి రిజిస్ట్రేషన్ కార్యాలయానికి రావడంతో సబ్ రిజిస్ట్రార్ సెలవుపై వెళ్లిపోయినట్టు పేర్కొన్నారు. కృష్ణాజిల్లాతో పాటు రాష్ట్రంలోని మరికొన్ని జిల్లాల నుంచి రిజిస్ట్రేషన్‌ల కొరకు ఉండికి తరలివస్తున్నట్టు తెలిపారు. ఎకరాకు రూ.లక్ష నుంచి రూ.3 లక్షల వరకు లంచాలు తీసుకుంటున్న అధికారులు భూ ఆక్రమణ దారులకు కొమ్ముకాస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు తగిన న్యాయం చేయకపోతే భార్యాబిడ్డలతో ఉండి రిజిస్ట్రార్ ఆఫీసు ముందు ఆత్మహత్యకు పాల్పడతానని హెచ్చరించారు. తమకు సంబంధించిన 32 ఎకరాల భూమిని అక్రమంగా ఆక్రమించుకునేందుకు ఓ మంత్రి సమీప ఉద్యోగి, రిజిస్ట్రేషన్ శాఖలో ఓ ఉన్నతాధికారి ప్రయత్నిస్తున్నట్లు తనకు అనుమానంగా ఉందని చెప్పారు. దీనిపై అధికారులు స్పందించి తనకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. కాగా, అక్రమ రిజిస్ట్రేషన్ల ఆరోపణలను సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ ఇన్‌చార్జి టి.శరాబందురాజు ఖండించారు. ఇలా చేయడం ఎవరివల్లా కాదన్నారు. ఆరోపణలు చేస్తున్న రంగబాబు ఆస్తి కోర్టు పరిధిలో, అదీ నిషేధిత భూముల జాబితాలోనూ ఉందని పేర్కొన్నారు. సబ్ రిజిస్ట్రార్ వ్యక్తిగత కారణాలతో సెలవుపై వెళ్ళారు గానీ, ఎవ్వరికీ భయపడికాదని స్పష్టం చేశారు.
కలకలం రేపిన బాధితుని ఆందోళన