
మహిళ హత్య కేసులో నిందితుడి అరెస్ట్
కై కలూరు: భార్య వివాహేతర సంబంధానికి సహాకరిస్తోందనే కోపంతో ఎదురింటి మహిళను కత్తితో నరికి చంపిన వ్యక్తిని పోలీసులు గురువారం అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెట్టారు. కై కలూరు సీఐ కార్యాలయంలో కేసు వివరాలను ఏలూరు డీఎస్పీ డి.శ్రావణ్‌కుమార్, రూరల్ సర్కిల్ సీఐ వి.రవికుమార్ వెల్లడించారు. కలిదిండి మండలం పోతుమర్రు శివారు గొల్లగూడెంలో మంగళవారం మధ్యాహ్నం భోజనానికి కూర్చున్న నంగెడ్డ వరలక్ష్మీదేవీ(39)ని ఎదురింటిలో నివాసం ఉంటున్న కట్టా రామాంజనేయులు(33) బయటకు పిలిచి కత్తితో నరికి పరారయ్యాడు. రామాంజనేయులు భార్య కృష్ణవేణి ఇదే గ్రామానికి చెందిన కట్టా నాగమల్లేశ్వరరావుతో చనువుగా ఉంటోంది. ఈ విషయాన్ని పలువురు గ్రామస్తులు భర్త రామాంజనేయులుకు చెప్పారు. మృతురాలు వరలక్ష్మీదేవీ నాగమల్లేశ్వరరావు వద్ద పనిచేస్తుండడంతో రామాంజనేయులు భార్య వివాహేతర సంబంధానికి వరలక్ష్మీదేవి సహాకరిస్తోందని గట్టిగా నమ్మాడు. దీంతో ఇంటి వద్ద ఒంటరిగా ఉన్న ఆమెను నరికి చంపి పరారయ్యాడు. కై కలూరు మండలం ఉప్పుటేరు వద్ద నిందితుడు రామాంజనేయులును పోలీసులు అరెస్టు చేశారు. సమావేశంలో కలిదిండి, కై కలూరు రూరల్, ముదినేపల్లి ఎస్సైలు వేంకటేశ్వరరావు, రాంబాబు, వీరభద్రరావు, సిబ్బంది పాల్గొన్నారు.