
విద్యపై శ్రద్ధ చూపాలి
భీమవరం: విద్యార్థులు చిన్నతనం నుంచి విద్యపై ప్రత్యేక శ్రద్ధ కనబర్చడం ద్వారానే ఉన్నత శిఖరాలు అధిరోహిస్తారని శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషేన్‌రాజు అన్నారు. గురువారం పట్టణంలో గునుపూడి ఉమాసోమేశ్వర మున్సిపల్ హైస్కూల్‌లో నిర్వహించిన మెగా పేరెంట్స్, టీచర్స్ మీటింగ్‌కు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పాఠశాలలకు వెళుతున్న విద్యార్థులను తల్లిదండ్రులు నిత్యం పర్యవేక్షించాలన్నారు. పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.
బెల్టు షాపులు రద్దుచేయాలి
తణుకు అర్బన్: గ్రామాల్లో బెల్ట్ షాపులను రద్దు చేయాలని ఆంధ్రప్రదేశ్ కల్లు గీత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు కామన మునిస్వామి డిమాండ్ చేశారు. స్థానిక అమరవీరుల భవనంలో గురువారం తణుకు డివిజన్ గీత కార్మికుల సహకార సొసైటీల అధ్యక్షుడు కట్టా వెంకటేశ్వర్లు అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మునిస్వామి మాట్లాడుతూ గీత కార్మికులకు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం నెరవేర్చలేదన్నారు. గ్రా మాల్లో తాటి, ఈత చెట్లను దౌర్జన్యంగా నరికి వేస్తున్నారని, ఆపాలని కోరారు. వృత్తిలో భా గంగా దివ్యాంగులైన, మరణించిన వారి కు టుంబాలకు గతంలో పరిహారం ఇచ్చేవారని, ప్రస్తుతం ఆ విధానం రద్దు చేయడం తగదన్నారు. ఈనెల 14న కలెక్టర్‌కు గీత కార్మికుల సమస్యలను చెప్పుకుందాం తరలిరండి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కల్లుగీత సహకార సొసైటీల అధ్యక్షుడు కాసాని శ్రీనివాసు, తొంట ముత్యాలు పాల్గొన్నారు.
తిరువన్నామలై రైలుకు వీరవాసరంలో హాల్ట్
రైల్వేస్టేషన్ (విజయవాడ పశ్చిమ): నర్సాపూర్–తిరువన్నామలై ప్రత్యేక రైలుకు వీరవాసరం స్టేషన్‌లో రెండు నిమిషాలు హాల్టింగ్ సదుపాయం కల్పించినట్టు విజయవాడ రైల్వే డివిజన్ పీఆర్‌ఓ నుస్రత్ మండ్రుప్కర్ ప్రకటనలో తెలిపారు. నర్సాపూర్ నుంచి వెళ్లే రైలు (07219) వీరవాసరం స్టేషన్‌కు మధ్యాహ్నం 1.23 గంటలకు చేరుకుని, 1.25 గంటలకు బయలుదేరుతుందని పేర్కొన్నారు. తిరువన్నామలై నుంచి వచ్చే రైలు (07220) రాత్రి 11.28 గంటలకు వీరవాసరం స్టేషన్‌కు చేరుకుని, తిరిగి 11.30 గంటలకు బయలుదేరుతుందని తెలిపారు.
పాఠశాల విలీనానికి నిరసనగా ఆమరణ దీక్ష
పెనుమంట్ర: పెనుమంట్ర దళితవాడలోని ఎంపీపీ ఎలిమెంటరీ పాఠశాలను దూరంగా ఉన్న మరో పాఠశాలలో విలీనం చేయడాన్ని నిరసిస్తూ శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద తాను ఆమరణ నిరాహార దీక్ష చేపట్టనున్నట్టు పెనుమంట్ర సర్పంచ్ తాడిపర్తి ప్రియాంక గురువారం విలేకరులకు తెలిపారు. 80 ఏళ్ల నాటి పాఠశాలను గత ప్రభుత్వంలో నాడు–నేడు నిధులతో అభివృద్ధి చేశారని, విద్యార్థుల తల్లిదండ్రులకు తెలియకుండా గత హెచ్‌ఎం, ఎంఈఓ కలిసి విద్యాకమిటీ సభ్యులను పక్కదారి పట్టించి ఇష్టానుసారం పాఠశాలను మరో పాఠశాలలో విలీనం చేశారన్నారు. దీనిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో తాను దీక్షకు దిగనున్నట్టు చెప్పారు. ఈ మేరకు తహసీల్దార్, పోలీస్ అధికారులు కూడా వినతి పత్రాల అందించానన్నారు. అలాగే గురువారం వైఎస్సార్ నగర్‌లో శంకుస్థాపన కార్యక్రమాలు జరగ్గా తాము వెళ్లేలోపు ప్రజాప్రతినిధులు కానివారితో కొబ్బరికాయలు కొట్టించి అధికారులు తమను అవమానపరిచారని ప్రియాంక వాపోయారు. సమావేశంలో పెనుమంట్ర–1 ఎంపీటీసీ చింతపల్లి మంగాదేవి, ఉప సర్పంచ్ భూపతిరాజు శ్రీనివాసరాజు పాల్గొన్నారు.