
బెధరగొడుతున్నాయ్
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): కూరగాయల ధరలు రోజు రోజుకూ పెరుగుతూ సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. ఏటా వేసవిలో కూరగాయల ధరలు పెరుగుతూ.. వర్షాలు పడగానే తగ్గుతుంటాయి. అయితే ఈ ఏడాది మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. ప్రస్తుతం వర్షాకాలం ప్రారంభం కాగా ఇప్పుడు అన్నిరకాల కూరగాయల ధరలు పెరుగుతున్నాయి. మూడు రోజులుగా కూరగాయల ధరలు కిలోకు రూ.5 నుంచి రూ.15 వరకు పెరిగాయి. టమాటా గత నెలలో కిలో రూ.16 నుంచి రూ.18 ఉండగా ప్రస్తుతం రూ.36కు చేరింది. పచ్చిమిర్చి కిలో గత గురువారం రూ.40 ఉండగా ఇప్పుడు రూ.60కు, పందిరి బీర కాయలు రూ.40 నుంచి రూ.50కు, వంకాయలు (కాంతులు) రూ.38 నుంచి రూ.50కు చేరాయి. ఒక్క రోజులో దొండకాయలు కిలో రూ.6, గోరుచిక్కుడు రూ.8 చొప్పున పెరిగాయి. గత సోమవారం కీరా దోస కిలో రూ.40 ఉండగా ప్రస్తుతం రూ.50 పలుకుతోంది. ఇలా అన్నిరకాల కూరగాయల ధరలు పెరిగాయి.
రైతు బజారుల్లోనే 400 క్వింటాళ్లు
ఏలూరులో సుమారు 90 వేల కుటుంబాల్లో 3.10 లక్షల జనాభా ఉన్నారు. నగరంలో రెండు రైతు బజార్లు అందుబాటులో ఉన్నాయి. వీటికి వన్‌టౌన్ లో ఎన్‌ఎస్ కూరగాయల మార్కెట్, పలు ప్రాంతాల్లో చిన్నపాటి కూరగాయల దుకాణాలు ఉన్నాయి. వీటితో పాటు ఇంటింటా తిరుగుతూ కూరగాయలు అమ్మే వ్యాపారులు 30 మంది వరకు ఉన్నాయి. నగరంలోని వన్‌టౌన్, టూటౌన్ ప్రాంతాల్లోని రైతు బజార్ల ద్వారా రోజుకు సుమారు 400 క్వింటాళ్ల కూరగాయలు, దుంపలు, ఉల్లిపాయలు, ఆకుకూరలు విక్రయాలు జరుగుతున్నాయి. ఇతర దుకాణాలు, ఇంటింటా తిరిగి విక్రయించే వారి ద్వారా మరో 800 క్వింటాళ్ల విక్రయాలు జరుగుతున్నట్టు అంచనా. ఈ లెక్కన నగరవాసులపై పెరిగిన కూరగాయల ధరల భారం రోజుకు సుమారు రూ.6 లక్షల వరకు ఉంటోంది.
పట్టించుకోని అధికారులు
కూరగాయల ధరలు పెరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని సామాన్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బహిరంగ మార్కెట్ కంటే రైతు బజార్లతో కొద్దిమేర ధరలు తక్కువగా ఉన్నా.. ధరల పెరుగుదల అసాధారణంగా ఉందని అంటున్నారు. గతంలో కూరగాయల ధరలు పెరిగితే రైతు బజార్లలో సబ్సిడీపై అందించేవారు. టమాటా, ఉల్లిని ప్రత్యేక కౌంటర్ల ద్వారా విక్రయించేవారు.
వెజిట్రబుల్స్
ఆకాశాన్నంటుతున్న ధరలు
కిలోకు రూ.15 వరకు పెరుగుదల
ధరల నియంత్రణపై చర్యలు శూన్యం