
మామిడి తోటల్లో కొమ్మ కత్తిరింపులు చేపట్టాలి
నూజివీడు: కోతలు పూర్తయిన నేపథ్యంలో మామిడి తోటల్లో రైతులు కొమ్మ కత్తిరింపులు చేసుకోవాలని నూజివీడు మామిడి పరిశోధన స్థానం శాస్త్రవేత్త కె.రాధారాణి పేర్కొన్నారు. మండలంలోని కొత్తరావిచర్లలో ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో బుధవారం మామిడి రైతులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనిలో భాగంగా రాధారాణి మాట్లాడుతూ కొమ్మ కత్తిరింపులు చేయడం వల్ల చెట్ల గాలి వెలుతురు ప్రసరణ బాగా జరిగి పూత, కాపు సరిగ్గా వస్తాయని, తెగుళ్లు, పురుగుల బెడద తగ్గుతుందన్నారు. చెదురుమదురుగా ఉన్న కొమ్మలను ఏటవాలుగా కత్తిరించి కత్తిరించిన చోట బ్‌లైటాక్స్‌ను పూయాలన్నారు. తోటల్లో దుక్కులు చేపట్టి చెట్టుకు చుట్టూ పాదులు చేసి పదేళ్ల వయస్సు పైబడిన చెట్లకు యూరియా 2 కిలోలు, సింగిల్ సూపర్ ఫాస్పేట్ 4 కేజీలు, మ్యూరేట్ ఆఫ్ పొటాష్ 1.5కేజీలు, బోరాన్ 100గ్రాములు, జింక్ సల్ఫేట్ 100గ్రాములు చొప్పున ఒక్కొక్క చెట్టుకు వేయాలన్నారు. ఆమె వెంట ఉద్యానశాఖ అధికారి ఆర్.హేమ, సర్పంచి కాపా శ్రీనివాసరావు ఉన్నారు.