
ట్రిపుల్ ఐటీ కౌన్సెలింగ్ తొలిరోజు ప్రశాంతం
నూజివీడు : ఏలూరు జిల్లా నూజివీడు ట్రిపుల్ ఐటీలో పీయూసీ ప్రథమ సంవత్సరానికి నిర్వహించిన ప్రవేశాల కౌన్సెలింగ్ ప్రక్రియ సోమవారం ప్రశాంతంగా జరిగింది. నూజివీడు ట్రిపుల్ ఐటీకి 1,010 మందిని ఎంపిక చేయగా వారిలో తొలిరోజు 505 మందిని కౌన్సెలింగ్‌కు ఆహ్వానించారు. ఉదయం 8 గంటల కల్లా కౌన్సెలింగ్ ప్రారంభించారు. ఈ కౌన్సెలింగ్‌లో ఎంపికై న విద్యార్థుల ఒరిజినల్ సర్టిఫికెట్లను పరిశీలించి ప్రవేశాలు కల్పించారు. దీనికి సంబందించిన ఫీజులను కూడా కట్టించుకున్నారు. తొలిరోజు 446 మంది అభ్యర్థులు కౌన్సెలింగ్‌కు హాజరవ్వగా వారందరికీ అడ్మిషన్లు కల్పించారు. ట్రిపుల్ ఐటీ అడ్మిషన్ల కన్వీనర్, ఇన్‌చార్జి డైరెక్టర్ ఆచార్య సండ్ర అమరేంద్రకుమార్, సీఏఓ బండి ప్రసాద్, సెంట్రల్ డీన్ దువ్వూరు శ్రావణి, అకడమిక్స్ డీన్ సాదు చిరంజీవి, అసిస్టెంట్ రిజిస్ట్రార్ మేరుగ అర్జునరావుల పర్యవేక్షణలో ఎలాంటి అవాంతరాలూ లేకుండా కౌన్సెలింగ్ జరిగింది. పలువురు మెంటార్లు, లెక్చరర్లు నిరంతరం కౌన్సెలింగ్ హాలులో ఉండి సర్టిఫికెట్‌ల పరిశీలనలో సిబ్బందికి కలిగే సందేహాలను నివృత్తి చేశారు. కౌన్సెలింగ్‌లో భాగంగా సర్టిఫికెట్ల పరిశీలన కోసం 20 కౌంటర్లను ఏర్పాటు చేసి 100 మంది సిబ్బందిని నియమించి కౌన్సెలింగ్ ప్రక్రియను తొలిరోజు ప్రశాంతంగా ముగించారు. ఎస్సీ, బీసీ, ఎస్టీ సంక్షేమ అధికారులను ఏర్పాటు చేసి విద్యార్థుల ధ్రువీకరణ పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఎవరికీ ఎలాంటి అసౌకర్యం కలుగకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. తాగునీరు, ప్రథమ చికిత్స కౌంటర్లు, ఎన్‌సీసీ క్యాడెట్ల సేవలు అందుబాటులో ఉండటంతో అంతా సజావుగా సాగింది. వచ్చిన అభ్యర్థులకు, వారి తల్లిదండ్రులకు తక్కువ ధరకే భోజన సదుపాయాన్ని కల్పించారు.
కవలలకు సీట్లు
ఎన్టీఆర్ జిల్లా కంచికచర్లకు చెందిన ఇద్దరు కవలలకు నూజివీడు ట్రిపుల్ ఐటీలో సీట్లు లభించాయి. సోమవారం కౌన్సెలింగ్ కోసం నూజివీడు ట్రిపుల్ ఐటీకి వచ్చిన నందికట్ల కుందన్ వెంకట నాగశ్రీ సాయి, నందికట్ల కుందన వెంకట నాగశ్రీ కంచికచర్లలోని జెడ్పీ హైస్కూల్‌లో పదో తరగతి చదువుకున్నారు. కుందన్‌కు 587 మార్కులు, కుందనకు 584 మార్కులు వచ్చాయి. వారిద్దరూ ట్రిపుల్ ఐటీలో సీట్ల కోసం దరఖాస్తు చేయగా, ఇద్దరికీ నూజివీడు ట్రిపుల్ ఐటీలోనే సీట్లు వచ్చాయి. దీంతో సోమవారం వారిద్దరూ పీయూసీలో చేరారు. ఈ సందర్భంగా వారిని డైరెక్టర్ ఆచార్య సండ్ర అమరేంద్రకుమార్ అభినందించారు.
446 మందికి ప్రవేశాలు

ట్రిపుల్ ఐటీ కౌన్సెలింగ్ తొలిరోజు ప్రశాంతం

ట్రిపుల్ ఐటీ కౌన్సెలింగ్ తొలిరోజు ప్రశాంతం