
ఆటో అదృశ్యంపై కేసు నమోదు
భీమవరం: ఆటో అదృశ్యంపై భీమవరం వన్‌టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. వారు తెలిపిన వివరాల ప్రకారం భీమవరం పట్టణం చినఅప్పారావు తోటకు చెందిన చెన్ను సత్యనారాయణ ఆటోను ఫైనాన్స్‌లో తీసుకుని సుంకరపద్దయ్య వీధికి చెందిన బోడపాటి నానిబాబుకు అద్దెకు ఇచ్చేవాడు. ప్రతి రోజు నానిబాబు రాత్రిపూట సత్యనారాయణ ఇంటి వద్దనే ఆటోను పార్కింగ్ చేస్తుండగా గతేడాది నవంబర్ 15వ తేదీన ఆటో కనిపించలేదు. దానిపై సత్యనారాయణ నానిబాబును ప్రశ్నించగా తనకు తెలియదని చెప్పాడు. దీంతో సత్యనారాయణ సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.
త్వరితగతిన కేసుల పరిష్కారానికి కృషి
ఏలూరు (టూటౌన్): ఫ్రీ లీగల్ ఎయిడ్ ద్వారా అందించే కేసుల త్వరితగతిన పరిష్కారానికి ప్యానల్ న్యాయవాదులు కృషి చేయాలని ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె.రత్నప్రసాద్ సూచించారు. రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ అమరావతి వారి ఆదేశాల మేరకు ఆయన సోమవారం స్థానిక జిల్లా న్యాయ సేవాధికార సంస్థ భవనంలో ప్యానల్ న్యాయవాదులతో వర్క్ రివ్యూ నిర్వహించారు. కక్షిదారులకు ఉచితంగా వాదించే కేసులు పై ఆరా తీశారు. జూలై 5న నిర్వహించే జాతీయ లోక్ అదాలత్‌లో కేసుల పరిష్కారానికి న్యాయవాదులు కక్షిదారులకు కౌన్సెలింగ్ నిర్వహించి, కేసుల పరిష్కారాన్ని కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ పీఎన్‌వీ మునేశ్వర ప్యానెల్ న్యాయవాదులు పాల్గొన్నారు.