
దోపిడీ కేసులో నిందితుల అరెస్టు
జంగారెడ్డిగూడెం: పట్టణంలో ఒక మహిళ కంట్లో కారం కొట్టి ఆమె మెడలోని సూత్రాలతో సహా బంగారు గొలుసుని దోపిడీ చేసిన ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు జంగారెడ్డిగూడెం డీఎస్పీ యు.రవిచంద్ర తెలిపారు. బుధవారం స్థానిక పోలీసు సర్కిల్ కార్యాలయంలో ఆయన వివరాలను వెల్లడించారు. జంగారెడ్డిగూడెంకు చెందిన మునగాల జానకీ దేవి, ఆమె భర్త శ్రీరామశాస్త్రి ప్రభుత్వ టీచర్‌లుగా పనిచేసి ఉద్యోగ విరమణ చేశారు. ఇల్లు మరమ్మతుల నిమిత్తం తాపీ పనివారిని పెట్టుకున్నారు. ఈ నెల 23న తాపీ పనిచేసేందుకు పేరంపేటకు చెందిన చింతపల్లి రామాంజనేయులు అలియాస్ అంజిబాబు, నక్కా శ్రీను అలియాస్ పండు, యడ్లపల్లి విజయరాజు వచ్చారు. వారు పని ప్రారంభించగా శ్రీరామశాస్త్రి టిఫిన్ తెచ్చేందుకు బయటకు వెళ్లారు. ఇదే అదనుగా భావించిన ఆ ముగ్గురు జానకీ దేవి కంట్లో కారం కొట్టి నాలుగు కాసుల బంగారు గొలుసు, మంగళసూత్రాలతో సహా దోచుకుపోయారు. ఈ ఘటనకు సంబంధించి నిందితులను సీఐ కృష్ణబాబు అరెస్ట్ చేసి చోరీ సొత్తు స్వాధీనం చేసుకున్నారు. నిందితుల అరెస్టుకు సంబంధించి ఎస్సై షేక్ జబీర్ ఏఎస్సై ఎన్‌వీ సంపత్‌కుమార్, కానిస్టేబుళ్లు ఎన్.రమేష్, రాజశేఖర్ సహకరించగా, వీరిని డీఎస్పీ రవిచంద్ర అభినందించారు. సమావేశంలో సీఐ కృష్ణబాబు, ఎస్సై షేక్ జబీర్ పాల్గొన్నారు.