
వైభవంగా శ్రీచక్ర స్నానం
● నేత్రపర్వంగా తొళక్కం, అశ్వ వాహన సేవలు ● నేటితో ముగియనున్న బ్రహ్మోత్సవాలు
ద్వారకాతిరుమల: శ్రీవారి వైశాఖమాస దివ్య బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని మంగళవారం శ్రీచక్ర స్నానాన్ని ఆలయ అర్చకులు వైభవంగా నిర్వహించారు. ముందుగా స్వామి, అమ్మవార్లు తొళక్క వాహనంపై క్షేత్ర పురవీధుల్లో ఊరేగారు. అనంతరం అర్చకులు ఆలయ యాగశాలలో శ్రీవారు, అమ్మవార్లు, శ్రీచక్ర పెరుమాళ్ల ఉత్సవ మూర్తులను ఒక వేదికపై వేంచేపు చేశారు. పూజాధికాల అనంతరం సుగంధ ద్రవ్యాలు, పంచపల్లవులు, శ్రీచందనం, పసుపు, మంత్ర పూత అభిషేక తీర్ధంతో శ్రీచక్ర స్వామిని అభిషేకించారు. సాయంత్రం నిత్యహోమ బలిహరణలు, పూర్ణాహుతి, అనంతరం ధ్వజ అవరోహణ వేడుకలను అర్చకులు వేద మంత్రోచ్ఛరణలతో వైభవోపేతంగా నిర్వహించారు. ఆలయ ముఖ మండపంలో శ్రీవారి కాళీయమర్ధనం అలంకారం భక్తులకు కనువిందు చేసింది. రాత్రి అశ్వవాహనంపై తిరువీధి సేవను నిర్వహించారు. బుధవారం రాత్రి జరిగే శ్రీపుష్ప యాగోత్సవంతో స్వామివారి బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి.
బ్రహ్మోత్సవాల్లో నేడు :
● ఉదయం 9 గంటల నుంచి – చూర్ణోత్సవం
● సాయంత్రం 6 గంటల నుంచి – కూచిపూడి నృత్య ప్రదర్శనలు
● రాత్రి 7 గంటల నుంచి – ద్వాదశ కోవెల ప్రదక్షిణలు, శ్రీపుష్ప యాగం–పవళింపు సేవ
● 9 గంటల నుంచి – రామాంజనేయ యుద్ధం నాటకం
● ప్రత్యేక అలంకారం : శయన మహావిష్ణువు

వైభవంగా శ్రీచక్ర స్నానం