
నిమ్మల జైలుకు వెళ్లలేదా?
పాలకొల్లు సెంట్రల్: ఐదేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన వారిని ఎలా గౌరవించి మాట్లాడాలో తెలియని దుస్థితిలో మంత్రి నిమ్మల రామానాయుడు ఉన్నారని పాలకొల్లు వైఎస్సార్‌సీపీ ఇన్‌చార్జ్ గుడాల గోపి ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ .. ‘ఆ మంత్రి గారు ఎన్నికల ముందు నీకు 15, నీకు 18, నీకు 45 వేలు అంటూ కనిపించిన ప్రతి ఒక్కరికీ నగదు పంపిణీ చేస్తామని అబద్దపు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారు’ అని జగన్‌మోహన్‌రెడ్డి మాట్లాడింది మంత్రి నిమ్మల రామానాయుడు గురించేనని, ఈ వీడియో నేటికి సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుందని గోపి అన్నారు. మంత్రి నిమ్మల సహనం కోల్పోయి జగన్‌మోహన్‌రెడ్డిని ఏకవచనంతో సంభోదించడం అతని అహంకారానికి, గర్వానికి నిదర్శనమన్నారు. కోర్టులో కేసులున్న వారంతా నేరగాళ్లు కాదనే విషయం తెలుసుకోవాలన్నారు. రామానాయుడు గర్వం చూస్తుంటే రాష్ట్రంలో సెకండ్ సీఎంలా ఫీల్ అవుతున్నట్లున్నారని విమర్శించారు. మంత్రి నిమ్మల గతంలో సెంట్రల్ జైలుకు వెళ్లిన విషయం మర్చిపోయారా.. మంత్రి నిమ్మల ఎన్ని ఒత్తిళ్లకు గురిచేసినా యలమంచిలి మండలం ఎంపీటీసీలంతా జగన్‌కు మద్దతుగా ఎంపీపీని గెలిపించుకున్నారన్నారు. రౌడీయిజం చేసి సోషల్ మీడియా, వైఎస్సార్‌సీపీ నాయకులు, మీడియా ప్రతినిధులపై కేసులు బనాయించి బెదిరింపులకు దిగే కొత్త సంస్కృతిని మంత్రి నిమ్మల తీసుకువస్తున్నారన్నారు.
ఎస్సీ కమిషన్ మాజీ సభ్యులు చెల్లెం ఆనందప్రకాష్ మాట్లాడుతూ.. మీరు జైలుకి వెళ్లివచ్చారు, మీ నాయకుడు చంద్రబాబు 52 రోజులు జైలులో గడిపారు. అంటే మీరిద్దరూ నేరస్తులేనా అని నిమ్మలను ప్రశ్నించారు. సూపర్ 6 అమలు చేయాలని.. అంతే గాని ఇలా బెదిరించి కేసులు పెట్టడం సమంజసం కాదని హెచ్చరించారు. సీనియర్ నాయకులు కుమార దత్తాత్రేయవర్మ మాట్లాడుతూ నియోజకవర్గంలో పేకాట శిబిరాలు, కోడి పందేలు, మద్యం సిండికేట్ల నుంచి నెలకు సుమారు రూ.కోటి ఏటీఎంలా మంత్రి నిమ్మలకు ఆదాయం వస్తుందని ఆరోపించారు. జెడ్పీటీసీ నడపన గోవిందరాజులు నాయుడు, యడ్ల తాతాజీ, కర్రా జయసరిత పట్టణ, యలమంచిలి, పోడూరు మండలాల అధ్యక్షులు కోరాడ శ్రీనివాసరావు, ఉచ్చుల స్టాలిన్, కొర్రపాటి వీరాస్వామి, పలువురు వైఎస్సార్‌సీపీ నాయకులు పాల్గొన్నారు.
కోర్టులో కేసులున్న వారంతా నేరగాళ్లు కాదు
వైఎస్సార్‌సీపీ పాలకొల్లు ఇన్‌చార్జి గుడాల గోపి