
కోకోకు మద్దతు ధర కల్పించాలి
ఏలూరు (టూటౌన్): కోకో గింజలకు అంతర్జాతీయ మార్కెట్ ధర ఇవ్వాల్సిందేనని ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘం రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. ఏలూరు అన్నే భవనంలో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బొల్లు రామకృష్ణ్ణ అధ్యక్షతన బుధవారం సాయంత్రం సమావేశం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా విచ్చేసిన కోకో రైతు సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షుడు, రిటైర్డ్ డీజీపీ ఏబీ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ మోండలీజ్ కంపెనీ ఎదుట చేసిన మహాధర్నా, దీక్షలకు రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఈనెల 23న ఏలూరు కలెక్టరేట్‌కు చర్చలకు పిలవడాన్ని ఆహ్వానిస్తున్నామని చెప్పారు. అంతర్జాతీయ మార్కెట్ ధరకు అనుగుణంగా రైతులకు మద్దతు ధర ఇచ్చి కోకో రైతులను ఆదుకోవాలని కోరారు. కోకో రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.శ్రీనివాస్ మాట్లాడుతూ ఇంతవరకు కంపెనీలు, ట్రేడర్లు కొనుగోలు చేసిన కోకో గింజలకు కూడా అంతర్జాతీయ మార్కెట్ ధర వర్తింపజేసి వ్యత్యాసపు ధర చెల్లించాలన్నారు. రైతుల నుంచి కోకో గింజలు సక్రమంగా కొనుగోలు చేయకుండా కంపెనీలు చేస్తున్న మోసాలను అరికట్టాలని డిమాండ్ చేశారు. విదేశీ కోకో గింజలు దిగుమతులు వెంటనే నిలుపుదల చేయాలని కోరారు. కోకో రైతుల సంఘం గౌరవాధ్యక్షుడు సింహాద్రి గోపాలకృష్ణ, రాష్ట్ర ఉపాధ్యక్షులు బోళ్ల వెంకట సుబ్బారావు, పానుగంటి అచ్యుతరామయ్య, రాష్ట్ర సహాయ కార్యదర్శులు గుదిబండి వీరారెడ్డి, కొసరాజు రాధాకృష్ణ, ఉప్పల కాశీ తదితరులు పాల్గొన్నారు.