
మాజీ మంత్రి రజినీపై పోలీసుల తీరు దారుణం
మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు
తణుకు అర్బన్: మాజీ మంత్రి, బీసీ మహిళ, వైఎస్సార్‌సీపీ చిలకలూరిపేట నియోజకవర్గ ఇన్‌చార్జి విడుదల రజినీపై చిలకలూరిపేట రూరల్ సీఐ సుబ్బరాయుడు ప్రవర్తించిన తీరు దారుణమని మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు అన్నారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రానికి మంత్రిగా పనిచేసిన రజినీని కనీస గౌరవం ఇవ్వకుండా, మహిళ అని చూడకుండా చేయిపట్టుకుని పక్కకు తోసేయడం దుర్మార్గమన్నారు. రెండు రోజుల క్రితం కంతేరులో ఎస్సీ మహిళా ఎంపీటీసీ సభ్యురాలిని కూడా అర్ధరాత్రి అరెస్టు చేశారని, దుస్తులు మార్చుకోవడానికి రెండు నిమిషాలు సమయం అడిగినా పోలీసులు నిరాకరించి ఆమెను బలవంతంగా పోలీసు జీపు ఎక్కించారన్నారు. రాష్ట్రంలో రెడ్‌బుక్ రాజ్యాంగం అ మలు చేయడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని దుయ్యబట్టారు. మహిళల విషయంలో ఎలా ప్రవర్తించాలో తెలియని కూటమి ప్రభుత్వానికి త్వరలోనే ప్రజలు బుద్ధి చెబుతారని కారుమూరి అన్నారు.
మీడియా వ్యవస్థపై దాడులు మానాలి
భీమవరం: సాక్షి మీడియాపై కక్ష సాధింపు దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని వైఎస్సార్‌సీపీ ఇంటలెక్చువల్స్ ఫోరం విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి ఈద జాషువా అన్నారు. సాక్షి పత్రిక ఎడిటర్ ఆర్.ధనంజయరెడ్డి నివాసంలో నోటీసులు ఇవ్వకుండానే పోలీసులు చేసిన సోదాలు పత్రికా స్వాతంత్య్రంపై జరిగిన దాడిగా పరిగణించాలన్నారు. మీడియా వ్యవస్థలపై రాజకీయ కక్ష పూరిత దాడులను మానాలని డిమాండ్ చేశారు.
మురళీ నాయక్ త్యాగం మరువలేం
పాకిస్తాన్ కాల్పుల్లో మరణించిన భారత ఆర్మీ జవాన్ మురళీ నాయక్ దేశ భద్రత కోసం వీరమరణం పొందడం విషాదకరమని జాషువా అన్నా రు. మురళీనాయక్ ప్రాణాలను ప్రాణంగా పెట్టి దేశ రక్షణ కోసం చేసిన త్యాగం ఎన్నటికీ నిలిచిపోతుందన్నారు. మురళీనాయక్ వీరత్వం దేశ పౌరులకు స్ఫూర్తిగా నిలుస్తుందన్నారు.
అరటి రైతులకు మాజీ సీఎం జగన్ చేయూత హర్షణీయం
దెందులూరు: కడప జిల్లాలో 2024 మార్చిలో కురిసిన వర్షాలు, వరదలకు నష్టపోయిన 670 మంది అరటి రైతులకు మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రూ.1.14 కోట్ల ఆర్థిక సాయం అందించడం వైఎస్ కుటుంబానికి రైతులపై ఉన్న నిబద్ధతకు నిదర్శనమని ఏలూరు జిల్లా అరటి రైతు సంక్షేమ సంఘం నేత, వైఎస్సార్‌సీపీ నేత ఉప్పలపాటి సత్తిబాబు అన్నారు. ఆదివారం సంక్షేమ సంఘ నాయకులు విలేకరులతో మాట్లాడారు. అరటి రైతులను కూటమి ప్రభుత్వం ఆదుకోకపోవడంతో మాజీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి హెక్టారుకు రూ.20 వేల చొప్పున ఆర్థిక సాయం అందించడం చాలా సంతోషంగా ఉందన్నారు. జిల్లా అరటి రైతు సంక్షేమ సంఘం తరఫున ఆయనకు కృతజ్ఞతలు తెలుపుతున్నట్టు సంఘ నేత సత్తిబాబు తెలిపారు.
14న ఏపీటీఎఫ్ ధర్నా
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): రాష్ట్రంలో ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం ఏపీటీఎఫ్ ఆధ్వర్యంలో ఈనెల 14న విజయవాడలో నిర్వహించనున్న భారీ ధర్నాకు టీచర్లు పెద్దఎత్తున హాజరై జయప్రదం చేయాలని జిల్లా శాఖ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు టి.రామారావు, బి.రెడ్డి దొర ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వం అమలు చేయనున్న 9 రకాల పాఠశాలల వ్యవస్థ అసంబద్ధంగా ఉందని, ప్రాథమిక పాఠశాల వ్యవస్థ నిర్వీర్యం అవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకుని మూడు రకాల పాఠశాల వ్యవస్థను అమలు చేయాలని, 12వ పీఆర్‌సీ కమిషన్‌ను వెంటనే నియమించి, ఐఆర్ ప్రకటించాలని డిమాండ్ చేశారు. వీటితో పాటు పెండింగ్‌లో ఉన్న మూడు డీఏలను మంజూరు చేయాలని, సంపాదిత సెలవుల నగదును ఖాతాల్లో జమ చేయాలని, 11వ పీఆర్‌సీ ఆర్థిక బకాయిలతో పాటు అన్నిరకాల ఆర్థిక బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
ఆప్కాబ్ చైర్మన్‌గా గన్ని
భీమడోలు: ఉంగుటూరు మాజీ ఎమ్మెల్యే, టీడీపీ జిల్లా అధ్యక్షుడు గన్ని వీరాంజనేయులు రాష్ట్ర కో–ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ (ఆప్కాబ్) చైర్మన్, ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా డీసీసీబీ చైర్మన్‌గా నియమితులయ్యారు. జిల్లాలోని ఎంపీలు, ఎమ్మెల్యేలు ఆయనకు అభినందనలు తెలిపారు. భీమడోలులోని పార్టీ కార్యాలయంలో టీడీపీ శ్రేణుల సంబరాలు అంబరాన్నంటాయి.

మాజీ మంత్రి రజినీపై పోలీసుల తీరు దారుణం