భీమవరం: విద్యుత్ స్మార్ట్ మీటర్ల పేరుతో విద్యుత్ మీటర్ రీడర్లను రోడ్డున పడేయవద్దని, వారికి సంస్థలోనే ప్రత్యామ్నాయం చూపి ఉద్యోగ భద్రత కల్పించాలంటూ భీమవరంలో గురువారం ధర్నా నిర్వహించారు. ఏఐటీయూసీ విద్యుత్ మీటర్ రీడర్స్ యూనియన్ ఆధ్వర్యంలో పట్టణంలోని చినరంగనిపాలెం యూనియన్ బ్యాంకు నుంచి ప్రదర్శనగా వెళ్లి విద్యుత్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా యూనియన్ గౌరవాధ్యక్షుడు కోనాల భీమారావు మాట్లాడుతూ గతంలో స్మార్ట్ మీటర్లను వ్యతిరేకించిన మంత్రి లోకేష్ ఇప్పుడు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. సంఘ భీమవరం డివిజన్ అధ్యక్షుడు పెనుమాక జాకబ్ మాట్లాడుతూ ఎస్క్రో ఖాతా ద్వారా వేతనాలు చెల్లిస్తామని గతంలో సంస్థ సీఎండీ మీటర్ రీడర్లకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. మీటర్ రీడర్లలో అర్హత ఉన్న వారిని సబ్ స్టేషన్లలో షిఫ్ట్ ఆపరేటర్‌గా, వాచ్ అండ్ వార్డ్‌గా, సర్కిల్ కార్యాలయాల్లో కంప్యూటర్ ఆపరేటర్స్, అటెండర్స్, వాచ్‌మెన్స్‌గా నియమించాలని కోరారు. మూడు కంపెనీల పరిధిలో ఒకే పని దినాలు అమలు చేయాలని, అదనపు పని గంటలను రద్దు చేయాలన్నారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని విద్యుత్ ఎస్‌ఈ ఆలపాటి రఘనాథ్‌బాబు, డీఈ నరహరశెట్టి వెంకటేశ్వరరావుకు అందజేశారు. ఏఐటీయూసీ జిల్లా కార్యవర్గ సభ్యుడు చెల్లబోయిన రంగారావు, సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు ఎం.సీతారాంప్రసాద్, విద్యుత్ మీటర్ రీడర్స్ యూనియన్ జిల్లా ఉపాధ్యక్షుడు వి.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.