భీమవరం(ప్రకాశం చౌక్): డాక్టర్ ఎన్‌టీఆర్ వైద్య సేవ (ఆరోగ్యశ్రీ)లో పనిచేస్తున్న ఉద్యోగులు తమ సమస్యలను పరిష్కరించాలంటూ కూటమి ప్రభుత్వానికి పలుమార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోవడం లేదు. నామమాత్రంగా జరిగిన అధికారులతో చర్చలు విఫలం కావడంతో సోమవారం, ఈనెల 24న (రెండు సోమవారాలు) విధులు బహిష్కరించాలని, జిల్లా ఆరోగ్యశ్రీ కార్యాలయాల వద్ద నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని ఉద్యోగుల సంఘం నిర్ణయం తీసుకుంది. దీంతో ఆయా రోజుల్లో పేదలకు ఆరోగ్యశ్రీ సేవలు దూరం కానున్నాయి.
కీలకంగా ఉద్యోగులు
పేద, మధ్యతరగతి వర్గాల ఆరోగ్య పరిరక్షణలో ఆరోగ్యశ్రీ సేవలు కీలకం. వేలాది మంది ప్రాణాలు నిలపడంలో ఆరోగ్యశ్రీ ఉద్యోగుల పాత్ర ప్రశంసనీయం. ఆరోగ్యశ్రీ కార్డు కలిగి నెట్‌వర్క్, ప్రభుత్వాస్పత్రులకు వచ్చిన రోగులకు వెంటనే ఓపీ కార్డు రిజిస్ట్రేషన్ చేసి వైద్యుడి వద్దకు పంపుతారు. అలాగే ఆపరేషన్ అవసరమైతే ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ద్వారా అనుమతి వచ్చేలా చూడటం, రోగులకు భోజన సౌకర్యం నుంచి వారిని తిరిగి ఇంటికి క్షేమంగా పంపించే వరకూ సాయం ఉంటారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ఆసరా సాయం కింద వైద్యం పొందిన రోగులకు ఆర్థిక సాయం కూడా అందేది.
ఉద్యోగాలు ఉంటాయా.. ఊడతాయా..
ఆరోగ్యశ్రీ సేవలను నిర్వీర్యం చేసేలా ముఖ్యమంత్రి చంద్రబాబు పథకంలో మార్పులు చేసి బీమా కంపెనీకి అప్పగించాలని చూస్తున్నారని ఉద్యోగులు మండిపడుతున్నారు. బీమా కంపెనీకి అప్పగిస్తే తమ ఉద్యోగాలు ఉంటాయో.. ఊడతాయోనని ఆందోళన చెందుతున్నారు. 17 ఏళ్లుగా సేవలందిస్తున్న తమను తొలగిస్తారా అంటూ ఆవేదన చెందుతున్నారు. ఎప్పటికై నా తమ సర్వీసులను క్రమబద్ధీకరిస్తారని భావిస్తున్న తరుణంలో ఉద్యోగాలను తీసేవేసేలా కుట్రలు చేస్తున్నారని అంటున్నారు. పథకాన్ని బీమా కంపెనీకి అప్పగిస్తే తమ ఉద్యోగాల పరిస్థితిపై వైద్యారోగ్య శాఖ లేదా ఉన్నతాధికారులు స్పష్టత ఇవ్వాలని కోరుతున్నారు.
జిల్లాలో 65 మంది ఉద్యోగులు
జిల్లాలో భీమవరం, తణుకు, తాడేపల్లిగూడెం, నరసాపురం, పాలకొల్లు, ఆచంట, ఆకివీడు, పెనుగొండలో ఆరోగ్యశ్రీలో సేవలందించే ఆస్పత్రులు 36 ఉన్నాయి. వీటిలో నెట్‌వర్క్ ఆస్పత్రులు 28 భీమవరం, పాలకొల్లు, తణుకు, తాడేపల్లిగూడెం పట్టణా ల్లో ఉన్నాయి. వీటితో పాటు జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి (తణుకు), ఏరియా ప్రభుత్వాస్పత్రులు 4 (భీమవరం, పాలకొల్లు, నరసాపురం, తాడేపల్లిగూడెం), సీహెచ్‌సీలు 3 (పెనుగొండ, ఆచంట, ఆకివీడు)లో ఆరోగ్యశ్రీ సేవలందిస్తున్నారు. మొత్తంగా 36 ఆస్పత్రుల్లో 65 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు.
పేదలకు తప్పనిపాట్లు
ఆరోగ్యశ్రీ ఉద్యోగులు విధులు బహిష్కరిస్తే ఆస్పత్రులకు వెళ్లే పేదలకు తీవ్ర ఇబ్బందులు తప్పవు. ఆరోగ్య మిత్రలు లేకపోతే ఆరోగ్యశ్రీ కార్డు ద్వారా ఓపీ, అత్యవసర ఆపరేషన్లు చేయాల్సి వస్తే పరిస్థితి ఏంటనేది ప్రశ్నార్థకంగా మారింది. ఇది పేదల ఆరోగ్యంతో చెలగాటమే అని, ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని పలువురు కోరుతున్నారు. సేవలందక ఎవరి ప్రాణాల మీదకై నా వస్తే అందుకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి వస్తుందని అంటున్నారు.
జిల్లాలో ఆరోగ్యశ్రీ ఆస్పత్రులు 36
మేనేజర్ 1
టీమ్ లీడర్లు 4
ఆరోగ్యమిత్రలు 58
ఆఫీస్ స్టాఫ్ 2
పేదలకు భారం
వైద్య సేవ ఉద్యోగుల చర్చలు విఫలం
నేడు, 24న విధుల బహిష్కరణ
ఆరోగ్యశ్రీ కార్యాలయాల వద్ద నిరసన
పథకాన్ని బీమా కంపెనీకి అప్పగిస్తామనడంపై ఆందోళన
సమస్యల పరిష్కారానికి పోరుబాట
ఉద్యోగుల డిమాండ్లు
ఆరోగ్యశ్రీలో 17 ఏళ్లుగా పనిచేస్తున్న వారిని సర్వీసును బట్టి ప్రభుత్వ కాంట్రాక్ట్ ఉద్యోగులుగా గుర్తించి జీఓ నం.7లో కేటగిరీ–1 డీపీఓ క్యాడర్ అమలు చేయాలి.
ఉద్యోగులందరికీ పనికి తగిన కనీస వేతనం అమలు చేయాలి, వేతనం పెంచాలి.
సర్వీసును బట్టి పదోన్నతులు ఇవ్వాలి.
ఉద్యోగి చనిపోతే వారి కుటుంబాలకు రూ.15 లక్షల సాయం అందించాలి.
రిటైర్‌మెంట్ బెనిఫిట్ కింద రూ.10 లక్షల సాయం అందించాలి.
ప్రభుత్వ ఉద్యోగాల నియామకాల్లో ఆరోగ్యశ్రీ ఉద్యోగులకు వెయిటేజీ ఇవ్వాలి.