కళ్లలో కారం కొట్టి చోరీ | Sakshi
Sakshi News home page

కళ్లలో కారం కొట్టి చోరీ

Published Fri, Nov 17 2023 12:58 AM

తీవ్ర గాయాలతో పడి ఉన్న యువకుడు 
 - Sakshi

ఏలూరు టౌన్‌: ఏలూరు జాతీయ రహదారి కలపర్రులో స్నేహితుడి పెళ్ళిరోజు వేడుకలకు వెళ్ళి వస్తుండగా అర్ధరాత్రి ఏలూరు మినీబైపాస్‌లో ఒక యువకుడు, యువతిపై ఇద్దరు అగంతకులు దాడి చేశారు. కళ్ళలో కారం కొట్టి బంగారు వస్తువులు, సెల్‌ఫోన్లు లాక్కుపోయారు. దీనిపై ఏలూరు త్రీటౌన్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. త్రీటౌన్‌ సీఐ కోమాకుల శివాజీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోలీసుల వివరాల ప్రకారం.. ఏలూరు నగరంలో ఒక సెల్‌ఫోన్‌ షాపులో పనిచేస్తోన్న యువకుడి పెళ్ళిరోజు కావటంతో ఏలూరు జాతీయ రహదారిపై కలపర్రు టోల్‌ప్లాజా వద్ద ఉన్న దాబా హోటల్‌లో ఈనెల 15న రాత్రి వేడుకలు చేసుకున్నారు. అదే షాపులో పనిచేస్తోన్న మరో యువకుడు, మాదేపల్లి గ్రామానికి చెందిన ఒక యువతి పార్టీకి హాజరయ్యారు. ఇద్దరూ బైక్‌ఫై వట్లూరు మినీబైపాస్‌ రోడ్డులో వస్తుండగా హేలాపురి నగర్‌ వద్ద ఇద్దరు అగంతకులు వారిని అడ్డగించి, కళ్ళలో కారం కొట్టారు. బెదిరించి యువతి మెడలోని బంగారు చైను, యువకుడి బ్రాస్‌లెట్‌, సెల్‌ఫోన్లు లాక్కుని ఉడాయించారు.

యువకుడికి తీవ్ర గాయాలు

ఏలూరు టౌన్‌: ఏలూరు జన్మభూమి పార్కు రోడ్డులో ఒక యువకుడు తీవ్ర గాయాలతో రోడ్డుపై ఉండడంతో స్థానికులు గుర్తించి అతడ్ని ఏలూరు జీజీహెచ్‌లో చేర్చారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏలూరు కలెక్టరేట్‌కు వెళ్ళే ప్రధాన రహదారిలో జన్మభూమి పార్కు సమీపంలో ఒక యువకుడు తీవ్ర గాయాలతో రోడ్డుపై అపస్మారకస్థితిలో ఉన్నాడు. ముఖమంతా రక్తంతో, తీవ్ర గాయాలతో ఉన్న యువకుడిని గుర్తించిన స్థానికులు 108 అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు. అతనిని ఏలూరు వన్‌టౌన్‌ పడమరవీధికి చెందిన వీరంకి కృష్ణ పవన్‌ శశాంక్‌గా గుర్తించారు. కుటుంబ సభ్యులు మెరుగైన వైద్య చికిత్స కోసం ప్రైవేటు హాస్పిటల్‌కు తరలించారు. సమాచారం అందుకున్న ఏలూరు త్రీటౌన్‌ పోలీసులు బాధితుడ్ని పరిశీలించారు. ప్రమాదవశాత్తు బైక్‌ నుంచి రోడ్డుపై పడి గాయపడ్డాడా? లేక ఎవరైనా కొట్టి రోడ్డుపై పడేశారా .. అనే కోణంలో ఏలూరు త్రీటౌన్‌ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. యువకుడి ఆరోగ్యస్థితి విషమంగా ఉన్నట్లు చెబుతున్నారు.

 
Advertisement
 
Advertisement