సాక్షి, వరంగల్: చేతిలో నగదు లేకపోయినా మొబైల్‌లో యూపీఐ ఉంటే చాలు.. ఇంటి విద్యుత్ బిల్లు నుంచి పిల్లల స్కూల్ ఫీజు వరకు, పెట్రోల్ బంక్ నుంచి రైల్వే టికెట్ వరకు చెల్లింపులు క్షణాల్లో పూర్తవుతున్నాయి. ఇప్పుడు రూ.2 వేలకు పైబడిన కొన్ని కేటగిరీల యూపీఐ లావాదేవీలకు వ్యాపారులపై రూ.5 ఫ్లాట్ మర్చంట్ డిస్కౌంట్ రేటు (ఎండీఆర్) అమల్లోకి రానుండడంతో జిల్లాలో దీని ప్రభావం ఎంత ఉంటుందన్న చర్చ వాణిజ్య వర్గాల్లో మొదలైంది. కేంద్ర ఆర్థికశాఖ నిబంధనల ప్రకారం రైల్వే, టెలికాం, బీమా, ఇంధనం వంటి ఎంపిక చేసిన కేటగిరీల్లో రూ.2 వేలకు పైబడిన యూపీఐ లావాదేవీకి రూ.5 ఫ్లాట్ ఎండీఆర్ ఉంటుంది. విద్యుత్, నీరు, పైప్డ్ గ్యాస్ వంటి యుటిలిటీ బిల్లులకు కూడా ఇదే విధానం వర్తిస్తుంది. రూ.2 వేలలోపు లావాదేవీలకు ఎండీఆర్ ఉండదు. సాధారణ పర్సన్ టూ మర్చంట్ (పీ2ఎం) లావాదేవీల్లో రూ.2 వేలకు పైబడిన వాటికి 0.4 శాతం ఎండీఆర్, రూ.75 వేలకుపైగా లావాదేవీలకు రూ.300 గరిష్ఠ పరిమితి ఉంటుంది. అయితే, చిన్న వ్యాపారులు యూపీఐ క్యూఆర్ ద్వారా నెలకు రూ.1 లక్ష వరకు స్వీకరిస్తే పీ2ఎం కేటగిరీలో జీరో ఎండీఆర్ కొనసాగుతుంది. వరుసగా మూడు నెలలు నెలకు రూ.1 లక్షకు మించి స్వీకరిస్తే సాధారణ పీ2ఎం కేటగిరీలోకి మారే అవకాశం ఉండడం వల్ల అదనపు భారం పడే అవకాశముంది. వచ్చే నెల 15 నుంచి ఈ కొత్త నిబంధనలు అమల్లోకి రానుండడంతో సరికొత్త చర్చ మొదలైంది.
ఏడాదికి రూ.కోటిపైనే భారం!
జిల్లాలో వినియోగదారుల సంఖ్య, సేవల వినియోగం, పట్టణ, గ్రామీణ విస్తీర్ణాన్ని బట్టి స్థూలంగా లెక్కిస్తే విద్యుత్, నీరు, గ్యాస్, స్కూల్, కళాశాల ఫీజులు, టెలికాం, రైల్వే, పెట్రోల్, డీజిల్, బీమా తదితర విభాగాల్లో నెలకు సుమారు 2.5 నుంచి 3.5 లక్షల యూపీఐ లావాదేవీలు జరిగే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. వాటిలో రూ.2 వేలకు పైబడినవి సుమారు 1.5 నుంచి 2.5 లక్షలు ఉంటాయనుకుంటే ఒక్కో లావాదేవీకి రూ.5 చొప్పున సగటు ఎండీఆర్ నెలకు రూ.7.5 లక్షల నుంచి రూ.12.5 లక్షల మధ్య ఉండొచ్చు. అంటే, ఏడాదికి సుమారు రూ.90 లక్షల నుంచి రూ.1.50 కోట్ల వరకు ఎండీఆర్ విలువ ఉండే అవకాశం ఉందన్న చర్చ వరంగల్ మార్కెట్ వర్గాల్లో జరుగుతోంది.
భవిష్యత్‌లో కస్టమర్ జేబుకు చిల్లు?
నేరుగా వినియోగదారుడి ఖాతా నుంచి రూ.5 కట్ కాదు. ఎండీఆర్‌ను వ్యాపారి భరిస్తారు. యూపీఐ చెల్లింపుదారులపై ఎలాంటి ట్రాన్జాక్షన్ చార్జీ ఉండదని కేంద్రం స్పష్టం చేసినా భవిష్యత్‌లో వినియోగదారుల జేబులకే చిల్లు పడొచ్చన్న ఆందోళన ఉంది. సంస్థలు దీన్ని నేరుగా కస్టమర్ నుంచి వసూలు చేయలేకపోయినా, భవిష్యత్‌లో ఇతర ధరలు, సేవా చార్జీల్లో మార్పులు చేయడం ద్వారా ఎండీఆర్ భారం తగ్గించుకునేలా చేసుకుంటుందన్న టాక్ ఉంది. అలాగే, విద్యుత్ బిల్లు, ఓటీటీ, ఇతర పునరావృత చెల్లింపులు యూపీఐ ఆటోపే ద్వారా చేస్తే నిర్దేశిత ఎండీఆర్ ఉండదు. దీంతో నెలనెలా చెల్లించే బిల్లుల్లో ఆటోపే వినియోగం పెరిగే అవకాశం ఉంది. అయితే, సమయానికి డబ్బులు అందుబాటులో ఉండకపోతే ఇబ్బందులు కూడా ఎదురయ్యే అవకాశముంది.
సుమారుగా దేనికి ఎంత అంటే..
విద్యుత్, నీరు, గ్యాస్‌కు సంబంధించి నెలవారీ యూపీఐ లావాదేవీలు 80,000 బిల్లుల వరకు జరిగితే, వాటిలో రూ.రెండు వేలకు పైబడినవి 20,000 బిల్లులకు ఎండీఆర్ నెలకు రూ.లక్ష అవుతుందని అంచనా.
స్కూల్, కళాశాల ఫీజులు 50,000 యూపీఐ నెలవారీ లావాదేవీలు అయితే 30,000 బిల్లుల వరకు రెండువేలకు పైబడినవి వాటికి రూ.1.50 లక్షలు ఎండీఆర్ కానుంది.
పెట్రోల్, డీజిల్ 80,000 లావాదేవీలుంటే రూ.రెండు వేలపైనా ఉన్న 40,000 బిల్లులకు రూ.రెండు లక్షల ఎండీఆర్ అవుతుంది. టెలికాం 60,000 బిల్లుల్లో 15,000 యూపీఐ లావాదేవీలకు రూ.75 వేల ఎండీఆర్ భారం పడనుంది.
రైల్వే టికెట్లకు సంబంధించి 50,000 యూపీఐ లావాదేవీలు జరిగితే రూ.రెండు వేలపైన ఉన్న 30,000 బిల్లులకు రూ.1.50 లక్షలు ఎండీఆర్ రానుంది.
బీమా ప్రీమియం 30,000 యూపీఐ లావాదేవీలు జరిగితే 20,000 బిల్లులు రూ.రెండు వేలపైనా వాటికి రూ.లక్ష ఎండీఆర్ భారం పడనుంది. మొత్తంగా 3.50 లక్షల వరకు యూపీఐ లావాదేవీలు జరిగితే అందులో రూ.రెండు వేలపైగా ఉన్న 1.55 లక్షల ట్రాన్జాక్షన్లకు రూ.7.75 లక్షల ఎండీఆర్ అంచనా పడుతుందని వాణిజ్య వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ లెక్కన ఏడాదికి రూ.93 లక్షల ఎండీఆర్ అవుతుంది. కొన్ని సందర్భాల్లో రూ.కోటి నుంచి రూ.కోటి 50 లక్షల వరకు ఎండీఆర్ వసూలయ్యే అవకాశముందని మార్కెట్ వర్గాలు లెక్కలేస్తున్నాయి.
డిజిటల్ లావాదేవీలు పెరగడంతో
ఎండీఆర్ తప్పేట్టు లేదు
కేంద్రం నిబంధనలతో జిల్లాలో రూ.కోటిపైనే భారం
వివిధ బిల్లులు, వ్యాపార రూపేణా వేలాది యూపీఐ ట్రాన్జాక్షన్లు
విద్యుత్, నీరు, ఇంధనం, ఫీజులు, రైల్వే, బీమాపై కూడా ప్రభావం
భవిష్యత్‌లో వినియోగదారులపై ధరాభారం పడొచ్చనే ఆందోళన


