సజావుగా ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలి | - | Sakshi
Sakshi News home page

సజావుగా ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలి

Sep 17 2026 2:20 AM | Updated on Sep 17 2026 2:20 AM

న్యూశాయంపేట: ఖరీఫ్‌ సీజన్‌ 2026 – 27కు సంబంధించిన ధాన్యం కొనుగోళ్లు సజావుగా నిర్వహించేందుకు, రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనుగోలు కేంద్రాల్లో మౌలిక వసతులు కల్పించాలని అధికారులను కలెక్టర్‌ డాక్టర్‌ సత్యశారద ఆదేశించారు. కలెక్టరేట్‌ కాన్ఫరెన్స్‌ హాల్‌లో అదనపు కలెక్టర్‌ (రెవెన్యూ) ఎల్‌.కిశోర్‌కుమార్‌తో కలిసి ధాన్యం కొనుగోళ్లపై బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలో ఖరీఫ్‌ సీజన్‌లో మొత్తం 98,539 ఎకరాల్లో వరి సాగు జరిగిందని ఆమెకు అధికారులు వివరించారు. ఇందులో 90,523 ఎకరాల్లో ఏడు రకాల సన్నధాన్యం, 8,016 ఎకరాల్లో దొడ్డు రకం సాగు చేసినట్లు తెలిపారు. వాటి ఆధారంగా సుమారు 1.50 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం వచ్చే అవకాశం ఉందని అంచనా వేశారు. కొనుగోళ్లకు జిల్లాలో 209 ప్యాడీ ప్రొక్యూర్‌మెంట్‌ సెంటర్లు (పీపీసీ) ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. సమావేశంలో అదనపు కలెక్టర్‌ (స్థానిక సంస్థలు) వైవీ.గణేష్‌, సివిల్‌ సప్లై డీఎం సంధ్యారాణి, డీసీఎస్‌ఓ కిష్టయ్య, డీఆర్డీఓ నాగపద్మజ, డీసీఓ నీరజ, ఆర్డీఓలు సుమ, ఉమారాణి పాల్గొన్నారు.

‘ఉల్లాస్‌’ను విజయవంతంగా నిర్వహించాలి

ఉల్లాస్‌ పరీక్షలను విజయవంతంగా నిర్వహించి, నిర్దేశిత లక్ష్యాన్ని చేరుకోవాలని అధికారులను కలెక్టర్‌ డాక్టర్‌ సత్యశారద ఆదేశించారు. కలెక్టరేట్‌లో బుధవారం నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఈనెల 20న నిర్వహించనున్న పరీక్షలకు ఉల్లాస్‌ పోర్టల్‌లో నమోదైన ప్రతీ మహిళ హాజరయ్యేలా చూడాల్సిన బాధ్యత మండల స్థాయిలోని అసిస్టెంట్‌ ప్రాజెక్ట్‌ మేనేజర్లపై ఉందని గుర్తుచేశారు. అలాగే, ఈనెల 27న ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని నిర్వహించాలని సూచించారు.

కలెక్టర్‌ డాక్టర్‌ సత్యశారద

రీసర్వేతో భూ సమస్యలకు పరిష్కారం

దుగ్గొండి: ప్రభుత్వం చేపట్టిన భూముల రీసర్వే కార్యక్రమంతో వందేళ్ల భూసమస్యలకు పరిష్కారం లభిస్తుందని కలెక్టర్‌ సత్యశారద అన్నారు. మండలంలోని మందపల్లిలో భూముల సర్వేపై బుధవారం అవగాహన సదస్సు జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ రాష్ట్రంలో 1930లో నిజాంరాజుల కాలంలో భూములు సర్వే చేసి సెత్వార్‌ సిద్ధంచేసి సర్వే నంబర్లు కేటాయించారని చెప్పారు. అప్పటినుంచి నేటి వరకు భూ సమస్యలు పరిష్కారంకాక రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. రీసర్వే పూర్తిగా డిజిటల్‌ పద్ధతిలో ఉప గ్రహాల పర్యవేక్షణలో అక్షాంశ, రేఖాంక్షాలకు అనుసంధానించనున్నట్లు పేర్కొన్నారు. సర్వే అనంతరం మ్యాపులో రైతుకు చెందిన సర్వే నంబర్ల స్థానంలో ఎల్‌పీఏ నంబర్‌ కేటాయించనున్నట్లు తెలిపారు. సర్వే పారదర్శకంగా సాగాలంటే రైతుల సహకారం అవసరమన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ కిశోర్‌కుమార్‌, నర్సంపేట ఆర్డీఓ ఉమారాణి, సర్వే ఏడీ శ్రీనివాస్‌, తహసీల్దార్‌ సమ్మక్క, సర్వేయర్‌ గీత, సర్పంచ్‌ మారేడుగొండ శ్రీమాలతి, జీపీఓ అనిల్‌ పాల్గొన్నారు.

పారిశుద్ధ్య నిర్వహణపై కలెక్టర్‌ కన్నెర్ర

ఆస్పత్రి ఆవరణ, పరిసరాల్లో పిచ్చి మొక్కలు పెరిగి, వ్యర్థాలు పేరుకుపోయి దుర్గంధం వెదజల్లుతుండడంతో ఆస్పత్రి సిబ్బందిపై కలెక్టర్‌ సత్యశారద అగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే పరిసరాలు, ఆవరణ శుభ్రం చేసి తనకు ఫొటోలు పంపాలని ఆదేశించారు. మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్‌ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పీహెచ్‌సీలో వివిధ రకాల రికార్డులు, ల్యాబరేటరీ, ఫార్మసీ వార్డులను పరిశీలించారు. రోగులతో మాట్లాడి వైద్యం ఎలా అందుతుందో అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో డీఎంహెచ్‌ఓ రాజారెడ్డి, నర్సంపేట ఆర్డీఓ ఉమారాణి, వైద్యాధికారి రాకేష్‌, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement