న్యూశాయంపేట: జిల్లా కేంద్రంలో గురువారం నిర్వహించనున్న తెలంగాణ ప్రజాపాలన దినోత్సవంలో రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్‌పర్సన్ గద్వాల విజయలక్ష్మి పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లా మంత్రి కొండా సురేఖను మంత్రివర్గం నుంచి తొలగించిన నేపథ్యంలో జిల్లాలో జరిగే వేడుకల్లో విజయలక్ష్మి పాల్గొననున్నారు.
వేడుకల ఏర్పాట్ల పరిశీలన
ఖిలా వరంగల్: తెలంగాణ ప్రజాపాలన దినోత్సవాన్ని పురస్కరించుకుని వరంగల్ జిల్లా కేంద్రంలోని ఓసిటీ ఐడీఓసీ మైదానంలో గురువారం ఉదయం జరిగే వేడుకలకు ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. ఈ మేరకు ఏర్పాట్లను ఆర్డీఓ సుమ, వరంగల్ తహసీల్దార్ శ్రీకాంత్‌తో కలిసి కలెక్టర్ డాక్టర్ సత్యశారద బుధవారం సాయంత్రం పరిశీలించారు. ముఖ్యఅతిథిగా తెలంగాణ ప్లానింగ్ బోర్డు వైస్ చైర్‌పర్సన్ గద్వాల విజయలక్ష్మి హాజరై ఉదయం 10 గంటలకు జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు. అంతకుముందు 9.35 గంటలకు పడమర కోట అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించనున్నారు.
నాణ్యమైన
వైద్యసేవలందించాలి
దుగ్గొండి: గ్రామీణ ప్రాంత నిరుపేదలకు నాణ్యమైన వైద్యం అందించాలని డీఎంహెచ్‌ఓ రాజారెడ్డి సూచించారు. మండలంలోని కేశవాపురం పీహెచ్‌సీని బుధవారం తనిఖీ చేశారు. ఆస్పత్రిలోని వివిధ రికార్డులను పరిశీలించారు. అనంతరం, లక్ష్మీపురం సబ్‌సెంటర్‌లో ఇమ్యూనైజేషన్ సెషన్‌ను ప్రారంభించి మాట్లాడారు. గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు అవసరమైన టీకాలను ఇవ్వాలని సిబ్బందిని ఆదేశించారు. కార్యక్రమంలో వైద్యాధికారి విజయ్‌కుమార్, సూపర్‌వైజర్ గొ డిశాల భాస్కర్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
గర్భిణుల ఆరోగ్యంపై
ప్రత్యేక శ్రద్ధ చూపాలి
నెక్కొండ: గర్భిణుల ఆరోగ్య విషయంలో వైద్య సిబ్బంది ప్రత్యేక శ్రద్ధ వహించాలని వైద్యారోగ్య శాఖ జిల్లా ప్రోగ్రాం అధికారి డాక్టర్ సాజిద అన్నారు. ఈ మేరకు మండలంలోని నెక్కొండ, అలంకానిపేట పీహెచ్‌సీలను బుధవారం ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా రికార్డులు, రిపోర్టులను పరిశీలించారు. గ్రామాల్లో గర్భిణులకు అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. గర్భిణులను గుర్తించడంలో నిర్లక్ష్యం తగదని, వారి వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేసి అన్నిరకాల వైద్య పరీక్షలు నిర్వహించాలని సిబ్బందిని ఆదేశించారు. అవసరమైన మందులు, ఐరన్ ఫోలిక్ యాపిడ్ సప్లిమెంట్ల గురించి పలు సూచనలు చేశారు. అలాగే ప్రసవం, ప్రసవం అనంతరం సేవలపై అవగాహన కల్పించారు. తల్లిపాలు, శిశువుల రక్షణ, హైరిస్క్ గర్భిణుల గుర్తింపు, జాతీయ ఆరోగ్య కార్యక్రమాల గురించి సిబ్బందికి సాజిద వివరించారు. కార్యక్రమంలో పీహెచ్‌సీ వైద్యాధికారులు రహేలా తన్వీర్, అఖిల్, సరోజ, డెమో వెంకటేశ్వర్లు, డీపీహెచ్‌ఎన్ మనోజ్, పీహెచ్‌ఎన్ అన్నామేరీ, హెచ్‌ఎస్ వరమ్మ, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.


