సాక్షి, వరంగల్: ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ (సర్)లో భాగంగా క్షేత్రస్థాయిలో గుర్తించిన అనామలీస్, నో మ్యాపింగ్ తదితర అంశాలపై ఓటర్లకు నోటీసులు వస్తున్నాయి. దీంతో పలువురు ఓటర్లు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో నోటీసులందుకున్న వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, హియరింగ్‌లో ఎదురవుతున్న సమస్యలు, సమర్పించాల్సిన ఆధారాల గురించి వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద శనివారం ‘సాక్షి’ ఇంటర్వ్యూలో వివరించారు.
ప్రశ్న: నోటీస్ అంటే ఓటు తొలగించినట్టేనా?
కలెక్టర్: నోటీస్ రావడం అంటే ఓటు తొలగించినట్లు కాదు. ఓటరు వివరాల్లో ఏదైనా అనుమానం, అసమతుల్యత లేదా గత సర్ వివరాలతో సరిపోలకపోవడం గుర్తించినప్పుడు నోటీసు ఇస్తారు.
ప్రశ్న: ఒకే కుటుంబంలో ఎక్కువ మంది పిల్లలున్నా అనుమానాస్పదంగా పరిగణిస్తారా?
కలెక్టర్: అది ఆటోమేటిక్‌గా తప్పు అని అర్థం కాదు. వ్యవస్థలో ఒకే వ్యక్తిని తండ్రిగా ఆరుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది పిల్లలకు మ్యాప్ చేసిన సందర్భాల్లో డేటా సరైందో కాదో నిర్ధారించడానికి పరిశీలిస్తారు.
ప్రశ్న: హియరింగ్‌కు వెళ్లకపోతే ఏం చేయాలి?
కలెక్టర్: నోటీసును నిర్లక్ష్యం చేయకూడదు. నిర్ణయించిన తేదీ, ప్రదేశానికి హాజరు కావాలి. అనివార్య పరిస్థితి ఉంటే సంబంధిత బీఎల్‌ఓ/ఎన్నికల అధికారులను సంప్రదించి వివరాలు తెలుసుకోవాలి.
జిల్లాలో మొత్తం 1,94,395 నోటీసులు జనరేట్ కాగా 1,27,365 డెలివరీ అయ్యాయి. 67,030 నోటీసులు డెలివరీ పెండింగ్‌లో ఉన్నాయి. 12,502 హియరింగ్‌లు నిర్వహించగా, 96,969 హియరింగ్ తేదీలు ల్యాప్స్ అయ్యాయి. చాలా మంది వీకెండ్‌లలో వస్తామని సమాచారం ఇవ్వడంతో ఏఈఆర్‌ఓల సంఖ్యను పెంచి క్లియర్ చేయడంపై దృష్టి సారించారు. మొత్తం పెండింగ్ కేసులు 4,828 ఉండగా వీటిని శనివారం కలెక్టర్ సత్యశారద నేతృత్వంలోని బృందం క్లియర్ చేసింది.
ఆధారాలతో హియరింగ్‌కు రండి
‘సాక్షి’ ఇంటర్వ్యూలో వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద


