ఉద్యాన పంటలతో అధిక ఆదాయం | - | Sakshi
Sakshi News home page

ఉద్యాన పంటలతో అధిక ఆదాయం

Sep 12 2026 1:42 AM | Updated on Sep 12 2026 1:42 AM

కలెక్టర్‌ సత్యశారద

గీసుకొండ: ఉద్యాన పంటల సాగుతో రైతులు అధిక ఆదాయం పొందవచ్చని కలెక్టర్‌ సత్యశారద అన్నారు. ‘మామిడి, మిరప, ఇతర కూరగాయ పంటల్లో వినూత్న వ్యవసాయ పద్ధతులు’ అనే అంశంపై రైతులకు జిల్లా స్థాయి అవగాహన సదస్సు శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ సత్యశారద మాట్లాడుతూ.. జిల్లాలో మామిడి, మిరప, పసుపు, కూరగాయలు తదితర ఉద్యాన పంటలకు మంచి అవకాశాలు ఉన్నాయని అన్నారు. తక్కువ నీటితో ఆధునిక సాగు పద్ధతులను పాటించడం ద్వారా రైతులు అధిక ఆదాయం పొందవచ్చన్నారు. ఒకే పంటపై ఆధారపడకుండా ప్రాంతానికి అనుగుణంగా వివిధ పంటలను సాగు చేయాలని సూచించారు. డ్రిప్‌, స్ప్రింక్లర్‌ వంటి సూక్ష్మ సేద్య పద్ధతులతో నీటిని పొదుపు చేయాలని కోరారు. మల్చింగ్‌ ద్వారా నేలలో తేమను కాపాడుకోవాలని శాస్త్రవేత్తలు సూచించారు. అధిక ఉష్ణోగ్రతలు, వర్షపాతం లోపం వంటి వాతావరణ పరిస్థితులను దష్టిలో పెట్టుకుని సాగు, నీటి పారుదల ప్రణాళికలను మార్చుకోవాలన్నారు. పంటల్లో పురుగు, తెగుళ్లను ముందుగానే గుర్తించి సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు. ఉద్యాన శాఖ ద్వారా అమలవుతున్న ఎంఐడీహెచ్‌, మైక్రో ఇరిగేషన్‌, ఆర్‌కేవైవీ, ఎన్‌ఎంఈఓ –ఓపీ తదితర పథకాల రాయితీలను రైతులు వినియోగించుకోవాలని తెలిపారు. కొత్త పండ్ల తోటలు, కూరగాయల నారు, పర్మనెంట్‌ పందిళ్లు, మల్చింగ్‌ తదితరాలకు అందుబాటులో ఉన్న సహాయాన్ని అధికారులు వివరించారు. సదస్సులో ఐసీఏఆర్‌ – ఐఐహెచ్‌ఆర్‌ బెంగళూరుకు చెందిన డాక్టర్‌ పొన్నం నరేష్‌ కూరగాయల ఆధునిక సాగు పద్ధతులపై, డాక్టర్‌ చేతన్‌ కుమార్‌ నేల ఆరోగ్యం, నేల నిర్వహణపై అవగాహన కల్పించారు. శాస్త్రవేత్త ప్రశాంత్‌ కుమార్‌ మామిడి, మిరప తదితర పంటల్లో మొక్కల ఆరోగ్యం, తెగుళ్ల నివారణపై వివరించారు. డాక్టర్‌ రాజీవ్‌ కుమార్‌, జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమల అధికారి శ్రీనివాసరావు, జిల్లా వ్యవసాయ అధికారి తదితరులు రైతులకు సూచనలు అందించారు. సదస్సులో ఏర్పాటు చేసిన వివిధ స్టాళ్లు రైతులను ఆకట్టుకున్నాయి. అనంతరం ‘అర్క తేజస్వి’ విత్తనాలు తదితరాలను రైతులకు పంపిణీ చేశారు. కార్యక్రమంలో జిల్లా ఉద్యాన అధికారులు, వివిధ శాఖల ప్రతినిధులు, ఆర్డీఓ, సర్పంచ్‌లు, సుమారు 400 మంది రైతులు పాల్గొన్నారు.

భూముల రీ సర్వే పకడ్భందీగా నిర్వహించాలి

పర్వతగిరి: భూముల రీ సర్వే ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్‌ సత్యశారద అధికారులను ఆదేశించారు. మండలంలోని జమాల్‌పురం వ్యవసాయ భూముల్లో జరుగుతున్న రీ సర్వే ప్రక్రియను శుక్రవారం ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ సత్యశారద అధికారులకు పలు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. నిబంధనల ప్రకారం రీ సర్వే నిర్వహించాలన్నారు. క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులను పరిశీలించిన అనంతరం మాత్రమే వివరాలను నమోదు చేయాలన్నారు. రీ సర్వే పూర్తయిన తర్వాత భూ హద్దులు, రికార్డులకు సంబంధించి సమస్యలు తలెత్తకుండా ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలని ఆదేశించారు. ఆర్డీఓ సుమ, డీఆర్డీఓ పీడీ నాగపద్మజ, సర్వే ఏడీ శ్రీనివాస్‌, తహసీల్దార్‌ వెంకటస్వామి పాల్గొన్నారు.

వినాయక నిమజ్జనానికి పకడ్బందీ ఏర్పాట్లు

న్యూశాయంపేట: జిల్లాలో నిర్వహించనున్న వినాయక విగ్రహాల నిమజ్జన కార్యక్రమాన్ని ప్రశాంతంగా పూర్తి చేసేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌ సత్యశారద ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో సంబంధిత అధికారులు, గణేష్‌ ఉత్సవ కమిటీ సభ్యులతో సమీక్షించారు. నిమజ్జన కార్యక్రమంలో అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా ముందస్తు ప్రణాళికతో చర్యలు చేపట్టాలని సూచించారు. సమావేశంలో ఈస్ట్‌జోన్‌ డీసీపీ అంకిత్‌కుమార్‌, అదనపు కలెక్టర్లు కిషోర్‌కుమార్‌, వై.వీ.గణేష్‌, డీఆర్‌ఓ విజయలక్ష్మి, జెడ్పీ సీఈఓ వసంత, వరంగల్‌ ఆర్డీఓ సుమ, హౌసింగ్‌ డీఈ గణేష్‌ తదితరులు పాల్గొన్నారు.

అవగాహన కల్పించాలి

గర్భిణులు, బాలింతలు, చిన్నారుల పోషణ, ఆరోగ్యం, సంరక్షణపై గ్రామస్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని కలెక్టర్‌ సత్యశారద సూచించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో అంగన్‌వాడీ సూపర్‌వైజర్‌లతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆమె మాట్లాడారు. అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా లబ్ధిదారులకు మరింత నాణ్యమైన సేవలు అందేలా నిరంత రం పర్యవేక్షించాలన్నారు. ఈనెల 9 నుంచి అక్టోబర్‌ 8 వరకు నిర్వహించే పోషణ మాసం–2026 పోస్టర్లను కలెక్టర్‌ ఆవిష్కరించారు. సమావేశంలో డీడబ్ల్యూఓ రాజమణి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement