● ఎకరానికి రూ.60 మాత్రమే చెల్లింపు
● సమస్యల పరిష్కరించాలని డిమాండ్
● ప్రభుత్వ వైఖరి నిరసిస్తూ..
రీ–సర్వే సనుల నిలిపివేత
నల్లబెల్లి: భూభారతి రీ–సర్వేలో కీలక పాత్ర పోషించాల్సిన లైసెన్స్‌డ్ సర్వేయర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నాలుగు నెలలు శిక్షణ తీసుకొని, కఠినమైన పోటీ పరీక్షల్లో ఉతీర్ణలై లైసెన్సులు పొందినప్పటికీ తమకు సరైన ఉపాధి, గౌరవ వేతనం దక్కడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలకు, క్షేత్ర స్థాయిలో అమలవుతున్న చెల్లింపులకు పొంతన లేదని మండిపడుతున్నారు.
ఆరు నెలల శిక్షణ.. కఠిన పరీక్షలు
ధరణి స్థానంలో కాంగ్రెస్ ప్రభుత్వం భూభారతి వ్యవస్థను తీసుకొచ్చి భూముల సమస్యలకు పరిష్కారం చూపడంతోపాటు రీ–సర్వే చేపట్టాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా లైసెన్స్‌డ్ సర్వేయర్లను ఎంపిక చేసేందుకు గత ఏడాది మే నెలలో నోటిఫికేషన్ జారీ చేసింది. జిల్లాలో సుమారు 400 మంది వరకు దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తుదారుల నుంచి రూ.5 వేల వరకు ఫీజు వసూలు చేసి.. నాలుగు నెలలపాటు అధికారిక శిక్షణ ఇచ్చారు. అనంతరం మరో రెండు నెలలపాటు ఫీల్డ్ ట్రైనింగ్ నిర్వహించడంతో ఆరు నెలల శిక్షణ పూర్తి చేశారు. థియరీ, ప్రాక్టికల్, వైవాతో పాటు అప్రెంటిస్‌షిప్, మిషన్లతో కొలతలకు సంబంధించిన పరీక్షలు నిర్వహించి, 60 శాతానికి పైగా మార్కులు సాధించిన వారికి లైసెన్సులు మంజూరు చేశారు.
విధుల్లో చేరాలని తీవ్ర ఒత్తిడి
గతేడాది డిసెంబర్ నాటికే శిక్షణ పరీక్షల ప్రక్రియ పూర్తియినట్లు సర్వేయర్లు తెలిపారు. డిసెంబర్‌లో జిల్లాలో 200 మందిని సర్వేయర్లను కేటాయించారు. అయితే అప్పటి నుంచి చాలాకాలంపాటు పనులు కల్పించకపోవడంతో ఆదాయం లేకుండాపోయిందని వాపోయారు. మరో వైపు మండలాల్లో విధుల్లో చేరకపోతే లైసెన్సులు రద్దు చేస్తామని అధికారులు ఒత్తిడి తెచ్చారని, కానీ విధులు, ఉపాధి విధానం, చెల్లింపులపై ఎలాంటి స్పష్టత లేదని ఆరోపించారు. ప్రస్తుతం మండలానికో గ్రామాన్ని ఎంపిక చేసి 33 మంది సర్వేయర్లకు విధులు అప్పగించారు.
రెండు రోజులుగా రీ–సర్వే బంద్
సమస్యల పరిష్కారిషారం కోసం కలెక్టర్, రెవెన్యూ అధికారులను కలిసి వినతులు సమర్పించడంతోపాటు ధర్నాలు, ఆందోళన చేపట్టారు. అంతే కాకుండా గతంలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాలను నిర్వహించారు. అయినా తమ సమస్య పరిష్కారం కాకపోవడంతో అధికారుల తీరును నిరసిస్తూ గత రెండు రోజులుగా రీ–సర్వే పనులను పూర్తిగా నిలిని బంద్ ప్రకటించినట్లు వెల్లడించారు. సర్వే భవన్‌కు వెళ్లి సమస్యలను వివరించేందుకు ప్రయత్నిస్తే అధికారులు కనీసం మాట్లాడేందుకు కూడా ముందుకు రావడంలేదని వాపోయారు. చర్చలకు అనుమతించకుండా గేటు వద్దే అడ్డుకున్నారని, సమస్యలపై ప్రశ్నించిన వారిని పోలీస్ స్టేషన్‌కు తరలిస్తూ భయబ్రాంతులకు గురి చేస్తున్నారని ఆరోపించారు.
వెట్టిచాకిరీ చేస్తున్నాం
మా పని వెట్టి చాకిరీగా మారుతోంది. డిగ్రీలు, ఇంజనీరింగ్ చదివి, నెలల తరబడి శిక్షణ పొంది లైసెన్స్‌లు సాధించాం. ఉపాధి లభిస్తుందని ఆశించాం. కానీ, ఎకరాకు రూ.60 తో రీ సర్వే చేయడం సాధ్యం కాదు. ఇది మాకు గిట్టుబాటు కావడంలేదు. క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న సమస్యలను పరిగణలోకి తీసుకుని రీ సర్వేకు సముచితమైన చార్జీలు చెల్లించాలి. విధులు, చెల్లింపులపై స్పష్టమైన విధివిధానాలను ప్రభుత్వం ప్రకటించాలి.
– విష్ణు, లైసెన్స్‌డ్ సర్వేయర్
రూ.500 హామీ.. ఆచరణలో రూ.60
ప్రభుత్వం లైసెన్స్‌లు ఇచ్చే సమయంలో రిజిస్ట్రేషన్, దరఖాస్తుల సమయంలో జరిగే భూముల కొలతలకు ఎకరాకు రూ.500 చొప్పున చెల్లిస్తామని చెప్పినట్లు పేర్కొంటున్నారు. ఇందులో 10 శాతం ప్రభుత్వం తీసుకుని, మిగిలిన 90 శాతం సర్వేయర్లకు అందుతుందని తెలిపారు. అయితే నెలల తరబడి పనులు లేకుండా ఉంచిన అనంతరం ఆగస్టులో ఎకరాకు కేవలం రూ.20 మాత్రమే ఇస్తామని అధికారులు చెప్పడం విడ్డూరంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విధానాన్ని వ్యతిరేకిస్తూ నిరసనలు చేపట్టగా ఆ మోత్తాన్ని రూ.60 కి పెంచినప్పటికీ గిట్టుబాటు కావడంలేదని వాపోతున్నారు. రైతుల మధ్య భూ వివాదాలు, గట్ల సరిహద్దులు లేకపోవడం, పొలాల్లో చెట్లు వంటి అడ్డంకుల కారణంగా ఒక రోజులో ఇద్దరు సర్వేయర్లు కలిసి 10 నుంచి 15 ఎకరాల కొలత చేపట్టడం సాధ్యం కావడం లేదన్నారు. ఉదయం నుంచి రాత్రి వరకు ఇద్దరు సర్వేయర్లు పని చేసినా.. ఎకరాకు రూ.60 చొప్పున మొత్తం రూ.300 లోపే వస్తుందని పేర్కొన్నారు. ఇందులో వాహనాల పెట్రోల్, భోజనం, ఇతర రోజువారీ ఖర్చులు తీసేయగా.. ఏమీ మిగలడంలేదని వాపోయారు.


