గీసుకొండ : యువత, విద్యార్థులు మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని వరంగల్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి కందుకూరి పూజ సూచించారు. బుధవారం మండలంలోని మొగిలిచర్లలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు ‘మాదకద్రవ్యాల అవగాహన–ఆరోగ్యం, అనారోగ్యం’ అంశంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పూజ మాట్లాడుతూ.. గంజాయి లేని సమాజం కోసం న్యాయ సేవాధికార సంస్థలు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మాదకద్రవ్యాలకు అలవాటు పడటం వల్ల శారీరక, మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం ఉంటుందన్నారు. చదువుపై ఆసక్తి తగ్గడం, కుటుంబ సంబంధాల్లో సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, సామాజిక సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని వివరించారు. ఎవరైనా డ్రగ్స్ లేదా ఇతర మాదక పదార్థాలను అందించినప్పుడు ‘నో–గో–టెల్’ సూత్రాన్ని పాటించాలని సూచించారు. చెడు స్నేహాలు, చెడు అలవాట్లు, ఒత్తిడి, ఆసక్తి కోసం మాదకద్రవ్యాలను ప్రయోగించడం వంటి వాటికి విద్యార్థులు దూరంగా ఉండాలని సూచించారు. విద్యార్థులు తమ సమస్యలను తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు లేదా నమ్మకమైన పెద్దలతో చర్చించాలని సూచించారు. పాఠశాలలు, కళాశాలలు లేదా ఇతర ప్రాంతాల్లో డ్రగ్స్ వినియోగం లేదా విక్రయం జరుగుతున్నట్లు గుర్తిస్తే పోలీసులకు, సంబంధిత అధికారులకు లేదా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ హెల్ప్‌లైన్ 15100కు సమాచారం అందించాలని కోరారు. అనంతరం పాఠశాలలో విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనాన్ని ఆమె పరిశీలించారు. కార్యక్రమంలో పాఠశాల ఇన్‌చార్జ్ హెచ్‌ఎం విజయ్ కుమార్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
డీఎల్‌ఎస్‌ఏ కార్యదర్శి పూజ


