విద్యారణ్యపురి : అన్ని యాజమాన్యాల పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేట్, యూపీఎస్‌లు, ఉన్నత పాఠశాలలు, కేజీబీవీలు, మోడల్ స్కూళ్లు, గురుకులాల్లోని విద్యార్థుల్లో శాసీ్త్రయ, వైజ్ఞానిక ఆలోచనలు, సృజనాత్మకతను ప్రోత్సహించి వారిని భావి శాఽస్త్రవేత్తలుగా తీర్చిదిద్దాలనే ప్రధాన లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రతీ ఏడాది ‘ఇన్‌స్పైర్ మనాక్’ అవార్డులు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా 2026–2027 విద్యాసంవత్సరంలో విద్యార్థులనుంచి నామినేషన్లు ఆహ్వానించే ప్రక్రియ ఈ ఏడాది జూలై 15 నుంచి ప్రారంభమైంది. నామినేషన్ల సమర్పణకు ఈనెల 15వరకు గడువు ఉంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో నామినేషన్ల లక్ష్యం చేరుకోలేదు. ఐదు జిల్లాల్లో నామినేషన్ల సమర్పణ నత్తనడకనే కొనసాగుతోంది.
అర్హులు వీరే..
ఉమ్మడి వరంగల్ జిల్లాలో అన్ని యాజమాన్యాల ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లోని 6 నుంచి 12వ తరగతి చదువుతున్న విద్యార్థులు ఇన్‌స్పైర్ మనాక్ పురస్కారాలు పొందేందుకు అర్హులుగా ఉన్నారు. ఒక్కో పాఠశాలనుంచి ఐదు ప్రాజెక్టుల వరకు పంపొచ్చు. అందుకు ఉపాధ్యాయులు నామినేషన్లను సంబంధిత వెబ్‌సైట్‌లో హెచ్‌టీటీపీ//డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.ఇన్‌స్పైర్‌అవార్డ్స్–డీఎస్‌టీ.గౌట్.ఇన్‌లో సమర్పించాల్సింటుంది (నమోదు చేయాల్సింటుంది)
ఎంపికై తే రూ.10వేల చొప్పున అందజేత
నామినేషన్ ఇన్‌స్పైర్‌కు ఎంపికై తే దానిని పంపిన విద్యార్థికి రూ. 10 వేల చొప్పున ప్రోత్సాహకం ఇస్తారు. విద్యార్థుల బ్యాంకు ఖాతాల్లోనే నేరుగా జమచేస్తారు. తొలుత జిల్లాస్థాయిలో ఆతర్వాత ఎంపికై న వారికి రాష్ట్రస్థాయిలో, అందులో ఎంపికై తే జాతీయస్థాయి వరకూ విద్యార్థులు తమలోని వైజ్ఞానిక ప్రతిభను ప్రదర్శించే వీలు కలుగుతుంది. అలాంటి ఇన్‌స్పైర్‌కు విద్యార్థులను ప్రోత్సహించి నామినేషన్లు నమోదు చేయించడంలో సంబంధిత పాఠశాలల ఉపాధ్యాయులు నిర్లక్ష్యం వహిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. జిల్లా స్సైన్స్ అధికారులు కూడా తమ జిల్లాలో ఇన్‌స్పైర్‌పై ఉపాధ్యాయులకు అవగాహన కల్పించారు. అయినా నామినేషన్ల నమోదు ప్రక్రియ ఇంకా నత్తనడకనే సాగుతోంది.
టాప్ మహబూబాబాద్ జిల్లా
ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇన్‌స్పైర్ మనాక్ పురస్కారాలకు విద్యార్థులనుంచి నామినేషన్లను నమోదు చేసుకున్న సంఖ్యను ఈనెల 8వ తేదీవరకు పరిశీలిస్తే ఆరు జిల్లాలు కూడా టార్గెట్‌ను చేరుకోలేదు. కానీ మహబూబాబాద్ జిల్లా మాత్రం 1,044 నామినేషన్‌తో రాష్ట్రంలోనే టాప్‌గానే నిలిచింది. ఈ జిల్లాకు టార్గెట్ మాత్రం 1,165 చేయాల్సింది. మిగతా ఐదు జిల్లాలు హనుమకొండ, వరంగల్, ములుగు, జనగామ, జయశంకర్ భూపాలపల్లి మాత్రం లక్ష్యానికి బహుదూరంగానే ఉన్నాయి. ఇప్పటికై నా సంబంధిత జిల్లాల ఉపాధ్యాయులు చొరవ తీసుకుని విద్యార్థులను ప్రోత్సహిస్తూ నామినేషన్ల నమోదుకు కృషిచేయాల్సిన అవసరం ఉందని జిల్లా సైన్స్ అధికారులు కోరుతున్నారు.
గత విద్యాసంవత్సరంలో ఉమ్మడి జిల్లాకు 433 అవార్డులు
గత విద్యాసంవత్సరంలో 2025–2026లో ఉమ్మడి వరంగల్ జిల్లాకు 433 ఇన్‌స్పైర్ అవార్డులు లభించాయి. ఆయా విద్యార్థులకు రూ.10వేల చొప్పున బ్యాంకు ఖాతాలో డబ్బులు జమయ్యాయి. ఆయా విద్యార్ధులకు ఈఏడాది నవంబర్–డిసెంబర్‌లో ప్రతీజిల్లాలోనూ జిల్లాస్థాయి ఇన్‌స్పైర్ ఎగ్జిబిట్స్ ప్రాజెక్టుల ప్రదర్శన నిర్వహించనున్నారు. ఈ విద్యాసంవత్సరంలో 2026–2027లో ఎన్ని లభిస్తాయో వేచి చూడాల్సిందే.
టార్గెట్‌కు దూరంగా ప్రాజెక్టుల నామినేషన్లు
ప్రస్తుతం ఒక్క మహబూబాబాద్ జిల్లానే టాప్
మిగతా ఐదు జిల్లాలు లక్ష్యం చేరేనా ?
ఈ నెల 15వ తేదీ వరకే గడువు
జిల్లాల వారీగా స్కూళ్లు ఇన్‌స్పైర్ నామినేషన్ల టార్గెట్, ఇప్పటివరకు వచ్చినవి ఇలా..
జిల్లా స్కూళ్లు టార్గెట్ వచ్చినవి
హనుమకొండ 395 1,975 223
వరంగల్ 344 1,720 212
జనగామ 195 975 187
ములుగు 112 560 48
జేఎస్ భూపాలపల్లి 131 655 83
మహబూబాబాద్ 233 1,165 1,044


