ఐఎఫ్‌ఏటీ సదస్సులో
జీడబ్ల్యూఎంసీ కమిషనర్ వెంకన్న
వరంగల్ అర్బన్: ముంబైలోని ‘బాంబే ఎగ్జిబిషన్ సెంటర్’లో జరుగుతున్న 13వ ఐఎఫ్‌ఏటీ ఇండియా–26 సదస్సులో గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ టి.వెంకన్న బుధవారం పాల్గొన్నారు. తెలంగాణ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ ఆధ్వర్యంలోని ప్రతినిధి బృందంలో పాల్గొన్న కమిషనర్ పట్టణ నీటి నిర్వహణ, మురుగునీటి శుద్ధి, ఘన వ్యర్థాల నిర్వహణ, రీసైక్లింగ్, బయోగ్యాస్, ఈ–వేస్ట్ తదితర రంగాల్లో ఆధునిక సాంకేతికతలు, వినూత్న విధానాలు పరిశీలించారు. అంతర్జాతీయ స్థాయిలో అమలవుతున్న ఉత్తమ పద్ధతులను అధ్యయనం చేసి, వాటిని వరంగల్ నగర అవసరాలకు అనుగుణంగా వినియోగించడం ద్వారా పరిశుభ్రమైన, పచ్చదనంతో కూడిన, పర్యావరణహిత వరంగల్ నిర్మాణానికి మరింత ఊతమివ్వనున్నట్లు కమిషనర్ తెలిపారు. సాంకేతిక పరిజ్ఞానం, నిపుణుల సూచనలు, జ్ఞాన మార్పిడి కార్యక్రమాలు నగర పారిశుద్ధ్యం, వ్యర్థాల నిర్వహణను మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దేందుకు దోహదపడనున్నాయని కమిషనర్ పేర్కొన్నారు.


