ఉద్యానశాఖ.. ఉద్యోగుల్లేక! | - | Sakshi
Sakshi News home page

ఉద్యానశాఖ.. ఉద్యోగుల్లేక!

Sep 7 2026 7:33 AM | Updated on Sep 7 2026 7:33 AM

ఉద్యానశాఖ.. ఉద్యోగుల్లేక! – 8లోu

న్యూస్‌రీల్‌

సోమవారం శ్రీ 7 శ్రీ సెప్టెంబర్‌ శ్రీ 2026

హన్మకొండ: ఉద్యానశాఖను ఉద్యోగుల కొరత తీవ్రంగా వేధిస్తోంది. జిల్లాల పునర్విభజన జరిగి ఏళ్లు గడుస్తున్నా హనుమకొండ, ములుగు జిల్లాలకు జిల్లా ఉద్యాన అధికారి పోస్టులు మంజూరు కాలేదు. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని 78 మండలాలకు కేవలం 17 మంది ఉద్యాన అధికారులు (హెచ్‌ఓలు) మాత్రమే ఉన్నారు. దీంతో రైతులకు సరైన సమయంలో అవసరమైన సలహాలు ఇచ్చే వారు కరువయ్యారు. రాష్ట్ర ఆవిర్భావానికి ముందు ఉద్యాన శాఖ, సూక్ష్మ సేద్యపు ప్రాజెక్టులు వేర్వేరుగా కొనసాగాయి. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఈ రెండింటినీ ఉద్యాన శాఖ పరిధిలోకి ప్రభుత్వం తీసుకొచ్చింది. జిల్లాల పునర్విభజన తర్వాత పట్టు పరిశ్రమ శాఖను ఉద్యానశాఖలో విలీనం చేసింది. ఉద్యోగుల రిటైర్మెంట్‌ మినహా కొత్తగా నియామకాలు లేవు.

89,161 ఎకరాల్లో ఉద్యాన పంటలు..

ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో 89,161 ఎకరాల్లో ఉద్యాన పంటలు సాగవుతున్నాయి. ఎల్‌నినో ప్రభావంతో వరికి ప్రత్యమ్నాయంగా ఉద్యానపంటల సాగు విస్తీర్ణం పెంచాలని ప్రభుత్వం సూచించింది. ఈ క్రమంలో ఉన్న ఉద్యాన అధికారులపై మరింత పనిభారం పెరుగుతోంది. ప్రభుత్వం ఉద్యాన శాఖ ద్వారా వివిధ పంటలకు రాయితీ అందిస్తోంది. ఈ రాయితీ పొందడానికి ప్రతి రైతు వివరాలను క్షేత్రస్థాయికి వెళ్లి సేకరించి ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి. జిల్లా ఉద్యాన అధికారుల పోస్టులను ప్రభుత్వం మంజూరు చేయలేదు. రాష్ట్రంలో ములుగు, హనుమకొండ, నారాయణపేట జిల్లాకు జిల్లా ఉద్యానశాఖాధికారి పోస్టు మంజూరు కాలేదు. ఖమ్మం జిల్లాకు చెందిన హార్టికల్చర్‌ ఏడీ ములుగు జిల్లా అధికారిగా, వరంగల్‌ జిల్లా సూక్ష్మసేద్య ప్రాజెక్టు అసిస్టెంట్‌ డైరెక్టర్‌ హనుమకొండ జిల్లా ఉద్యాన అధికారిగా కొనసాగుతున్నారు.

రెగ్యులర్‌ హెచ్‌ఓల కొరత..

ఉద్యాన పంటల సాగు విస్తరిస్తున్నప్పటికీ అందుకు అనుగుణంగా అధికారులు, సిబ్బందిని నియమించడం లేదు. దీంతో ఉన్న వారిపైనే అదనపు భారం పడుతోంది. ఒక్కో ఉద్యాన అధికారికి 3 నుంచి 6 మండలాల బాధ్యతలు అప్పగించారు. వీరు విధులతో పాటు క్షేత్రస్థాయి పర్యటనలు చేయాల్సి వస్తోంది. దీంతో రైతులకు అందుబాటులో లేకుండా పోతున్నారు. ములుగు జిల్లాలో 10 మండలాలుండగా డిప్యుటేషన్‌పై ఇద్దరు మాత్రమే ఉద్యాన శాఖాధికారులున్నారు. ఇక్కడ రెగ్యులర్‌ హెచ్‌ఓలు లేరు. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో 11 మండలాలకు ఇద్దరు ఉద్యాన అధికారులు మాత్రమే ఉన్నారు. ఇందులో ఒక్క ఉద్యాన అధికారి.. జిల్లా ఉద్యాన అధికారిగా అదనపు పూర్తి బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. దీంతో ఈ జిల్లాలోని రైతులకు సరైన సేవలు అందడం లేదనే ఆరోపణలున్నాయి. మహబూబాబాద్‌ జిల్లాలో 18 మండలాలకు ముగ్గురు ఉద్యాన శాఖాధికారులున్నారు. ఇందులో ఒక్కరు డిప్యుటేషన్‌పై పని చేస్తున్నారు. హనుమకొండ జిల్లాలో 14 మండలాలకు ఇద్దరు, వరంగల్‌ జిల్లాలో 13 మండలాలకు ఐదుగురు ఉద్యాన శాఖ అధికారులున్నారు.

30 ఏళ్లుగా పదోన్నతులు కరువు..

ఉద్యాన శాఖలో పనిచేస్తున్న హెచ్‌ఓలకు 30 ఏళ్లుగా పదోన్నతులు లేకపోవడం మరో సమస్యగా మారింది. దీంతో చాలా మంది పదోన్నతి పొందకుండానే రిటైర్డ్‌ అవుతున్నారని పలువురు హెచ్‌ఓలు ఆందోళన వ్యక్తం చేశారు. ఇతర శాఖల్లో రెగ్యులర్‌గా పదోన్నతి కల్పిస్తున్న ప్రభుత్వం తమకు మాత్రం ఆ అవకాశం లేదంటున్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి అర్హత కలిగిన హెచ్‌ఓలకు పదోన్నతి కల్పించడంతో పాటు ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని ఉద్యాన అధికారులు, రైతులు కోరుతున్నారు.

జిల్లాల వారీగా ఉద్యాన పంటల వివరాలు..

జిల్లా ఆయిల్‌పామ్‌ పండ్ల కూరగాయలు ఇతర

తోటలు పంటలు

వరంగల్‌ 6,750 6,958 806 3,955

హనుమకొండ 4,175 7,108 383 2,111

భూపాలపల్లి 4,576 1,148 98 995

ములుగు 3,562 647 207 530

జనగామ 7,824 9,581 81 178

మహబూబాబాద్‌ 9,149 14,803 482 3,054

సిబ్బంది కొరతతో రైతులకు సలహాలిచ్చే వారు కరువు

హనుమకొండ, ములుగుకు మంజూరుకాని జిల్లా అధికారి పోస్టు

3 నుంచి 6 మండలాలకు ఒక్కరికే అదనపు బాధ్యతలు

ఉమ్మడి జిల్లాలో 78 మండలాలకు 17 మంది హెచ్‌ఓలు మాత్రమే

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement