దామెర : పాడి రైతుల ఆర్థికాభివృద్ధి కోసమే ఇందిర మహిళా డెయిరీ ఏర్పాటు చేస్తున్నట్లు పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి అన్నారు. మండల కేంద్రంలో ఏర్పాటు చేయనున్న ఇందిర మహిళా డెయిరీ స్థలాన్ని ఆదివారం ఆయన అధికారులతో కలిసి పరిశీలించారు. ఈసందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ డెయిరీ కోసం కేటాయించిన స్థలానికి ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అదేవిధంగా దామెర–ల్యాదెళ్ల ప్రధాన రహదారి నుంచి డెయిరీ ఏర్పాటు చేయనున్న స్థలం వరకు రోడ్డు నిర్మాణం చేయాలని, స్థలాన్ని చదునుచేసే పనులు వేగవంతం చేయాలని కోరారు. సొసైటీ మహిళల భాగస్వామ్యంతో డెయిరీ కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఆయన వెంట పీఆర్ డీఈ యుగేంధర్, ఏఈ బాబురావు, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు దుబాసి రాజేందర్, జిల్లా నాయకులు బిల్లా రమణారెడ్డి, సదిరం పోశయ్య, శ్రీధర్‌రెడ్డి, అనిల్‌రెడ్డి, ప్రకాశ్‌రెడ్డి, జక్కుల రవి, జంధ్యాల శ్రవణ్‌రెడ్డి, సర్పంచ్‌లు పంచగిరి రాజు, బొంకూరి రవియాదవ్, సొసైటీ చైర్‌పర్సన్ కచ్చకాయల అరుణ, ఇందిర, భిక్షపతి తదితరులు ఉన్నారు.
వరంగల్ అర్బన్: వరంగల్ మహానగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో సోమవారం గ్రీవెన్స్ నిర్వహిస్తున్నట్లు కమిషనర్ టి.వెంకన్న ఒక ప్రకటనలో తెలిపారు. నగర ప్రజలు గ్రీవెన్స్‌ను సద్వినియోగం చేసుకోవాలని కమిషనర్ కోరారు.
సద్వినియోగం చేసుకోవాలి..
హన్మకొండ అర్బన్: సమస్యల పరిష్కారానికి నిర్వహిస్తున్న గ్రీవెన్స్‌ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ ఆదివారం ఒక ప్రకటనలో కోరారు. సోమవారం హనుమకొండ కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంతో పాటు హనుమకొండ, పరకాల ఆర్డీఓ కార్యాలయాలు, అన్ని ఎంపీడీఓ కార్యాలయాల్లో గ్రీవెన్స్ నిర్వహించనున్నట్లు ఆమె పేర్కొన్నారు ప్రజల నుంచి అర్జీలను స్వీకరించి వాటి పరిష్కారానికి చర్యలు చేపట్టనున్నట్లు కలెక్టర్ తెలిపారు.
భీమదేవరపల్లి: మండలంలోని కొత్తకొండలో శ్రీవీరభద్రస్వామిని ఆంధ్రప్రదేశ్ దేవాదాయ ధర్మాదాయశాఖ అడిషనల్ కమిషనర్ చంద్రశేఖర్ ఆజాద్ ఆదివారం దర్శించుకున్నారు. ఆలయానికి వచ్చిన ఆయనకు కార్యనిర్వహణ అధికారి (ఈఓ) పి.కిషన్‌రావు, ప్రధాన అర్చకులు, సిబ్బంది ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం చంద్రశేఖర్ ఆజాద్ స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు ఆయనను ఆశీర్వదించి, శేషవస్త్రంతో సత్కరించి తీర్థప్రసాదాలు అందించారు. కార్యక్రమంలో ఆలయ అధికారులు, అర్చకులు తదితరులు పాల్గొన్నారు.
కేయూ క్యాంపస్: కేయూలోని కోఎడ్యుకేషన్ ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్‌గా ప్రొఫెసర్ ఎన్.రమణ పదవి కాలం ఆగస్టు 31న ముగిసింది. వారం రోజులు కావొస్తున్నా ప్రిన్సిపాల్‌గా కొనసాగింపునకు ఆయనకు ఉత్తర్వులు ఇవ్వలేదు. ప్రిన్సిపాల్‌గా రమణను కొనసాగిస్తారా లేదా కొత్తవారికి అవకాశం ఇస్తారా అనేది చర్చనీయాంశంగా మారింది. మరోవైపు ఇద్దరు ప్రొఫెసర్లు, ఇద్దరు అసోసియేట్ ప్రొఫెసర్లు కూడా ప్రిన్సిపాల్‌గా నియమించాలని ఎవరికివారు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. అందులో ప్రధానంగా కేయూ కోఎడ్యుకేషన్ ఇంజనీరింగ్ కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ సీహెచ్ రాధిక, కొత్తగూడెంలోని డాక్టర్ మన్‌మోహన్‌సింగ్ ఎర్త్ యూనివర్సిటీ ప్రొఫెసర్లు ఎం.సదానందం, కిశోర్ కూడా ప్రిన్సిపాల్‌గా నియమించాలని ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది. ఇదిలా ఉండగా కేయూ కంప్యూటర్ సైన్స్ విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ రమ కూడా తనను ప్రిన్సిపాల్‌గా నియమించాలని యూనివర్సిటీ అధికా రుల దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది. దీంతో ప్రిన్సిపాల్‌గా రమణను కొనసాగించాలా లేదా మరో ప్రొఫెసర్‌కు అవకాశం కల్పించాలా అనే సందిగ్ధంలో అధికారులు ఉన్నట్లు తెలిసింది. ప్రొఫెసర్ రమణ మాత్రం ఇంజనీరింగ్ కళాశాలలో తన విధులు నిర్వర్తిస్తూనే తనను ప్రిన్సి పాల్‌గా కొనసాగించాలని కోరుతున్నారని సమాచారం. కళాశాల ప్రిన్సిపాల్ ఎవరనేది ఉత్తర్వులు వెలువడే అవకాశాలున్నాయి.


