దుగ్గొండి: మండలంలోని మర్రిపల్లి గ్రామానికి చెందిన దానం రఘు–శ్రీలత దంపతుల కూతురు అక్షర మెడిసిన్‌లో సీటు సాధించింది. ఇటీవల జరిగిన నీట్ పరీక్షలో 488 మార్కులు పొంది యాదాద్రి భవనగిరి ప్రభుత్వ వైద్య కళాశాలలో సీటు సాధించింది. ఈమేరకు అక్షరను పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు, విద్యావేత్తలు శనివారం అభినందించారు.
ఇద్దరికి చూపును
ప్రసాదించిన సిరివెన్నెల
నల్లబెల్లి: మండల కేంద్రంలో ఓ బాలిక విద్యుదాఘాతంతో శుక్రవారం మృతి చెందింది. ఆమె కళ్లను దానం చేసి ఇద్దరికి చూపును ప్రసాదించారు కుటుంబ సభ్యులు. అవయవ దానంపై తరచుగా పలువురికి అవగాహన కల్పించే కుమార్తె నేత్రాలను దానం చేసిందుకు తల్లిదండ్రులు ముందుకు వచ్చారు. నర్సంపేట ప్రభుత్వ ఆస్పత్రిలో శుక్రవారం ఎల్‌వీ ప్రసాద్ ఐ బ్యాంకు వారు నేత్రాలను సేకరించి హైదరాబాద్‌కు తరలించారు. మృతురాలి కుటుంబ సభ్యులను ఎల్‌వీ ప్రసాద్ ఐ బ్యాంకు ప్రతినిధులతోపాటు స్థానికులు అభినందించారు.
దరఖాస్తుల ఆహ్వానం
కాళోజీ సెంటర్: జిల్లాలో జీఈసీఓ పోస్టు భర్తీ కోసం అర్హులైన మహిళా గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు, మహిళా స్కూల్ అసిస్టెంట్ల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు డీఈఓ రంగయ్యనాయుడు ఒక ప్రకటనలో తెలిపారు. ఐదు సంవత్సరాల అనుభవం కలిగిన మహిళా గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు, మహిళా స్కూల్ అసిస్టెంట్లు ఈనెల 8వ తేదీలోగా డీఈఓ కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాలని సూచించారు.
పట్టా మార్పిడికి
అంగీకరించని తల్లి
● కొడుకు భూమి విక్రయిస్తే
సంతకాలకు ససేమిరా
● అక్క, బావ అడ్డుకుంటున్నారని
బాధితుడి ఆవేదన
● కిడ్నీలు పాడైనా న్యాయం కోసం
సోదరి ఇంటి ఎదుట ఆందోళన
ఖానాపురం: వ్యవసాయ భూమికి సంబంధించిన వివాదంలో అక్క ఇంటి ఎదుట తమ్ముడు చావుబతుకుల మధ్య ఆందోళనకు దిగిన సంఘటన అశోక్‌నగర్‌లో శనివారం చోటుచేసుకుంది. స్థానికులు, బాధితుల కథనం ప్రకారం.. అశోక్‌నగర్ గ్రామానికి చెందిన ఇరుకు సరోజన–వెంకటయ్య దంపతులకు కుమారుడు వీరారావు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కూతుళ్ల వివాహాలు చేయగా 3.10 ఎకరాల భూమి తల్లి పేరిట ఉంది. వీరారావుకు వారసత్వంగా 2.34 ఎకరాల వ్యవసాయ భూమిని తల్లి సరోజన గత ఏప్రిల్‌లో రాసి ఇచ్చినప్పటికీ తల్లి పేరు మీదనే పట్టా ఉంది. ఈ క్రమంలో వీరారావుకు కొంతకాలంగా రెండు కిడ్నీలు పాడై పోవడంతో డయాలసిస్ చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. వారసత్వంగా వచ్చిన భూమిని నెల రోజుల క్రితం విక్రయించాడు. ఈ క్రమంలో విక్రయించిన స్థలానికి సంబంధిత పత్రాలపై, తహసీల్దార్ కార్యాలయంలో వేలి ముద్రలు వేయాల్సి ఉంది. పట్టా మార్పిడి కోసం తల్లి సంతకాలు చేయడానికి అంగీకరించడం లేదు. కాగా, విక్రయపత్రాలపై తల్లితో సంతకాలు అక్క, బావ పెట్టనీయడం లేదని అశోక్‌నగర్‌లోని అక్క ఇంటి ఎదుట మంచంపై చావు బతుకుల మధ్య వీరారావు, అతడి భార్య శనివారం న్యాయం కోసం పోరాటానికి దిగారు. అశోక్‌నగర్‌కు వచ్చిన ఎస్సై రామ్మోహన్ విషయం తెలుసుకుని సీఐ శంకర్‌రావు దృష్టికి తీసుకెళ్లారు. బాధితుల వద్దకు వెళ్లి వివరాలు సేకరించి వీరారావును వరంగల్ ఆస్పత్రికి తరలించారు. తల్లితో పాటు అక్కను పోలీస్ స్టేషన్‌కు పిలిపించి పట్టా చేయాలని సూచించారు. మిగిలిన 36 గుంటలను తన ఇష్టానుసారంగా విక్రయానికి అనుమతిస్తే సంతకం చేస్తానని తల్లి పోలీసులకు తెలిపింది.
గడువులోగా
రీసర్వే పూర్తిచేయాలి
సంగెం: నిబంధనలకు అనుగుణంగా రీ సర్వేను నిర్దేశించిన గడువులోగా పూర్తి చేయాలని సర్వే, లాండ్ రికార్డ్స్ అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీనివాస్ సూచించారు. సంగెం మండలంలోని ముమ్మడివరం, గీసుకొండ మండలం ఎలుకుర్తి హవేలిలో రీసర్వే పనులను శనివారం ఆయన పరిశీలించి మాట్లాడారు. రీసర్వేను తప్పులు దొర్లకుండా నిర్వహించాలని సూచించారు. రీ సర్వే పనుల పురోగతి, సర్వే నిర్వహణ తీరును పరిశీలించి సంబంధిత సర్వేయర్లకు పలు సూచనలు చేశారు.


