రేషన్‌ ఈ–కేవైసీ తప్పనిసరి | - | Sakshi
Sakshi News home page

రేషన్‌ ఈ–కేవైసీ తప్పనిసరి

Jul 22 2026 2:17 AM | Updated on Jul 22 2026 2:17 AM

ఈనెల 31 వరకు పూర్తిచేయాలని పౌరసరఫరాల శాఖ ఆదేశాలు

నేడు డీలర్లకు అవగాహన కల్పించనున్న అధికారులు

జిల్లాలో 2,96,456 రేషన్‌కార్డులు.. 8,93,213 మంది లబ్ధిదారులు

ఇప్పటివరకు ఈ–కేవైసీ పూర్తిచేయించుకున్నది 7,24,722 మంది

ఖిలా వరంగల్‌: ప్రజాపంపిణీ వ్యవస్థలో పారదర్శకత కోసం ఆహారభద్రతా కార్డుదారులకు ఈ–కేవైసీని పౌరసరఫరాల శాఖ తప్పనిసరి చేసింది. ఈ–కేవైసీ నమోదైన వారికి మాత్రమే వచ్చే నెల నుంచి రేషన్‌ పంపిణీ చేసేలా జాతీయ సమాచార వ్యవస్థ (ఎన్‌ఐసీ) సాఫ్ట్‌వేర్‌ నవీకరిస్తోంది. దీనికి ఈ నెల 31 తుది గడువు నిర్ణయించారు. మృతి చెందిన వారు, ఏళ్లుగా రేషన్‌ తీసుకోని వారి కార్డులను తొలగించాలని ప్రభుత్వం భావిస్తోంది. కార్డులున్నా కొందరు బియ్యం తీసుకోవడం లేదు. దీంతో అర్హులకు మాత్రమే రేషన్‌ అందేలా చర్యలు తీసుకుంటోంది. జిల్లాలో ఈనెల 20 వరకు 81.14 శాతం ఈ–కేవైసీ పూర్తయ్యింది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పోర్టబిలిటీతో లబ్ధిదారులు దేశంలోని ఏ రేషన్‌ దుకాణం నుంచైనా రేషన్‌ సరుకులు తీసుకునే వీలు కల్పించింది. అదేవిధానంలో లబ్ధిదారులు ఎక్కడి నుంచైనా ప్రస్తుతం ఈ–కేవైసీ అప్‌డేట్‌ చేసుకోవచ్చు. జిల్లాలో మొత్తం 2,96,456 రేషన్‌కార్డులకు 8,93,213 మంది లబ్ధిదారులు ఉన్నారు. 7,24,722 మంది ఈ–కేవైసీ చేయించుకోగా.. 1,68,491 మంది చేయించుకోవాల్సి ఉంది.

జిల్లాలో కొత్తగా 30 వేల కార్డులు..

జిల్లాలో సుమారు 30 వేల కొత్తరేషన్‌ కార్డులు మంజూరయ్యాయి. వీరిలో చాలా మంది పాతకార్డుల్లో సభ్యులే. పాతకార్డుల్లో వీరు సభ్యులుగా ఉన్నప్పుడు ఈ–కేవైసీ చేయించుకున్నారు. ఇప్పుడు కొత్తకార్డు తీసుకుంటే మళ్లీ ఈ–కేవైసీ చేయించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

ఇలా చేస్తే సరి..

● కార్డుదారులు సమీపంలోని రేషన్‌ దుకాణానికి వెళ్లి అక్కడి డీలర్‌ చెప్పినట్లుగా బయోమెట్రిక్‌ అప్‌డేట్‌ చేసుకుంటే ప్రక్రియ పూర్తవుతుంది. కార్డులో పేర్లు ఉన్నవారందరూ ఆధార్‌ ఆధారిత బయోమెట్రిక్‌ పూర్తి చేయించుకోవాలి. ఈ–కేవైసీకి, సరుకుల పంపిణీకి ఎలాంటి సంబంధం లేదు.

● రేషన్‌ దుకాణానికి వెళ్లలేని వృద్ధులు, కదల్లేనివారు. దివ్యాంగులు మినహాయింపు కోసం రేషన్‌డీలర్‌ లేదా తహసీల్దార్‌ కార్యాలయాలను సంప్రదించాలి. బయోమెట్రిక్‌ వేలిముద్రలు రాకుంటే ఆధార్‌ కేంద్రాల్లో అప్‌డేట్‌ చేయించుకోవాలి.

● ఈనెల 31 వరకు ఈ–కేవైసీ చేయించుకోకుంటే సబ్సిడీ నిలిపివేత లేదా ఆహార ధాన్యాల కేటాయింపు తగ్గే అవకాశాలు ఉంటాయి.

ఈనెల 31వరకు ఈ–కేవైసీ చేసుకోవాలి..

పాత, కొత్తకార్డుల లబ్ధిదారులు, కార్డుల్లో కొత్తగా చేరిన వారికి ఈ–కేవైసి ప్రక్రియ తప్పనిసరి. ఈనెల 31 వరకు సమీప రేషన్‌ దుకాణాల్లోని డీలర్‌ ఈపాస్‌ యంత్రాల్లో అప్‌డేట్‌ చేయించుకోవాలి. లేకుంటే భవిష్యత్‌లో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది. ఈ ప్రక్రియపై బుధవారం రేషన్‌డీలర్లతో సమావేశం ఏర్పాటు చేశాం. డీలర్లకు ఇప్పటికే సమాచారం అందించి ఈ–కేవైసీ పూర్తి చేసేలా ఆదేశాలు జారీ చేశాం. – కిష్టయ్య, డీఎస్‌ఓ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement