ఐనవోలు: ‘మండలంలోని వెంకటాపురంలో 138 ఎకరాల ప్రభుత్వ సీలింగ్ భూమి ఆక్రమణకు గురైంది. పలుకుబడి కలిగిన వ్యక్తులు అక్రమంగా పట్టా పొందినట్లు సీపీఐ గుర్తించింది. ఎట్టిపరిస్థితుల్లో సీలింగ్ భూమిని వదిలిపెట్టం’ అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, సీపీఐ శాసనసభ పక్ష నాయకుడు, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. మంగళవారం సీపీఐ జిల్లా నాయకత్వంతో కలిసి ఆక్రమణకు గురైందని భావిస్తున్న భూమిని క్షేత్రస్థాయిలో పరిశీలించి గ్రామస్తుల పోరాటానికి సంఘీభావం తెలిపారు.
ఆ వ్యక్తిని ఎలా అనుమతిస్తారు?
కూనంనేని సాంబశివరావు సీలింగ్ భూమిని పరిశీలిస్తుండగా.. అక్రమంగా పట్టా పొందాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న కట్ట మనోజ్‌రెడ్డి అక్కడికి వచ్చారు. ఇది సరైన సమయం కాదని చెప్పి ఆయనను వెనక్కి పంపించారు. కాగా, ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని ఇక్కడికి ఎలా అనుమతించారని బందోబస్తు కోసం వచ్చిన వర్ధన్నపేట సీఐ శ్రీనివాసరావును కూనంనేని నిలదీశారు. రెవెన్యూ అధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. ఆయన వెంట సర్పంచ్ గుడ్డేటి ఏలియా, రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కల్లపల్లి శ్రీనివాసరావు, జిల్లా నాయకులు కర్రె భిక్షపతి, తోట భిక్షపతి, మహ్మద్ వలీవుల్లా ఖాద్రి, ఎదునూరి వెంకట్రాజం, కొట్టపాక రవి, మాదాసి యాకుబ్, జూకంటి పద్మ, భూ పోరాట నాయకులు పాము రమ, బండి సరిత, మచ్చ హైమ, గడ్డమీది ప్రశాంతి, కొమురయ్య తదితరులు పాల్గొన్నారు.
వెంకటాపురం గ్రామ ప్రజలకు సీపీఐ రాష్ట్ర నాయకత్వం
అండగా ఉంటుంది..
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, శాసనసభ పక్ష నాయకుడు కూనంనేని


