● కలెక్టర్ డాక్టర్ సత్యశారద
● నర్సంపేటలో ప్రభుత్వ ఆస్పత్రి,
వైద్య కళాశాల తనిఖీ
నర్సంపేట రూరల్ : రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు వైద్యులు కృషిచేయాలని కలెక్టర్ డాక్టర్ సత్యశారద అన్నారు. నర్సంపేట పట్టణంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి, వైద్య కళాశాలను శుక్రవారం కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆస్పత్రిలో అందుతున్న వైద్యసేవలు, రోగులకు కల్పిస్తున్న సౌకర్యాలను పరిశీలించారు. రోగులతో నేరుగా మాట్లాడి వైద్యసేవలను అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రిలో పరిశుభ్రత, వైద్యసిబ్బంది హాజరు, ఔషధాల లభ్యత వంటి అంశాలపై పలు సూచనలు చేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ గడువు ముగిసిన మందులను వేరు చేయాలని, ఎట్టి పరిస్థితుల్లో రోగులకు ఇవ్వకూడదని స్పష్టమైన ఆదేశాల జారీ చేశారు. కార్యక్రమంలో జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి సాంబశివరావు, నర్సంపేట ఆర్డీఓ ఉమారాణి, ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కిషన్, వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ప్రవీణ్ పాల్గొన్నారు.
డీబీఎం–40 కాల్వ పరిశీలన
ప్రజపాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా లక్నెపల్లి గ్రామ శివారులోని డీబీఎం–40 కాల్వను కలెక్టర్ డాక్టర్ సత్యశారద శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కాల్వ నుంచి పంటలకు నీరందించాలని అధికారులను ఆదేశించారు. అలాగే కాల్వను నిరంతరం పర్యవేక్షించాలని పేర్కొన్నారు. సాగునీటి సరఫరాలో లోపాలు రాకుండా చూడాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. కలెక్టర్ వెంట ఆర్డీఓ ఉమారాణి, ఇరిగేషన్ ఈఈ సుదర్శన్, సీహెచ్ సునీత, జిల్లా ఇరిగేషన్ అధికారి ప్రశాంతి, డీఈ సంతోష్ తదితరులు ఉన్నారు.


