న్యూస్‌రీల్
శనివారం శ్రీ 4 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026
ఉమ్మడి వరంగల్ మీదుగా వెళ్లే ప్రధాన మార్గాల్లో ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు నిధుల కేటాయింపు జరిగింది. కొత్త లైన్లు, డబ్లింగ్, మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేశారు.
● కాజీపేట–విజయవాడ మధ్య 219.64 కి.మీ.పొడవైన మూడో లైన్, విద్యుద్ధీకరణ పనుల కోసం రూ.1,955.27 కోట్లు మంజూరు చేశారు.
● కాజీపేట–బల్లార్షా వరకు 201.04 కి.మీ. పొడవైన మూడో లైన్ పనులకు రూ.2,063.03 కోట్లు ఇచ్చారు.
● నష్కల్ (పెండ్యాల్) – హసన్‌పర్తి నడుమ 24.55 కి.మీ. బైపాస్ లైన్ నిర్మాణానికి రూ.465.29 కోట్లు మంజూరయ్యాయి.
● భద్రాచలం రోడ్ – డోర్నకల్ వరకు 54.65 కి.మీ సెక్షన్ పనుల కోసం రూ.770.12 కోట్లు కేటాయించారు.
● కాజీపేట – బల్లార్షా మెయిన్ లైన్‌ను పెద్దపల్లి–కరీంనగర్ లైన్‌తో అనుసంధానించే 2.169 కి.మీ. బైపాస్ లైన్ కోసం రూ.36.99 కోట్లు కేటాయించారు.
● ఘన్‌పూర్–సూర్యాపేట (పాలకుర్తి మీదుగా) 170 కి.మీ. కొత్త లైన్ సర్వేకు నిధులిచ్చారు.
● బీజాపూర్–వరంగల్‌కు 288 కి.మీ.ల కొత్త లైన్ కోసం సర్వేకు కూడా అనుమతి ఇచ్చారు.
● క్వాడ్రప్లింగ్ (నాలుగు లైన్ల) సర్వేలకు కూడా నిధులు ఇచ్చారు.
సాక్షిప్రతినిధి, వరంగల్:
దక్షిణ మధ్య రైల్వే పరిధి ఉమ్మడి వరంగల్ జిల్లాకు భారీగా నిధులు కేటాయించారు. 2026–27 రైల్వే బడ్జెట్ (పింక్ బుక్)లో హనుమకొండ, వరంగల్, మహబూబాబాద్, జనగామ ప్రాంతాలకు భారీగా నిధులు, ప్రాజెక్టులు కేటాయించారు. ముఖ్యంగా రైల్వే మౌలిక సదుపాయాల కల్పన, క్వాడ్రప్లింగ్ (నాలుగు లైన్లు), సర్వేలు, నిర్మాణంలో ఉన్న మూడో లైన్ పూర్తి, స్టేషన్ల ఆధునికీకరణకు ఈ బడ్జెట్ పెద్దపీట వేసింది. దక్షిణ మధ్య రైల్వేశాఖ కేటాయింపులతో కూడిన పింక్‌బుక్ శుక్రవారం విడుదల కాగా, అధిక నిధులు కేటాయించడంపై హర్షం వ్యక్తమవుతోంది.
కాజీపేట పీఓహెచ్‌కు రూ.521.36 కోట్లు
రైల్వే బడ్జెట్ (పింక్ బుక్)లో కాజీపేటను కీలక మెయింటెనెన్స్ హబ్‌గా మార్చేందుకు పెద్దపీట వేశారు. కాజీపేట పీరియాడికల్ ఓవరాలింగ్ (పీఓహెచ్) వర్క్ షాప్ కోసం రూ. 521.36 కోట్లు మంజూరు చేసినట్లు పేర్కొన్నారు. కాజీపేటలో 24–కోచ్‌ల నిడివి గల క్యాంటెక్ డిజైన్ పిట్ లైన్ల కోసం రూ.17.81 కోట్లు ఇచ్చారు. కాజీపేట డీజిల్ లోకో షెడ్ సామర్థ్యం పెంపు (ఎలక్ట్రిక్ లోకోలను ఉంచేందుకు) కోసం రూ.30.95 కోట్లు, ఎలక్ట్రిక్ లోకో షెడ్ సామర్థ్యం పెంపు (125 నుంచి 175 లోకోలకు) రూ. 21.68 కోట్లు, ఎలక్ట్రిక్ లోకో షెడ్ విస్తరణ (175 నుంచి 300 లోకోలకు)కు రూ. 22.56 కోట్లు చొప్పున కేటాయించారు.
రైల్వేస్టేషన్లకు ‘అమృత్ భారత్’ హంగులు
’అమత్ భారత్ స్టేషన్ స్కీమ్’ కింద ప్రధాన స్టేషన్ల అభివృద్ధికి నిధులు కేటాయించారు. ఇందులో భాగంగా.. వరంగల్ స్టేషన్ తూర్పు వైపు ఎంట్రీ అభివృద్ధి, బుకింగ్ ఏరియా, కాన్ కోర్స్ మెరుగుదల కోసం రూ.4.50 కోట్లిచ్చారు. వరంగల్ స్టేషన్‌లో 12 మీటర్ల వెడల్పు గల కొత్త ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ (ఎఫ్‌ఓబీ) కోసం రూ. 13.24 కోట్లు, కాజీపేట స్టేషన్ ఆధునికీకరణకు రూ.18.73 కోట్లు (జనగామ, యాదాద్రితో కలిపి) కేటాయించారు. కాజీపేటలో 12 మీటర్ల వెడల్పు గల ఎఫ్‌ఓబీ కోసం రూ.9.78 కోట్లు, ప్లాట్‌ఫామ్ 4–5 వరకు ఎఫ్‌ఓబీ విస్తరణ, లిఫ్టులు, ఎస్కలేటర్ల కోసం రూ.13.93 కోట్లు మంజూరు చేసినట్లు పింక్‌బుక్‌లో పేర్కొన్నారు. మహబూబాబాద్ – జనగామ స్టేషన్లలో 12 మీటర్ల వెడల్పు గల ఎఫ్‌ఓబీలు, రాంప్‌ల నిర్మాణం కోసం రూ.44.34 కోట్లు, జనగామ గూడ్స్ షెడ్ సౌకర్యాల మెరుగుదలకు రూ. 6.24 కోట్లు ఇచ్చారు. అలాగే భద్రత పనుల కింద వరంగల్ – చింతలపల్లి లెవల్ క్రాసింగ్ 63 ఏ వద్ద రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మాణానికి రూ.25.58 కోట్లు, కాజీపేట – వరంగల్ ఎల్‌సీ 61 వద్ద రైల్వే అండర్ బ్రిడ్జి కోసం రూ. 24.65 కోట్లు, రఘునాథపల్లి – ఇప్పగూడ ఎల్‌సీ 44 వద్ద 2–లేన్ రైల్వే ఓవర్ బ్రిడ్జి, సబ్‌వే కోసం రూ.12.83 కోట్లు, డోర్నకల్ – మణుగూరు మార్గంలో కారేపల్లి – సింగరేణి కొలీరీస్ మధ్య వివిధ లెవల్ క్రాసింగ్‌ల వద్ద రైల్వే అండర్ బ్రిడ్జిల నిర్మాణం చేపట్టనున్నట్లు పింక్‌బుక్‌లో పేర్కొన్నారు.
కాజీపేట–విజయవాడ
మూడో లైన్‌కు రూ.1,955 కోట్లు
కాజీపేట–బల్లార్షాకు రూ.2,063 కోట్లు
నష్కల్–హసన్‌పర్తికి రూ.465.29 కోట్లు
క్వాడ్రప్లింగ్, కొత్త రైల్వే సర్వేల కోసం కేటాయింపులు
కాజీపేట జంక్షన్ నుంచే పలు మార్గాలు
పీఓహెచ్‌కు రూ.521.36 కోట్లు..
‘అమృత్ భారత్’ కింద
స్టేషన్లకు కొత్త హంగులు
2026–27 రైల్వే బడ్జెట్ (పింక్‌బుక్)లో భారీగా నిధులు
కొత్తలైన్ సర్వేకు నిధులు ఇలా.. (రూ.కోట్లలో)
లైన్ కి.మీ నిధులు
భూపాలపల్లి–కాజీపేట (హసన్‌పర్తి) 64 1.60
హసన్‌పర్తి–కరీంనగర్ 62 1.55
డోర్నకల్–గద్వాల
(సూర్యాపేట, నల్లగొండ మీదుగా) 296 7.40
కాజీపేట–సికింద్రాబాద్ 120 2.40
కాజీపేట–విజయవాడ 220 4.40
కాజీపేట–బల్లార్షా 234 4.68
వరంగల్–సికింద్రాబాద్ 38 0.75


