అధికారులు సమన్వయంతో పనిచేయాలి : కలెక్టర్
న్యూశాయంపేట: మున్సిపల్ ఎన్నికల ప్రక్రియలో ఎక్కడాలోపాలు తలెత్తకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ డాక్టర్ సత్యశారద సూచించారు. కలెక్టరేట్ సమావేశపు హాల్‌లో వర్ధన్నపేట, నర్సంపేట మున్సిపాలిటీలకు సంబంధించిన బ్యాలెట్‌పేపర్లు, సీల్స్, స్టేషనరీ, పోలింగ్‌కు అవసరమైన ఇతర సామగ్రిని కలెక్టర్ శనివారం క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ఎన్నికల సామగ్రి భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని, స్ట్రాంగ్ రూంలు, పోలింగ్ కేంద్రాల్లో భద్రతా ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలని ఆదేశించారు. శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసు శాఖతో సమన్వయం చేసుకోవాలని తెలిపారు. అదనపు కలెక్టర్ సంధ్యారాణి, ఆర్డీఓ సుమ, మున్సిపల్ కమిషనర్లు సుధీర్‌కుమార్, భాస్కర్, డీఏఓ ఫణికుమార్, ఎన్నికల విభాగం అధికారులు పాల్గొన్నారు.
అక్రిడిటేషన్ కార్డులకు దరఖాస్తుల ఆహ్వానం
న్యూశాయంపేట: సమాచార పౌరసంబంధాల శాఖ ఆధ్వర్యంలో 2026 – 28వ సంవత్సరానికి జర్నలిస్టుల అక్రిడిటేషన్ కార్డుల జారీ కోసం సోమవారం నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా అక్రిడిటేషన్ కమిటీ చైర్‌పర్సన్, కలెక్టర్ డాక్టర్ సత్యశారద ఒక ప్రకటనలో తెలిపారు. యాజమాన్యాలు పంపిన జాబితాలో ఉన్న జర్నలిస్టులు మాత్రమే సమాచార శాఖ వెబ్‌సైట్ ఐఅండ్‌పీఆర్.తెలంగాణ.జీఓవీ.ఇన్‌లో దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ సూచించారు.
నేడు నర్సంపేటలో కేటీఆర్ రోడ్‌షో
నర్సంపేట: మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, కేటీఆర్ ఆదివారం నర్సంపేటలో రోడ్‌షో నిర్వహించనున్నట్లు మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి తెలిపారు. ఉదయం 11 గంటలకు వరంగల్ రోడ్డు నుంచి పాకాల రోడ్డు వరకు రోడ్‌షో ఉంటుందని ఆయన పేర్కొన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
ఓటరు చైతన్య కరపత్రాల ఆవిష్కరణ
నర్సంపేట : వినియోగదారుల సమాచార కేంద్రం కమిటీ, స్వచ్ఛంద సంస్థల సమాఖ్య ఆధ్వర్యంలో ముద్రించిన ఓటరు చైతన్య కరపత్రాలను నర్సంపేట ఏసీపీ పున్నం రవీందర్‌రెడ్డి, మున్సిపల్ భాస్కర్ శనివారం ఆవిష్కరించారు. అనంతరం ఏసీపీ రవీందర్‌రెడ్డి, కమిషనర్ భాస్కర్ మాట్లాడారు. ఓటర్లు, రాజకీయ పార్టీల నాయకులు ఎన్నికల నిబంధనలను కచ్చితంగా పాటించాలని కోరారు. మైకుల వినియోగం, ప్రలోభాలు, తదితరాలపై నిర్లక్ష్యం చేయొద్దని స్పష్టం చేశారు. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టరీత్యా కఠిన చర్యలు తప్పవని తెలిపారు. వినియోగదారుల సమాచార కేంద్రం అధ్యక్షుడు గిరగాని సుదర్శన్ గౌడ్, స్వయంకృషి స్వచ్ఛంద సంస్థ నిర్వాహకుడు బెజ్జంకి ప్రభాకర్ మాట్లాడుతూ అభ్యర్థులు బాధ్యతలు, నిధులు, ఇతర అంశాలపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. ఎన్నికల్లో అవకతవకలు, అక్రమాలు, మోసాలు చోటు చేసుకుంటే సెల్ నంబర్ 7680096877, 9966425375ల్లో, సీ విజిల్ యాప్ ద్వారా ఫిర్యాదు చేయాలని ప్రజలను కోరారు. కార్యక్రమంలో ఏఎస్‌ఆర్ సేవా సంస్థ నిర్వాహకుడు ఎర్రబోయిన రాజశేఖర్, ఎస్సీ, ఎస్టీ కన్వీనర్ బోయిన వెంకటస్వామి, మొగిలిచర్ల రాము, రవికాంత్, తదితరులు పాల్గొన్నారు.
టేకు కలప పట్టివేత
నల్లబెల్లి: టేకు కలపను అక్రమంగా తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్న సంఘటన మండలంలోని రుద్రగూడెం శివారులో జరిగింది. ఎస్సై గోవర్ధన్ శనివారం రాత్రి పెట్రోలింగ్ చేస్తున్న సమయంలో టేకు కలపతో వస్తున్న ఓ వాహనం కనిపించింది. దీంతో అనుమానంతో ఎస్సై వాహనాన్ని ఆపివేసి తనిఖీ చేశారు. ఎలాంటి అనుమతులు లేకుండా కలపను తరలిస్తున్నట్లు గుర్తించిన ఎస్సై వాహనాన్ని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. కేసు నమోదు చేసి రూ.57 వేల విలువైన కలపను ఫారెస్టు అధికారులకు అప్పగించారు.
అధికారులు సమన్వయంతో పనిచేయాలి : కలెక్టర్
అధికారులు సమన్వయంతో పనిచేయాలి : కలెక్టర్


