రేపు ప్రకృతి విపత్తులపై మాక్‌డ్రిల్
న్యూశాయంపేట: ప్రకృత్తి విపత్తులపై వరంగల్ నగరంలోని చిన్నవడ్డేపల్లి చెరువు ప్రాంతంలో సోమవారం మాక్‌డ్రిల్ నిర్వహించనున్నట్లు కలెక్టర్ డాక్టర్ సత్యశారద తెలిపారు. ఈ మేరకు ఎస్‌డీఆర్‌ఎఫ్, అగ్నిమాపక, రెవెన్యూ, పోలీస్, మున్సిపల్, తదితర శాఖల అధికారులతో కలెక్టరేట్‌లో శనివారం సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బల్దియా కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్‌తో కలిసి కలెక్టర్ మాట్లాడారు. మాక్‌డ్రిల్ జరిగే ప్రాంతంలో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని, వాహనదారులు సహకరించాలని కోరారు. ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు చేపట్టాల్సిన రెస్క్యూ చర్యలు, బాధితుల తరలింపు, పునరావాస కేంద్రాల ఏర్పాట్లు, వైద్య సహాయం అందించే విధానంపై అవగాహన కల్పించడమే ఈ మాక్‌డ్రిల్ ఉద్దేశమని వివరించారు. మాక్‌డ్రిల్‌ను సమర్థవంతంగా నిర్వహించేందుకు అధికారులకు కలెక్టర్ సత్యశారద సలహాలు ఇచ్చి, పలు సూచనలు చేశారు.
రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు
రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు చేపడుతున్నట్లు కలెక్టర్ డాక్టర్ సత్యశారద తెలిపారు. జనవరిలో జరగనున్న రోడ్ సేఫ్టీ కార్యక్రమాలపై హైదరాబాద్‌లోని సచివాలయం నుంచి సీఎస్ రామకృష్ణారావు, స్పెషల్ సీఎస్ వికాస్‌రాజ్, రవాణాశాఖ కమిషనర్ ఇలాంబర్తితో కలిసి రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లతో రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ శనివారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ సత్యశారద పాల్గొని మాట్లాడుతూ ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రాంతాలను (బ్లాక్ స్పాట్లు) గుర్తించి తగు చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. రోడ్లపై రుంబుల్ స్ట్రిప్ట్స్, స్టడ్స్, సూచిక బోర్డులు, బ్లింకర్స్ వంటివి ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్‌లో ఆర్డీఓ సుమ, ఆర్‌అండ్‌బీ ఈఈ రాజేందర్, జిల్లా ట్రాన్స్‌పోర్ట్ అధికారి శోభన్‌బాబు, జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించాలి
ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించాలని అధికారులకు కలెక్టర్ డాక్టర్ సత్యశారద సూచించారు. క్రిస్మస్ సంబరాల ఏర్పాట్లపై అధికారులు, పాస్టర్లతో కలెక్టరేట్‌లో శనివారం జరిగిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ నియోజకవర్గానికి రూ.2 లక్షల చొప్పున కేటాయిస్తూ మూడు నియోజకవర్గాల వారీగా వరంగల్, వర్ధన్నపేట, నర్సంపేట తహసీల్దార్లకు ఏర్పాట్ల బాధ్యతలు అప్పగించినట్లు చెప్పారు. సమావేశంలో అదనపు కలెక్టర్ సంధ్యారాణి, డీఆర్‌ఓ విజయలక్ష్మి, ఆర్డీఓలు, తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ డాక్టర్ సత్యశారద


