నాణ్యమైన మామిడిని పండించాలి
వర్ధన్నపేట: రైతులు సమగ్ర సస్యరక్షణ పద్ధతులు, నీటి యాజమాన్యం పాటించి నాణ్యత కలిగిన మామిడి పంటను పండించి, మార్కెట్‌లో అధిక ధరలు పొందాలని జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమ అధికారి ఆర్.శ్రీనివాసరావు సూచించారు. మండలంలోని దమ్మన్నపేట గ్రామంలో సమగ్ర ఉద్యాన పంటల అభివృద్ధి మిషన్ (ఎంఐడీహెచ్)లో భాగంగా ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో మామిడి రైతులకు శనివారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం మామిడి పంట పూత దశకు వచ్చిన నేపథ్యంలో తీసుకోవాల్సిన సమగ్ర యాజమాన్య పద్ధతులను రైతులకు వివరించారు. మామిడి రైతులకు ప్రభుత్వం అందిస్తున్న పథకాల గురించి తెలిపారు. ఎకరానికి రూ.9 వేల రాయితీ అందిస్తోందని గుర్తుచేశారు. ఫ్రూట్ కవర్లు వాడటం వలన మామిడి నాణ్యత పెరిగి అధిక దిగుబడి వస్తుందని చెప్పారు. డివిజన్ ఉద్యాన అధికారి సీహెచ్.రాకేష్ మాట్లాడుతూ ఉద్యాన శాఖ ద్వారా పండ్లు, కూరగాయలు, ఆయిల్‌పామ్ తోటలు, డ్రిప్ ఇరిగేషన్‌కు సంబంధించిన రాయితీల గురించి రైతులకు వివరించారు. కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి ప్రశాంత్, ఉద్యాన, వ్యవసాయ విస్తరణ అధికారులు రాజర్షి, మురళి, కంపెనీ ప్రతినిధులు సాగర్, సతీష్, విక్రమ్, ఆయిల్‌పామ్ క్షేత్రస్థాయి అధికారులు ప్రణయ్, కల్యాణ్, రైతులు సురేందర్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమ అధికారి శ్రీనివాసరావు


