కుష్ఠుపై సమరం
ఈనెల 31 వరకు ఇంటింటి సర్వే
గీసుకొండ: జిల్లాలో కుష్ఠు నిర్ధారణ కోసం వైద్య సిబ్బంది ఇంటింటి సర్వే చేపట్టారు. ఈ నెల 18 నుంచి 31వ తేదీ వరకు ఈ సర్వే కొనసాగుతుందని వైద్యాధికారులు తెలిపారు. ప్రారంభఽ దశలో వ్యాధిని గుర్తించి తగిన చికిత్స అందించడానికి జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ ప్రత్యేక కార్యాచరణ రూపొదించింది. ఇప్పటికే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి పీహెచ్‌సీల నోడల్ అధికారులకు శిక్షణ ఇచ్చారు. వ్యాధికి సంబంధించిన ప్రచార కరపత్రాలు, బ్యానర్లను గ్రామాలు, ఆరోగ్య కేంద్రాల వద్ద కలెక్టరేట్‌లోని అదనపు కలెక్టర్ ఏర్పాటు చేయిస్తున్నారు.
ఇవీ వ్యాధి లక్షణాలు..
శరీరంలో తెల్లని, ఎర్రని రాగి రంగు మచ్చలు ఉండి స్పర్శ లేకుండా మొద్దుబారి ఉండడం, ముఖంపై నూనె పోసినట్లు మెరుస్తూ ఉండడం, దద్దులు రావడం, అరికాళ్లు, అరచేతుల్లో తిమ్మిర్లు రావడం, కనురెప్పలు సరిగా మూసుకోకపోవడం లాంటివి కుష్ఠు లక్షణాలు. ఇంటింటి సర్వేలో ఇలాంటి లక్షణాలు ఉన్నవారిని గుర్తించి సమీపంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు తీసుకెళ్లి వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. కుష్ఠు వ్యాధితో వచ్చే అంగవైకల్యానికి చేతివేళ్లు వంకర పోవడం, ఫుట్ డ్రాప్ సమస్య ఉన్నవారికి ఉచితంగా శస్త్రచికిత్సతో సరిచేస్తారు. వ్యాధి లక్షణాలు ఉంటే వెంటనే ఎండీటీ చికిత్స అందిస్తారు. వ్యాధి ఏ దశలో ఉన్నా సాధారణమని ప్రజలు గమనించాలని, హైరానా పడకుండా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్యులను కలవాలని వైద్యాధికారులు సూచిస్తున్నారు.
వ్యాధి సోకేదిలా..
లెప్రే అనే బ్యాక్టీరియా వల్ల కుష్ఠు సోకుతుంది. వ్యాధిగ్రస్తులు తుమ్మినా, దగ్గినా తుంపర్ల ద్వారా దగ్గరలో ఉన్న వారికి వ్యాధి సోకే అవకాశం ఉంటుంది. ఈవ్యాధి ముఖ్యంగా చర్మం, నరాలకు సోకుతుంది. ఇది ఒక రకమైన అంటువ్యాధి కారకం.
రెండు రకాలుగా చికిత్స..
కుష్ఠు వ్యాధి సోకిన వ్యక్తికి ఒకటి నుంచి ఐదు మచ్చలు ఉంటే వారిని పాసీ బ్యాసిల్లరీ(పీబీ)గా గుర్తిస్తారు. ఇలాంటి వారికి 6 నెలల వరకు చికిత్స ఉంటుంది. కనీసం 9 నెలల్లో కోర్సును పూర్తి చేయాల్సి ఉంటుంది ఐదు కంటే ఎక్కువ మచ్చలు ఉంటే వారిని మల్టీ బ్యాసిల్లరీ (ఎంబీ)గా గుర్తిస్తారు. అలాంటి వారికి 12 నెలలపాటు చికిత్స అందిస్తారు. కనీసం 15 నెలల్లో కోర్సు పూర్తి చేయాల్సి ఉంటుంది. బహుళ ఔషధ చికిత్సతో కుష్ఠును పూర్తిగా నయం చేయవచ్చని వైద్యులు అంటున్నారు. రూ.15 వేల నుంచి రూ.20 వేల వరకు ఖరీదు చేసే మందులను ప్రభుత్వం ఉచితంగా అందిస్తోంది. 6–12 నెలల వరకు చికిత్స తీసుకుంటే వ్యాఽధి పూర్తిగా నయం అవుతుందని వైద్యులు చెబుతున్నారు. సకాలంలో వ్యాధి లక్షణాలను గుర్తించి అంగవైకల్యం కలుగకుండా చూడవచ్చని వారు సూచిస్తున్నారు.
జిల్లాలో ప్రస్తుతం 27 మంది కుష్ఠు వ్యాఽధిగ్రస్తులు ఉన్నారని జిల్లా కుష్ఠు నివారణ ప్రోగ్రాం అధికారి డాక్టర్ మోహన్‌సింగ్ తెలిపారు. ప్రతి రోజు ఉదయం 6 నుంచి 9 గంటల వరకు వైద్య బృందాలు ఇంటింటికి తిరుగుతూ సర్వే చేస్తాయన్నారు. సర్వే కోసం జిల్లా వ్యాప్తంగా 545 టీంలను ఏర్పాటు చేశామని, 1,090 మంది టీం మెంబర్లు, 208 మంది సర్వేయర్లు ఉంటారన్నారు. మండలాల వారీగా లెప్రసీ నోడల్ పర్సన్లు కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తారన్నారు.
545 టీంలను ఏర్పాటు చేసిన వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు
జిల్లాలో ప్రస్తుతం 27 మంది వ్యాధిగ్రస్తులు
బహుళ ఔషధ చికిత్సతో పూర్తిగా నయం


