ఆయిల్‌పామ్‌పై అవగాహన కల్పించాలి
ఖిలా వరంగల్: ఆయిల్‌పామ్ సాగులో నిర్దేశించిన ప్రగతిని సకాలంలో పూర్తి చేయాలని కలెక్టర్ డాక్టర్ సత్యశారద సూచించారు. ఈ మేరకు శుక్రవారం కలెక్టరేట్‌లో అధికారుల సమావేశంలో ఆమె మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆయిల్‌పామ్ విస్తరణ పథకాన్ని జిల్లాలో అమలు చేయాలని, కేటాయించిన 4,250 ఎకరాల లక్ష్యాన్ని ఉద్యాన, వ్యవసాయ శాఖలు సంయుక్తంగా పూర్తిచేయాలని సూచించారు. రైతులను గుర్తించి అయిల్‌పామ్ సాగు వైపు ప్రోత్సహించాలని, ప్రభుత్వం అందిస్తున్న రాయితీలు, సబ్సిడీలపై అవగాహన కల్పించి సాగుకు అవసరమైన సహకారం అందించాలని తెలిపారు. ప్రతి క్లస్టర్‌లో ఉన్న వ్యవసాయ విస్తరణ అధికారి తనకు నిర్దేశించిన 35 ఎకరాల లక్ష్యాన్ని సాధించాలన్నారు. మండలాల వారీగా అవగాహన సదస్సులు నిర్వహించి అయిల్‌పామ్ సాగు లాభాలను రైతులకు వివరించి, సాగు విస్తీర్ణం పెరిగేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారుల ను ఆదేశించారు.
యాప్‌ను సద్వినియోగం చేసుకోవాలి
రైతులకు ఎరువులను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన మొబైల్ యాప్‌ను సద్వినియోగం చేసుకోవాలని, ఈనెల 22 నుంచి యాప్ ద్వారా ఎరువులు పంపిణీ చేయాలని కలెక్టర్ డాక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. పట్టాదారులు పాస్‌బుక్ హోల్డర్లు తమ పట్టాదారు పాస్‌బుక్ నంబర్‌తో నేరుగా లాగిన్ కావాలని, పట్టాలేని రైతులు ఆధార్‌కార్డుతో రిజిస్టర్ కావాలని సూచించారు. ఎరువులు తీసుకునేటప్పుడు ఆధార్‌కార్డు తప్పనిసరిగా చూపించాలని, కౌలు రైతులు భూయజమాని పట్టాదారు పాస్‌బుక్ (పీపీబీ) నంబర్ నమోదు చేయాలని చెప్పారు. యజమాని మొబైల్ నంబర్‌కు వచ్చే ఓటీపీ ద్వారా ధ్రువీకరణ పూర్తి చేసుకున్న తర్వాత తమ ఆధార్ నంబర్, పేరు, తండ్రి పేరు నమోదు చేయాలని, తమ మొబైల్ నంబర్‌కు వచ్చే ఓటీపీని వెరిఫై చేసిన అనంతరం యూరియా బుకింగ్ చేసుకోవాలని పేర్కొన్నారు. మండల క్లస్టర్‌స్థాయి వ్యవసాయ అధికారులు యాప్ వినియోగంపై అవగాహన, శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి అనురాధ, జిల్లా ఉద్యానశాఖ అధికారి శ్రీనివాస్‌రావు, ఆయిల్‌పామ్ కంపెనీ జనరల్ మేనేజర్ సతీశ్ నారాయణ, వ్యవసాయ అధికారులు విజ్ఞాన్, రవీందర్, ఉద్యాన అఽధికారులు, విస్తరణ అధికారులు, కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు.
22న మాక్ ఎక్సర్‌సైజ్ నిర్వహించాలి
వరంగల్ చిన్నవడ్డేపల్లి చెరువు ప్రాంతంలో ఈనెల 22న మాక్ ఎక్సర్‌సైజ్ కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ డాక్టర్ సత్యశారద అఽధికారులనుఆదేశించారు. కలెక్టరేట్‌లో జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడారు. వరదలు, పారిశ్రామిక ప్రమాదాలు, విపత్తులు సంభవించిన సమయంలో ప్రాణనష్టం, ఆస్తినష్టం నివారించేందుకు చేపట్టాల్సి న తక్షణ చర్యలపై అధికారులు సన్నద్ధం కావాలని సూచించారు. హైదరాబాద్‌లోని టీజీ ఐసీసీసీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ఎన్‌డీఎంఏ మేజర్ సుధీర్, ఫైర్ సర్వీసెస్ డైరెక్టర్ నారాయణరావు, రెవెన్యూ శాఖ కార్యదర్శి లోకేశ్, ఎస్పీలు, సంబంధిత శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శుక్రవారం సమీక్ష నిర్వహించారు. మాక్ ఎక్సర్‌సైజ్ ఆవశ్యకత గురించి వివరించారు. జాతీయ విపత్తుల నిర్వహణ సంస్థ ఉన్నతాధికారులు దిశానిర్దేశం చేశారు. విపత్తులు సంభవించిన సమయంలో సమర్థవంతంగా ఎదుర్కొనేలా అన్ని విధాలుగా సన్నద్ధంగా ఉన్నట్లు కలెక్టర్ తెలిపారు. విపత్తుల నిర్వహణపై అప్రమత్తతను పెంపొందించేందుకు మాక్ ఎక్సర్ సైజ్ నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించినట్లు పేర్కొన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో డీఆర్వో విజయలక్ష్మి, అగ్నిమాపక శాఖ అధికారి శ్రీధర్‌రెడ్డి, ఇరిగేషన్, రెవెన్యూ, ఆర్‌అండ్‌బీ, ఎస్‌డీఆర్‌ఎఫ్, పశుసంవర్థక, పోలీసు అధికారులు పాల్గొన్నారు.
అధికారుల సమీక్షలో కలెక్టర్ డాక్టర్ సత్యశారద


