నేడు జాతరలపై సమావేశం
హన్మకొండ అర్బన్: సంక్రాంతిని పురస్కరించుకుని నిర్వహించనున్న ఐనవోలు, కొత్తకొండ జాతరలపై శనివారం కలెక్టరేట్‌లో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించనున్నట్లు హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ తెలిపారు. ఉదయం 9 గంటలకు ఐనవోలు జాతర, సాయంత్రం 4 గంటలకు కొత్తకొండ జాతర నిర్వహణపై స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారుల సమన్వయ సమావేశం నిర్వహించనున్నట్లు వివరించారు. ఈ సమీక్ష కార్యక్రమాల్లో రాష్ట్ర దేవాదాయ, శాఖ అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ, వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, ఇతర ప్రజాప్రతినిధులు అధికారులు పాల్గొననున్నారు. కాగా, గతంలో ఈ విధమైన సమావేశాలు స్థానికంగా ఆలయాల్లోనే నిర్వహించినప్పటికీ ప్రస్తుతం కలెక్టర్ రాష్ట్రస్థాయిలో నిర్వహించే ఇతర సమావేశాలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరు కావాల్సి ఉన్నందున వేదికను కలెక్టరేట్‌కు మార్చినట్లు సమాచారం.
రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు
వర్ధన్నపేట: రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలైన సంఘటన శుక్రవారం సాయంత్రం వర్ధన్నపేటలో చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. పర్వతగిరి మండలం వడ్లకొండ గ్రామానికి చెందిన మంద కొమ్మాలు, రాము తండ్రి కొడుకులు. పాలకుర్తి మండలం రంగరాయిగూడెంలో తమ బంధువుల ఇంట్లో శుభ కార్యానికి వారు బైక్‌పై వెళ్లి తిరిగి ఇంటికి వస్తున్నారు. ఈ క్రమంలో వర్ధన్నపేటలోని వరంగల్–జఫర్‌గఢ్ ప్రధాన రహదారిపై వెనుక నుంచి అతి వేగంతో వస్తున్న బొలేరో వాహనం బైక్‌ను ఢీకొంది. ఈ ఘటనలో గాయపడిన వారిని వెంటనే స్థానికులు వర్ధన్నపేట ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించగా చికిత్స పొందుతున్నారు.
శివరామపురంలో చోరీ
రాయపర్తి: మండలంలోని శివరామపురంలో దొంగలు హల్‌చల్ చేశారు. ఎస్సై ముత్యం రాజేందర్ కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన రావు రాజిరెడ్డి తన కుటుంబ సభ్యులతో కలిసి ఈనెల 18న వేములవాడకు వెళ్లాడు. దుండగులు గురువారం రాత్రి తాళం పగులగొట్టి ఇంట్లోకి ప్రవేశించి రూ.6.10 లక్షల నగదుతోపాటు తులం బంగారం చోరీ చేసినట్లు తెలిపారు. ఇటీవల ప్లాట్ విక్రయిస్తే వచ్చిన డబ్బులను ఇంట్లో దాచిపెట్టినట్లు బాధితుడు కన్నీటిపర్యంతమయ్యాడు. రాజిరెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని విచారణ చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
డ్రంకెన్ డ్రైవ్..
అంబులెన్స్ డ్రైవర్‌పై కేసు
రామన్నపేట: నగరంలోని వరంగల్ – నర్సంపేట రోడ్డు రాంకీ గేటు ఎదుట శుక్రవారం రాత్రి డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. వరంగల్ ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ సుజాత ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ తనిఖీల్లో లోహిత హాస్పిటల్‌కు చెందిన అంబులెన్స్ డ్రైవర్‌కు బ్రీత్ అనలైజర్ టెస్ట్ నిర్వహించగా 226 రీడింగ్ నమోదైంది. అత్యవసర సేవలకు ఉపయోగించే అంబులెన్స్‌ను మద్యం సేవించి నడపడం తీవ్ర నిర్లక్ష్యమని భావించిన పోలీసులు వెంటనే వాహనాన్ని నిలిపేసి డ్రైవర్‌పై కేసు నమోదు చేశారు.
నేడు జాతరలపై సమావేశం


