నియమావళి ఉల్లంఘిస్తే కఠిన చర్యలు
వరంగల్ ఈస్ట్ జోన్ డీపీపీ అంకిత్‌కుమార్
నడికూడ: ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు ఉంటాయని వరంగల్ ఈస్ట్ జోన్ డీసీపీ అంకిత్‌కుమార్ అన్నారు. సోమవారం మండలంలోని కంఠాత్మకూర్, మండల కేంద్రంలో నిర్వహిస్తున్న వాహనాల తనిఖీని పరకాల ఏసీపీ సతీశ్‌బాబుతో కలిసి ఆయన పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ.. ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ ప్రణాళికాబద్ధంగా పని చేయాలన్నారు. ఎన్నికల వేళ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని, శాంతియుతంగా ఎన్నికలు జరగడానికి అందరూ సహకరించాలన్నారు. కార్యక్రమంలో పరకాల సీఐ క్రాంతికుమార్, ఎస్సైలు రమేశ్, అశోక్, విఠల్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
ఓటర్లను ప్రలోభపెట్టొద్దు..
శాయంపేట: ఓటర్లను ప్రలోభపెట్టేలా నగదు, మద్యం, ఇతర వస్తువులను అక్రమంగా రవాణా చేయవద్దని వరంగల్ ఈస్ట్ జోన్ డీసీపీ అంకిత్ కుమార్ అన్నారు. సోమవారం రాత్రి మండలంలోని మాందారిపేట స్టేజ్ వద్ద వాహనాలు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతీ వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలించి ఆ వివరాలను నమోదు చేయాలని సిబ్బందికి సూచించారు. ఆయన వెంట పరకాల ఏసీపీ సతీశ్‌బాబు, శాయంపేట సీపీ రంజిత్ రావు, ఎస్సై జక్కుల పరమేశ్, సిబ్బంది ఉన్నారు.


