అస్తవ్యస్తంగా అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ ● స్మార్ట్ సిటీ ప్రధాన రహదారులపైకి మురుగు నీరు
వరంగల్ అర్బన్ : వరంగల్ నగరంలో ఆకర్షణీయ అభివృద్ధి పనుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. స్మార్ట్‌సిటీ రోడ్ల వెంట భూగర్భ డ్రెయినేజీల్లో నుంచి వెలువడుతున్న మురుగునీరు రోత పుట్టిస్తోంది. వరంగల్ తూర్పు నియోజకవర్గం అంటేనే పాలకులకు, అధికారులకు దశాబ్దల తరబడిగా చిన్నచూపే అన్న అపవాదును మూటగట్టుకుంటున్నారు. దీనికి కొనసాగింపుగా అధునాతన డక్ట్‌ల నిర్మాణాలకు బదులుగా అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ నిర్మాణం చేపట్టడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అభివృద్ధి పేరిట చేపట్టిన మురుగునీటి పారుదల పైపులైన్ల వ్యవస్థను చూసి ప్రజలు, ముఖ్యంగా వ్యాపారులు, వాహనదారులు చీదరించుకుంటున్నారు. ఓపెన్‌గా ఉన్న చాంబర్లు మృత్యుకుహరాలుగా మారాయి. ప్రధాన రహదారుల్లోని వ్యాపార, వాణిజ్య నిర్వాహకులతోపాటు వినియోగదారులు, ప్రయాణికులు ఓపెన్ చాంబర్లలో పడిపోతామోనని భయాందోళనకు గురవుతున్నారు.
రోడ్లపై బురద నీరు, దుర్వాసన..
తూర్పు పరిధిలో అస్తవ్యస్తంగా మారిన డ్రెయినేజీలు, రోడ్లపై మురుగు, బురద నీరు దుర్వాసన వెదజల్లుతున్నాయి. నెల, రెండు నెలలు కాదు. నాలుగేళ్లుగా ఓపెన్‌గా ఉన్న పైపులైన్ల చాంబర్లతో తీవ్ర అవస్థలకు గురవుతున్నారు. స్మార్ట్‌సిటీ పథకంలో భాగంగా గ్రేటర్ వరంగల్‌లోని తూర్పు నియోజకవర్గ పరిధిలో 9, పశ్చిమ నియోజక వర్గంలో 2 స్మార్ట్‌సిటీ రహదారులకు ఏడాదిన్నర కిందట టెండర్లను పిలిచి, ఏడాది కిందట ఖరారు చేశారు. ఈ రహదారుల పనులు రూ.36 కోట్లతో ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ఓ మాజీ ఎమ్మెల్యే కాంట్రాక్టు ను దక్కించుకున్నారు. నాలుగేళ్లుగా తూర్పు నియోజకవర్గంలోని 7 వ్యాపార, వాణిజ్య రహదా రుల్లో భూగర్భ డ్రెయినేజీ పనులు కొనసాగుతున్నా యి. రోడ్డు తవ్వి పైపులైన్ల నిర్మాణ పనులు చేపట్టారు.
అస్తవ్యస్తం, ఆగమాగం..
తూర్పు నియోజకవర్గ పరిధి ములుగు రోడ్డు నుంచి ఎంజీఎం, పోచమ్మమైదాన్, కాశిబుగ్గ, వెంకట్రామా జంక్షన్, స్టేషన్ రోడ్డు, జేపీఎన్ రోడ్లలో భూగర్భ డ్రెయినేజీ కోసం పైపులైన్లను నిర్మించారు. కానీ, పైపులైన్లకు సంబంధించిన చాంబర్లను నిర్మించలేదు. ఈ రహదారులు అస్తవ్యస్తంగా మారి ముఖ్యంగా వ్యాపారస్తులు, వినియోగదారులు నిత్యం అష్టకష్టాలు పడుతున్నారు. రోడ్డుపై మురుగు నీరు పారుతోంది. నాలుగేళ్లుగా పనులు పెండింగ్‌లో ఉండడం, కనీసం ప్రమాద సూచికలు కూడా ఏర్పాటు చేయకపోవడంతో వాహనదారులు ప్రమాదాల బారిన పడుతూ ఆస్పత్రుల పాలవుతున్నారు. ఆస్తి, నీటి పన్ను చెల్లించడంతో నెల ఆలస్యమైతే వడ్డీ బాదే బల్దియా అధికారులకు అభివృద్ధి పనులు ఆలస్యమై సమస్యలు సృష్టిస్తున్నా ఎందుకు పట్టించుకోవడం లేదని వ్యాపారులు బాహాటంగా విమర్శిస్తున్నారు. అప్పడు ఎమ్మెల్యే, ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే కాంట్రాక్టర్ కావడంతో ఇంజనీర్లు, ఉన్నతాధికారులు ప్రశ్నించేందుకు భయపడుతున్నారనే ఆరోపణలున్నాయి.
కాంట్రాక్టర్‌కు 3 సార్లు నోటీసులు జారీ చేశాం
స్మార్ట్‌సిటీ పనుల్లో భాగంగా భూగర్భ డ్రెయినేజీని ర్మిస్తున్నాం. పైపులైన్లపై చాంబర్లపై కప్పులు ఏర్పా టు చేయాలి. కొన్నిచోట్ల ఫుట్‌పాత్‌లు తదితర పనులు చేపట్టాలని మూడు సార్లు నోటీసులు జారీ చేశాం. పనులు చేపట్టకపోతే చర్యలు ఉంటాయి. బల్దియా ద్వారా రెండు ప్యాకేజీలుగా రూ.80 లక్షల నిధులు కేటాయించాం.
– సంతోశ్, బల్దియా ఈఈ
మూతల్లేని చాంబర్లు.. ప్రమాదాల బారిన వాహనదారులు
సంవత్సరాల తరబడి
అభివృద్ధి పనులు పెండింగ్
ఇదేం సిటీ అంటూ ప్రజల పెదవి విరుపు
ఆకర్షణీయం.. భూగర్భ శోకం!
ఆకర్షణీయం.. భూగర్భ శోకం!


