నకిలీ వైద్యులపై కేసు
ఎంజీఎం: ఎలాంటి అర్హత లేకుండా శస్త్రచికిత్స చేసి యువకుడిని ప్రాణాపాయస్థితికి తెచ్చిన కొత్తపల్లి కౌసల్య, ఆమెకు సహకరించిన నకిలీ వైద్యుడు/ఆర్‌ఎంపీ బైరు చిట్టిబాబుపై కేసులు నమోదు చేయనున్నట్టు తెలంగాణ మెడికల్ కౌన్సిల్ పబ్లిక్ రిలేషన్ కమిటీ చైర్మన్ డాక్టర్ వి.నరేశ్‌కుమార్ తెలిపారు. ఇటీవల మంగళవారిపేటలో నకిలీ వైద్యులు నిర్వహించిన అర్షమొలల ఆపరేషన్ వికటించి ప్రాణాపాయ స్థితికి చేరుకుని ఎంజీఎంలో చికిత్స పొందుతున్న రజనీకాంత్ కేసును తెలంగాణ మెడికల్ కౌన్సిల్ బృందం ఆదివారం క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టింది. ఈ తనిఖీల్లో నకిలీ వైద్యుడు బైరు చిట్టిబాబు అక్రమంగా నిల్వ ఉంచిన డైక్లోఫెనాక్, జెంటామైసిన్, డెక్సామెతాసోన్, ఇతర ఇంజక్షన్లను వారు స్వాధీనం చేసుకున్నారు. అర్హత లేకుండా వైద్య సేవల పేరుతో ఇంజక్షన్లు ఇస్తున్నట్లు విచారణలో అతడు అంగీకరించాడని, కౌసల్య నిర్వహించిన ఆపరేషన్‌లో తాను మత్తు ఇంజక్షన్ మాత్రమే ఇచ్చానని తెలిపాడని బృంద సభ్యులు చెప్పారు. అనంతరం కొత్తపల్లి కౌసల్య ఆపరేషన్ చేసిన ఇంటి ప్రదేశాన్ని పరిశీలించారు. ఒక పరదా వెనుక అపరిశుభ్రమైన స్థలం, పాత బెంచ్‌ను ఆపరేషన్ టేబుల్‌గా చూపించడంతో విచారణ కమిటీ సభ్యులు విస్తుపోయారు. నెలకు రెండు మూడు ఆపరేషన్లు చేస్తున్నట్లు తనకు ఏ అర్హత లేదని ఆమె స్వయంగా తెలిపిందని వివరించారు. ఈ విధంగా కొందరికి ఇంతకుముందు కూడా వికటించిందని విచారణలో తెలిపిందన్నారు. ఈ సందర్భంగా నరేశ్‌కుమార్ మాట్లాడుతూ.. నకిలీ వైద్యుల సమాచారం తెలిస్తే తక్షణమే పోలీసులు, 91543 82727 వాట్సాప్ ద్వారా కౌన్సిల్‌కు సమాచారం ఇవ్వాలని కోరారు. తనిఖీల్లో టీజీఎంసీ కో ఆప్టెడ్ మెంబర్ డాక్టర్ వెంకటస్వామి పాల్గొన్నారు.
టీజీఎంసీ పబ్లిక్ రిలేషన్ కమిటీ చైర్మన్
డాక్టర్ నరేశ్‌కుమార్
నకిలీ వైద్యులపై కేసు


