తెలంగాణ ఇమేజ్ పెంచుతాం
ధర్మసాగర్: చేపల ఉత్పత్తిలో తెలంగాణ ఇమేజ్ పెరిగేలా ప్రభుత్వం చర్యలు చేపడుతున్నట్లు రాష్ట్ర పశు సంవర్థక, మత్స్య, డెయిరీ అభివృద్ధి, క్రీడలు, యువజన శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. ఆదివారం స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, రాష్ట్ర మత్స శాఖ సంచాలకులు నిఖిల, హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్, తదితరులతో కలిసి ధర్మసాగర్ రిజర్వాయర్‌లో ఆయన మంత్రి చేప పిల్లలను వదిలారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో వాకిటి శ్రీహరి మాట్లాడుతూ.. మత్స్యకారుల సంక్షేమమే ధ్యేయంగా ఈ సంవత్సరం రాష్ట్ర వ్యాప్తంగా 26 వేల చెరువుల్లో 84 కోట్ల చేప పిల్లలు, 10 కోట్ల రొయ్యపిల్లలు వదిలేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తెలిపారు. ఈమేరకు మత్స్య శాఖకు సీఎం రేవంత్‌రెడ్డి రూ.123 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గంలో చేప పిల్లల, రొయ్యల ఉత్పత్తి కేంద్రం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ప్రభుత్వం మత్స్యకారులకు రూ.1.40 కోట్లతో బీమా చెల్లించినట్లు, మత్స్యకార సహకార సంఘాల్లో మత్స్యకారులకు సభ్యత్వం కల్పిస్తామన్నారు.
గ్రిల్స్ ఏర్పాటు చేయాలి..
స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ.. ఇరిగేషన్ శాఖ అధికారులు తూముల ద్వారా నీళ్లు వదిలిపెట్టినప్పుడు చిన్న చిన్న చేప పిల్లలన్నీ కొట్టుకపోతున్నాయని, తద్వారా వారికి రావాల్సిన దిగుబడి రావడం లేదన్నారు. అందుకని సాగునీటి పారుదల శాఖ అధికారులు తక్షణమే ఐరన్‌తో చేసిన గ్రిల్స్‌ను ఏర్పాటు చేయాలని సూచించారు. అనంతరం హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ మాట్లాడుతూ.. ధర్మసాగర్ రిజర్వాయర్‌లో 12 లక్షల చేప పిల్లల్ని వదులుతున్నామన్నారు. గతేడాది 6 లక్షల చేప పిల్లలని వదలగా 250 టన్నుల వరకు దిగుబడి, రూ.25–30 లక్షల వరకు ఆదాయం వచ్చినట్లు తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్, రాష్ట్ర మత్స్య శాఖ చైర్మన్ సాయికుమార్, రాష్ట్ర తెలంగాణ ముదిరాజ్ కో–ఆపరేటివ్ సొసైటీ కార్పొరేషన్ చైర్మన్ బొర్రా జ్ఞానేశ్వర్, తెలంగాణ రాష్ట్ర క్రీడల ప్రాధికారిక సంస్థ చైర్మన్ శివసేనారెడ్డి, మత్స్య శాఖ అదనపు సంచాలకులు శ్రీనివాస్, డీడీ హనుమంతరావు, జిల్లా మత్స్య శాఖ అధికారి శ్రీపతి, చీఫ్ ప్రమోటర్ మల్లేశం, సోమయ్య, తహసీల్దార్ సదానందం, ఎంపీడీఓ అనిల్ కుమార్, మత్స్య సహకార సంఘాల సభ్యులు పాల్గొన్నారు.
చేపల ఉత్పత్తికి చర్యలు తీసుకుంటాం..
మంత్రి వాకిటి శ్రీహరి
ధర్మసాగర్ రిజర్వాయర్‌లో
చేపపిల్లల విడుదల


