– హన్మకొండ/ఖిలావరంగల్/హసన్‌పర్తి/ మహబూబాబాద్ అర్బన్
కదిలే ప్రతీ జీవికి ఈ భూమ్మీద జీవించే హక్కు ఉంది. అవన్నీ మనగలిగితేనే మానవాళి ముందుకు సాగుతుంది. ఆ విషయాన్ని గుర్తించిన కొందరు తమ వంతుగా వాటికి సాయం చేస్తున్నారు. పిచ్చుక గూళ్లను పంపిణీ చేస్తూ పంటల రక్షణకు తోడ్పడుతున్నారు. పక్షులకు ఆహారం అందిస్తూ పర్యావరణ సమతుల్యతను కాపాడుతున్నారు. చీమలకు ఆహారమందిస్తూ మట్టిని సారవంతం చేసేందుకు ఉపయోగపడుతున్నారు. కుక్కలను పెంచుతూ ఆనందం, ఆహ్లాదాన్ని పొందుతున్నారు. జీవ వైవిధ్యంలో తమవంతు పాత్ర పోషిస్తున్న ఉమ్మడి వరంగల్ జిల్లాలోని జీవచరాల బంధువులపై ‘సాక్షి’ సండే స్పెషల్ కథనం.
‘చీమా.. చీమా ఎక్కడున్నావమ్మా’ అంటూ వెతికి మరీ వాటి కడుపు నింపుతున్నారు వాకర్స్. హనుమకొండకు చెందిన శివకుమార్, గోయల్ వాకింగ్ కోసం ప్రతీ రోజు పబ్లిక్ గార్డెన్‌కు వస్తుంటారు. నడక మొదలు పెట్టే ముందే.. చీమలు ఎక్కడున్నాయా.. అని వెతికి మరీ వెంట తెచ్చుకున్న గోధుమ పిండి, చక్కెర చల్లుతారు. సనాతన ధర్మం, రుగ్వేదంలో జీవుల పట్ల దయ కలిగి ఉండాలని, ఆహారాన్ని వృథా చేయకుండా ప్రాణులకు అందించాలని ఉందని వారు చెబుతున్నారు. కాగా, నిత్యం చపాతీలు చేసిన అనంతరం కింద పడిన, మిగిలిన పిండిలో చక్కెర కలిపి చీమలకు వేస్తున్నట్లు
చెబుతున్నారు.
హనుమకొండ పబ్లిక్ గార్డెన్‌లో చీమలకు చక్కెర కలిపిన పిండిని ఆహారంగా వేస్తున్న శివకుమార్
హనుమకొండ పబ్లిక్ గార్డెన్‌లో చీమలకు ఆహారం వేస్తున్న గోయల్
హనుమకొండ జిల్లా హసన్‌పర్తి మండలం చింతగట్టులోని మహర్షి గోశాల ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచితంగా పిచ్చుక గూళ్లు, వరికంకులు పంపిణీ చేస్తున్నారు. ఎస్‌ఆర్‌ఎం ఫౌండేషన్ సహకారంతో ‘జీవులపై దయ చూపి జీవ వైవిధ్యం కాపాడుదాం’ నినాదంతో ఈ కార్యక్రమం చేపడుతున్నారు. మహర్షి గోశాల ట్రస్ట్ ఆధ్వర్యంలో తమిళనాడు నుంచి పక్షి గూళ్లను కొనుగోలు చేసి ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. వరి కంకులను ఇక్కడే అల్లుతున్నారు. ఇప్పటి వరకు ఆరునెలల్లో 2 వేలకుపైగా పిచ్చుక గూళ్లు పంపిణీ చేసినట్లు మహర్షి గోశాల ట్రస్ట్ నిర్వాహకుడు డాక్టర్ ఎస్.రమేశ్ తెలిపారు.
జీవవైవిధ్యానికి తోడ్పడుతున్న ఉమ్మడి వరంగల్‌వాసులు
వాటి ఆకలిదప్పికలు తీరుస్తూ ఆదర్శం సొంత డబ్బులతో ప్రకృతి సేవ పర్యావరణ సమతుల్యతకు దోహదం
– హన్మకొండ/ఖిలావరంగల్/హసన్‌పర్తి/ మహబూబాబాద్ అర్బన్


