ఆకేరు.. అందని నీరు
వర్ధన్నపేట: ఆకేరు వాగు.. వర్ధన్నపేట పరిసర ప్రాంతాల ప్రజలకు కల్పతరువు. సాగు, తాగునీరు అందించడంతోపాటు భూగర్భ జలాలను పెంపొందిస్తోంది. ఇంతటి ప్రాధాన్యం గల ఆకేరు వాగును అధికారులు, ప్రజాప్రతినిధులు నిర్లక్ష్యం చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. వాగుపై నిర్మించిన చెక్‌డ్యాం తరచుగా వర్షాలకు తెగిపోవడం ఆనవాయితీగా మారింది. దీంతో మూడేళ్లుగా వాగులో నీరు లేకపోవడంతో రైతులు, వర్ధన్నపేట పట్టణవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
నీరు ఉంటేనే ఆయకట్టు సాగు..
ఆకేరు వాగుపై చెక్‌డ్యాం పటిష్టంగా నిర్మాణం చేపట్టకపోవడం, నిర్లక్ష్యంగా వ్యవహరించడంతోనే ఇలాంటి దుస్థితి నెలకొంటుందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. లక్షలాది రూపాయలు నిర్మాణానికి వెచ్చించినా చివరకు కట్ట తెగిపోతుండడంతో ఈ ప్రాంత రైతులు, ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఆకేరు వాగులో నీరు నిల్వ ఉంటే పరివాహక ప్రాంతంలో 400 ఎకరాలకు సాగునీరందుతుంది. అదేవిధంగా వర్ధన్నపేట, ఇల్లంద గ్రామాల్లో భూగర్భ జలాలు పెరుగుతాయి. తాగునీటి ఎద్దడి సమస్య తీరుతుంది.
అరకొర నిధులతో పనులు ..
సుమారు 36 మీటర్ల మేర తెగిన కట్టను నిర్మించడంతోపాటు పైపులైన్ల నుంచి నీరు ఎలాంటి అడ్డంకులు లేకుండా వెళ్లేందుకు రూ.33 లక్షలు మంజూరుచేశారు. ఈ అరకొర నిధులతో పనులు చేపడుతున్నట్లు రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శాశ్వత పరిష్కారం దిశగా అధికారులు, ప్రజాప్రతినిధులు ఆలోచించడం లేదని వారు మండిపడుతున్నారు. శాశ్వత పనులు చేపట్టాలంటే రూ.8 కోట్ల నుంచి రూ.9 కోట్ల వ్యయం అవుతుందని అధికారులు చెబుతున్నారు. ఈ నిధులు ఉపశమనానికి మాత్రమే తప్ప సమస్యకు శాశ్వత పరిష్కారం చూపవనే వాదనలు కూడా ఉన్నాయి. ఇప్పటికై నా నిధులు మంజూరు చేసి శాశ్వత ప్రాతిపదికన కట్ట నిర్మాణం చేపట్టాలని వర్ధన్నపేట, ఇల్లంద ప్రజలు, రైతులు కోరుతున్నారు.
తాత్కాలిక పనులతో ప్రయోజనం శూన్యం..
ఆకేరు వాగు చెక్‌డ్యాం 2023 సంవత్సరంలో తెగిపోగా అప్పుడు తాత్కాలికంగా కట్ట నిర్మించారు. ఆ కట్ట గత వర్షాకాలంలో తెగిపోగా తిరిగి ఈ వర్షాకాలం ముందు ఇసుక బస్తాలతో అడ్డుకట్ట వేశారు. ఈ తాత్కాలిక కట్ట ప్రస్తుతం కురిసిన భారీ వర్షానికి వరద ప్రవాహంతో తెగిపోయింది. దీంతో ఆకేరు వాగులో నీరు ఖాళీ అయిపోయింది. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో శాశ్వత ప్రాతిపదికన సిమెంట్, కంకరతో నిర్మించిన కట్ట వరద ప్రవాహానికి కొట్టుకుపోయింది.
వాగుపై తరచూ తెగిపోతున్న చెక్‌డ్యాం
మూడేళ్లుగా తాత్కాలిక మరమ్మతులతోనే సరి
రూ.లక్షలు వెచ్చిస్తున్నా మళ్లీ యథాతథ స్థితే..
శాశ్వత కట్ట నిర్మిస్తేనే పెరగనున్న భూగర్భ జలాలు
400 ఎకరాల ఆయకట్టుకు అందనున్న సాగునీరు


