
కలిసిరాని సాగు
భారీ వర్షాలతో తగ్గిన పత్తి, మొక్కజొన్న దిగుబడి
● జిల్లాలో రైతులకు తీవ్ర నష్టం
● పెట్టుబడి కూడా రాని పరిస్థితి
● మార్కెట్‌లో పంటలకు లభించని మద్దతు ధర
నర్సంపేట: ప్రకృతి విపత్తులు, పంటలకు తెగుళ్లు ఆశించడం, పెట్టుబడి పెరగడం, దిగుబడి తగ్గడం, మద్దతు ధర లేకపోవడంతో రైతులు కుదేలవుతున్నారు. వ్యవసాయం అంటేనే బెంబేలెత్తుతున్నారు. ఈ ఏడాది భారీ వర్షాల వల్ల జిల్లాలో పత్తి, మొక్కజొన్న పంటలు సాగు చేసిన రైతులకు కోలుకోలేని నష్టం కలిగింది. పత్తి పంట ఎర్రబడి ఎదగకపోవడంతో గతం కంటే 80 శాతం దిగుబడి తగ్గింది. మొ క్కజొన్న పంటది కూడా అదే పరిస్థితి ఉండడంతో రైతులకు పెట్టుబడి కూడా రాని పరిస్థితి నెలకొంది.
15 వేల ఎకరాల్లో మొక్కజొన్న సాగు..
జిల్లాలో 15 వేల ఎకరాల విస్తీర్ణంలో మొక్కజొన్న పంటను రైతులు సాగుచేశారు. పంట వేసిన మొదట్లో కత్తెర పురుగు సోకడంతో రైతులు పెట్టుబడి భారీగా పెట్టారు. పంట చేతికి వచ్చే సమయంలో భారీ వర్షాలు కురిసి దిగుబడి తగ్గింది. ఎకరాలకు 30 నుంచి 40 క్వింటాళ్లు రావాల్సి ఉండగా.. 15 నుంచి 20 క్వింటాళ్లకు దిగుబడి పడిపోయింది. రాష్ట్ర ప్రభుత్వం మార్క్‌ఫెడ్ ద్వారా బుధవారం నుంచి కొనుగోళ్లు చేపట్టాలని ఆదేశించినా జిల్లాలో కనిపించని పరిస్థితి నెలకొంది. క్వింటాలుకు రూ.2,400 మద్దతు ధర ప్రకటించినప్పటికీ కొనుగోలు కేంద్రాలు లేకపోవడంతో రైతులు ప్రైవేట్‌కు తక్కువ ధరకు అమ్ముకోవాల్సి వస్తోంది.
1,18,026 ఎకరాల్లో పత్తి..
జిల్లాలో 1,18,026 ఎకరాల విస్తీర్ణంలో రైతులు పత్తి పంట సాగుచేశారు. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ మొదట్లో కురిసిన కొద్దిపాటి వర్షానికి పత్తి గింజలను కొనుగోలు చేసి విత్తారు. వర్షాలు ముఖం చాటేయడంతో మొలక దశలోనే ఎండిపోయాయి. తిరిగి రెండోసారి విత్తనాలను కొనుగోలు చేసిన రైతులు పత్తి పంటను సాగు చేయగా పెట్టుబడి రెండింతలు అయ్యింది. భారీ వర్షాలతో పత్తి పంటలో పూత, కాత రాలిపోయి కొద్దిపాటి దిగుబడే వచ్చింది. పెట్టిన పెట్టుబడి కూడా రాలేని పరిస్థితి ఉంది. అప్పులు చేసి పత్తి పంట కాపాడుకున్నప్పటికీ మార్కెట్లో ధర రూ.5,500 వరకు మాత్రమే పలుకుతోంది. దీంతో రైతులు భారీగా నష్టపోతున్నారు. దీపావళి తర్వాత సీసీఐ ద్వారా పత్తి కొనుగోలు చేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు. కపాస్ కిసాన్ యాప్ ద్వారా నమోదు చేసుకున్న రైతులు మాత్రమే పత్తిని విక్రయించుకునే పరిస్థితి ఉంది.

కలిసిరాని సాగు

కలిసిరాని సాగు