
పశువులకు టీకాలు వేయించాలి
● డీవీహెచ్‌ఓ బాలకృష్ణ
ఖానాపురం: రైతులు పశువులకు గాలికుంటు నివారణ టీకాలు తప్పకుండా వేయించాలని డీవీహెచ్‌ఓ బాలకృష్ణ సూచించారు. మండల కేంద్రంలోని పశువైద్యశాలలో బుధవారం గాలికుంటు నివారణ టీకాల పంపిణీ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. టీకాల కార్యక్రమం నవంబర్ 14 వరకు జిల్లా వ్యాప్తంగా కొసాసాగుతుందని తెలిపారు. టీకాలు వేస్తే పశువుల్లో అనేక వ్యాధులను నివారించుకోవడానికి అవకాశం ఉంటుందన్నారు. దూడల పెరుగుదలకు జాగ్రత్తలు పాటించాలని, పశువులకు ఎలాంటి వ్యాధులు సోకినా నివారణ చర్యలకు గ్రామీణ ప్రాంతాల్లో గోపాలమిత్రలు అందుబాటులో ఉంటారని పేర్కొన్నారు. అనంతరం టీకాల పంపిణీపై ముద్రించిన వాల్‌పోస్టర్లను ఆవిష్కరించారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ శాఖమూరి హరిబాబు, ఏడీఏ బీఎన్‌రెడ్డి, పశువైద్యాధికారులు సాధినేని శ్రీలక్ష్మి, వింధ్య, సిబ్బంది, గోపాలమిత్రలు పాల్గొన్నారు.