
‘ఓరుగల్లు’కు బీజేపీ మొండిచెయ్యి
సాక్షిప్రతినిధి, వరంగల్:
భారతీయ జనతా పార్టీ అగ్రనాయకత్వం ఉమ్మడి వరంగల్‌కు మొండిచెయ్యి చూపింది. రాష్ట్ర కమిటీలో ఈసారి ఒక్కరికి కూడా ఛాన్స్ ఇవ్వలేదు. సోమవారం ప్రకటించిన రాష్ట్ర కమిటీలో ఉమ్మడి జిల్లాకు చెందిన సీనియర్లకు ఉద్వాసన పలికింది. కమిటీలో 8 మంది ఉపాధ్యక్షులు, ముగ్గురు ప్రధాన కార్యదర్శులు, 8 మంది కార్యదర్శులు, ఇద్దరు కోశాధికారులు, ఒక జాయింట్ ట్రెజరరీ, ఒక అధికార ప్రతినిధి కలిపి 22 మంది ని ప్రకటించారు. ఈ కమిటీలో ఉమ్మడి జిల్లాలో పార్టీ ఆవిర్భావం నుంచి కీలకంగా వ్యవహరిస్తున్న సీనియర్లకు అవకాశం ఇవ్వకపోడంపై పెద్ద చర్చే జరుగుతోంది.
మొండిచెయ్యి ఇదే మొదటి సారి..
ప్రతీసారి రాష్ట్ర కమిటీలో ఉమ్మడి వరంగల్‌కు తగిన ప్రాధాన్యత దక్కేది. సీనియర్లుగా ఉన్న ముగ్గురునుంచి ఐదుగురికి అవకాశం కల్పించిన సందర్భాలే ఉన్నాయి. బండి సంజయ్‌కుమార్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో.. ఆ తర్వాత వచ్చిన కిషన్ రెడ్డి కూడా సీనియర్లకు అవకాశం కల్పించారు. 2023, జూలై 4న బండి సంజయ్.. ఆ తర్వాత పగ్గాలు చేపట్టి జి.కిషన్ రెడ్డిలు పూర్తిస్థాయిలో రాష్ట్ర కమిటీ వేశారు. అందులో ఉమ్మడి జిల్లానుంచి డాక్టర్ గుండె విజయ రామారావు (ఉపాధ్యక్షుడు), గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి (ప్రధాన కార్యదర్శి), ఏనుగుల రాకేష్ రెడ్డి (అధికార ప్రతినిధి, ప్రస్తుతం బీఆర్‌ఎస్‌లో ఉన్నారు), చందుపట్ల కీర్తిరెడ్డి (అధికార ప్రతినిధి), జాటోత్ హుస్సేన్ నాయక్ (ఎస్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు), కొండేటి శ్రీధర్ (ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు)లకు అవకాశం కల్పించారు. ఈసారి కూడా ఉమ్మడి వరంగల్‌కు రాష్ట్ర కమిటీలో సముచిత స్థానం దక్కుతుందని భావించినా.. ఒక్కరికీ కూడా అవకాశం కల్పించకపోవడంపై సీనియర్లు భగ్గుమంటున్నారు. 1980లో పార్టీ ఆవిర్భావం తర్వాత రాష్ట్ర కమిటీలో జిల్లాకు ప్రాతినిధ్యం లేకుండా సందర్భం లేదని, సుమారు నాలుగున్నర దశాబ్దాల తర్వాత బహుశా ఇది మొదటి సారని పార్టీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు.
ఓరుగల్లు నుంచి మహామహులు...
బీజేపీ, జనసంఘ్.. పార్టీలకు ఉమ్మడి వరంగల్ పెద్దపీట వేసింది. బీజేపీ ఆవిర్భావం తర్వాత ఈ జిల్లాలో ఉన్నంత బలం బలగం ఎక్కడా లేదన్న వ్యాఖ్యలు నాయకత్వం చేసిన సందర్భం. ఎంపీగా పోటీ చేసిన చందుపట్ల జంగారెడ్డి ఏకంగా పీవీ నర్సింహరావును ఓడించడం.. ఎమ్మెల్యేగా కూడా ఓసారి పార్టీ బ్యానర్ మీదే గెలిచారు. బీజేపీనుంచి ఎమ్మెల్యేలుగా టి.రాజేశ్వర్‌రావు, జయపాల్, వన్నాల శ్రీరాములు, మార్తినేని తదితరులు ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. పార్టీ అధిష్టానం కూడా ప్రతీసారి సంస్థాగత పదవుల విషయంలో వరంగల్‌కు పెద్దపీట వేస్తూ వచ్చింది. ఈసారి కూడా రాంచందర్‌రావు టీములో సీనియర్‌లకు ఛాన్స్ ఉంటుందని భావిస్తే తీవ్ర నిరాశకు గురి కావాల్సి వచ్చింది.
రాష్ట్ర కమిటీలో సీనియర్ల ఊసేది..?
పూర్వ వరంగల్ జిల్లాలో వన్నాల శ్రీరాములు, మాజీ మంత్రి గుండె విజయరామారావు, మాజీ ఎమ్మెల్యేలు అరూరి రమేష్, కొండేటి శ్రీధర్, మార్తినేని ధర్మారావు, డాక్టర్ టి.రాజేశ్వర్‌రావు, రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, చందుపట్ల కీర్తిరెడ్డి, రావు పద్మలలో ఎవరికీ ఈసారి కమిటీలో చోటు దక్కలేదు. అదేవిధంగా పార్టీలో సీనియర్లుగా ఉన్న ఆరుట్ల దశమంతరెడ్డి, కేవీఎల్‌ఎన్ రెడ్డి, డాక్టర్ కాళీప్రసాద్, ఎడ్ల అశోక్‌రెడ్డి, చాడ శ్రీనివాస్ రెడ్డి, రావుల కిషన్, కోరబోయిన సాంబయ్య, గుజ్జ సత్యనారాయణరావు, గంట రవికుమార్, ముక్కెర తిరుపతిరెడ్డిలతో పాటు పలువురు కూడా రాష్ట్ర కమిటీలో పదవులు ఆశించగా.. అధిష్టానం సీనియర్లను విస్మరించిందన్న చర్చ పార్టీలో జరుగుతోంది.
రాష్ట్ర కమిటీలో ఎవరికీ
చోటివ్వని హైకమాండ్
సీనియర్లను పట్టించుకోని
పార్టీ అధిష్టానం
పార్టీ ఆవిర్భావం తర్వాత
ఇదే మొదటిసారి
ప్రతీసారి కమిటీలో
ముగ్గురు నుంచి ఐదుగురు
అధిష్టానం తీరుపై ‘కాషాయం’ నేతల కారాలు, మిరియాలు